ముంబై: వచ్చే ఐదేళ్లలో దేశంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 150 బిలియన్ డాలర్లు(రూ. 9.75 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు.
‘వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వే శాఖలోనే 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఆ మొత్తాన్ని ఉద్యోగాల రూపంలో చెప్పాలంటే... ఈ పెట్టుబడుల ద్వారా 10 లక్షల కొత్త ఉద్యోగాల్ని కల్పించవచ్చు’ అని వెల్లడించారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు శ్రీకారం చుట్టారు. రైల్వేకు రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమన్న ఆయన అందుకోసం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించారు.
ఆ సమయంలోనే రైల్వేలో వివిధ ప్రాజెక్టుల కోసం 1.5 లక్షల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) ముందుకొచ్చింది. ప్రస్తుతం గోయల్ ప్రకటించిన 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులు సురేష్ ప్రభు రూపొందించిన ప్రణాళికకు సంబంధించినవేనా? అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ నెల ప్రారంభంలోనే గోయల్ మాట్లాడుతూ వచ్చే 12 నెలల్లో రైల్వేలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గమనార్హం.
నాలుగేళ్లలోనే విద్యుదీకరణ పూర్తి
ప్రయాణికులకు సురక్షిత, సుఖవంతమైన ప్రయాణం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించే సత్తా రైల్వే శాఖకు ఉందని గోయల్ చెప్పారు. దేశమంతా రైల్వే లైన్ల విద్యుదీకరణను గతంలో నిర్దేశించిన పదేళ్లలో కాకుండా నాలుగేళ్లలోనే పూర్తి చేస్తామని, దీనివల్ల రైల్వేకు 30 శాతం మేర ఖర్చులు ఆదా అవుతాయని ఆయన వెల్లడించారు. దేశమంతా విద్యుదీకరణ వల్ల ఇంధన ఖర్చుల రూపంలో రైల్వేకు ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఆదా అవుతాయని గోయల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment