
బెంగళూరు భామకు అందాల కిరీటం
పోలెండ్‌లో మిస్ సుప్రాగా ఎంపిక
సాక్షి, బెంగళూరు: బెంగళూరుకు చెందిన అందాల భామ శ్రీనిధి రమేష్ శెట్టి ’మిస్ సుప్రా నేషనల్–2016’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. పోలెండ్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన భామలను వెనక్కునెట్టి ఈ అందాలరాశి కిరీటాన్ని అందుకుంది. శ్రీనిధి బెంగళూరులో ఉన్నప్పటికీ ఆమె జన్మస్థలం మంగళూరు. ఆమె తల్లిదండ్రులు మంగళూరుకు చెందిన రమేష్ శెట్టి, కుషలా శెట్టిలు.
ఇక శ్రీనిధి బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మంగళూరులో సాగింది. బెంగళూరులోని భగవాన్ మహావీర్ జైన్ కాలేజీలో ఇంజనీరింగ్‌ను చదివారు. బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థలో రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం విశేషం. అటు పై మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆసక్తితో మోడల్‌గా మారి అనేక అందాల పోటీల్లో శ్రీనిధి పాల్గొంది.