లోక్ సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ కన్నుమూత
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అత్యధిక కాలం లోక్ సభ స్పీకర్ గా విధులు నిర్వర్తించిన బలరామ్ జక్కర్(93) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
అత్యధిక కాలం(10 ఏళ్లు- 1980 నుంచి 1989 వరకు) స్పీకర్ గా పనిచేసిన రికార్డు ఇప్పటికీ జక్కర్ పేరుమీదే ఉంది. ప్రజలు, పరిపాలన పట్ల సభ్యుల ధృక్పథంలో సహేతుక మార్పు కోసం కృషి చేసిన ఆయన ఆధ్వర్యంలోనే పార్లమెంటులో లైబ్రరీ, రిఫరెన్స్, రీసెర్చ్,డాక్యుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ విభాగాలు ఏర్పాటయ్యాయి. ఆర్ధిక సరళీకరణలకు నాందిపలికిన పీవీ నర్సింహారావు హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా.. విదేవీ పెట్టుబడుల ఉధృతికి దేశ వెన్నెముక(రైతు) విరిగిపోకుండా తెలివిగా వ్యవహరించారు బలరామ్ జక్కర్. ఎమ్మెల్యేగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం రెండు రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా అనేక మలుపులు తిరిగింది.
1923, ఆగస్టు 23న పంజాబ్ లోని పాంచ్ కోసీ గ్రామంలో జన్మించిన బలరామ్ జక్కర్ లాహోర్ క్రిస్టియన్ కాలేజీ నుంచి సంస్కృతంలో డిగ్రీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి.
జక్కర్ తల్లిదండ్రులపేర్లు చౌదరి రాజారామ్, పటోదేవి. పంజాబ్ మాజీ మంత్రి సజ్జన్ కుమార్.. బలరామ్ పెద్ద కొడుకే. చిన్నకొడుకు సునీల్ జక్కర్ 2012 నుంచి పంజాబ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. బలరామ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్ధుల్లా, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కూడా ఉన్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది.