ఆ నవ్వు వెనక చెప్పలేనంత కష్టం!
భారత్కు చెందిన ఓ యువతి న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో గురువారం పాల్గొని ర్యాంపుపై చిరునవ్వులు చిందించింది. ఇందులో విశేషం ఏముందంటారా..! ఆమె అందరు మోడల్స్ లా కాదు. యాసిడ్ దాడి బాధితురాలు అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉంది. యాసిడ్ దాడిలో ఓ కంటిని కోల్పోయిన రేష్మా ఖురేషీ(19) ఎంతో మనో వేదనకు గురైంది. 2014లో తన బావ(అక్క భర్త), అతడి స్నేహితులు కలిసి ఖురేషి ముఖంపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఏదో సాధించాలన్న కసితో ఉన్న ఆమె ఎగిసిన కెరటంలా ముందడుగు వేసింది.
భారతీయ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన డిజైన్లను న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేస్తూ ప్రదర్శించింది. ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది తనకు చాలా గొప్ప అనుభవమని ఖురేషీ పేర్కొంది. ఈ ఈవెంట్ లో పాల్గొని తనలాగ యాసిడ్ దాడికి గురైన ఎంతో మంది మహిళలకు ఈ సందర్భంగా సందేశాన్నిచ్చింది. మనం ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఇతర వ్యక్తుల తరహాలోనే జీవితాన్ని మనం కూడా ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చింది. తనలాంటి వారిని తక్కువ చేసి చూడకూడదని, అవకాశమిస్తే అందరిలా తాము బయటకు వెళ్లగలమని, ఏదైనా చేయగలమని ధీమా వ్యక్తం చేసింది.
సరిగ్గా గురువారమే.. ప్రీతిరాఠి అనే నర్సుపై 2013లో యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమైన నేరస్థుడు అంకుర్ లాల్ పన్వార్కు ప్రత్యేక మహిళల న్యాయస్థానం ఉరి శిక్ష విధించడం గమనార్హం.