అహ్మదాబాద్: డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో నల్లధనం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఓ వైపు పారదర్శకత, అవినీతి లేని రాజకీయాలు అంటూనే...అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం విధించిన పరిమితిని రాజకీయ నాయకులు గాలికొదిలేశారు. అయితే నల్లధనాన్ని రవాణా చేస్తున్నప్పుడు తనిఖీల్లో పట్టుబడకుండా, అధికారుల కళ్లుగప్పేందుకు నేతలు ఇక్కడ కొత్త అడ్డదారులు వెతుక్కున్నారు. వజ్రాభరణాలు రవాణా చేసే ఆంగాడియాల కొరియర్ నెట్‌వర్క్‌ను హవాలా మార్గంలో డబ్బు పంపడానికి పార్టీలు వాడుకుంటున్నాయి. ఈ సంచలన విషయాలు ‘ఇండియా టుడే’ రహస్య పరిశీలనలో వెల్లడయ్యాయి.
ఎలా జరుగుతుంది..?
రాజకీయ నాయకులు ఎక్కడికైనా డబ్బును పంపాలంటే ముందుగా ఆ మొత్తాన్ని స్థానిక ఆంగాడియా కార్యాలయానికి తరలిస్తారు. ఇక్కడ భౌతికంగా నగదు రవాణా ఉండదు. నేతలు ఇచ్చిన డబ్బును ఆంగాడియాలు తమ దగ్గరే పెట్టుకుంటారు. ఆ తర్వాత నగదు ఏ ఊరికి పంపమని చెప్పారో, అక్కడ ఉన్న తమ ఆంగాడియా కార్యాలయానికి ఫోన్ చేస్తారు. ఫలానా మనిషి వస్తాడు, డబ్బు ఇచ్చేయండి అని చెబుతారు.
ఇలా భౌతికంగా నగదు రవాణా లేకపోవడంతో తనిఖీల్లో పట్టుబడే అవకాశం కూడా తక్కువ. రాజకీయ నాయకులతోపాటు కొంతమంది అధికారులు కూడా డబ్బును హవాలా ద్వారా పంపడానికో లేదా అక్రమ సంపాదనను దాయడానికో ఆంగాడియాలను ఉపయోగించుకుంటూ ఉంటారట. ఇలా డబ్బు సరఫరా చేయడానికి కొన్ని ఆంగాడియాలు ఒక రోజు వ్యవధి తీసుకుంటూ ఉండగా, మరికొంత మంది మాత్రం గంట నుంచి రెండున్నర గంటల్లోపే అవతలి పార్టీకి డబ్బు అందజేస్తున్నారు.
ఓ ఆంగాడియా కార్యాలయంలోని ఏజెంట్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ వద్ద ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పారు. ఇంతకుముందు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా తాము ఇక్కడ నుంచి డబ్బు అక్కడకు పంపామనీ, ఒక రాష్ట్రంలో డబ్బు తీసుకుని మరో రాష్ట్రంలో అందజేయాలంటే కోటి రూపాయలకు కమీషన్‌గా రూ.40,000...అదే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపాలంటే రూ.కోటికి రూ.15 వేలు కమీషన్ తీసుకుంటామని ఏజెంట్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment