రాజకీయం చేయొద్దు | Indrajit Lakesh about Gauri lankes murder | Sakshi
Sakshi News home page

రాజకీయం చేయొద్దు

Published Fri, Sep 8 2017 1:58 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

రాజకీయం చేయొద్దు

రాజకీయం చేయొద్దు

గౌరి లంకేశ్‌ సోదరుడి విజ్ఞప్తి
సాక్షి, బెంగళూరు:
గౌరి లంకేశ్‌ హత్యను రాజకీయం చేయొద్దని, తన సోదరి హత్య కేసులో అంతిమంగా  న్యాయం కావాలని ఆమె సోదరుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘గౌరి తను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడింది అందువల్ల కావాలంటే సైద్ధాంతిక రంగును జతచేసుకోండి. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించవద్దని కోరుతున్నా’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. సీబీఐ లేక ప్రత్యేక న్యాయమూర్తి లేక సిట్‌ విచారణ అనేది ముఖ్యం కాదని, అంతిమంగా న్యాయం కావాలని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమని ఇంద్రజిత్‌ పేర్కొన్నారు.

హత్య వెనుక నక్సల్స్‌ హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో అన్ని కోణాల్లోను సమగ్ర విచారణ జరపాలని గౌరి కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఈ హత్య వెనుక నక్సలైట్లు ఉన్నారా? లేక రైట్‌ వింగ్‌ అతివాదుల హస్తముందా? అన్న ప్రశ్నకు జర్నలిస్టు లోకం సమాధానం కోరుతోందని ఇంద్రజిత్‌  చెప్పారు. సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, ఒకవేళ దర్యాప్తు తీరు సరిగా సాగడం లేదని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరతామని గౌరి లంకేశ్‌ చెల్లెలు కవిత చెప్పారు. కాగా, గౌరీ హత్య కేసును సీబీఐకి అప్పగించడానికి సిద్ధమేనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గురువారం ప్రకటించారు. మరోవైపు ఈ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గురువారం దర్యాప్తును ప్రారంభించింది.  గౌరి లంకేశ్‌ ఇంటిని పరిశీలించి కొన్ని ఆధారాల్ని సేకరించారు. హత్య జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.  

హేళన చేయకుంటే హత్య జరిగేది కాదు
గౌరి లంకేశ్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే జీవరాజ్‌ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ‘ఆమె ఇటీవల కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల్ని హేళన చేస్తూ కథనాలు ప్రచురించారు. అలా చేయకుండా ఉంటే ఆమె హత్య జరిగి ఉండేది కాదేమో’ అని జీవరాజ్‌ వ్యాఖ్యానించారు. మీడియా తన వాఖ్యలను వక్రీకరించిందని తర్వాత వివరణ ఇచ్చారు.  గౌరి స్నేహితుడు, దళిత అభ్యుదయ వాది భాస్కర్‌ ప్రసాద్‌కు బుధవారం బెదిరింపు కాల్‌ వచ్చిందని సమాచారం. ఆయన డీజీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement