సాక్షి, హైదరాబాద్
హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు.. మధ్యలో విజయవాడలో రైలు ఆగింది.. అక్కడి చేపల పులుసు తినాలని నోరూరింది.. రైలు దిగి హోటల్ వెళ్లి తినడం కుదరదు.. మరెలా.. ఐఆర్‌సీటీసీ యాప్ ఓపెన్ చేయండి.. అందులోని ఈ–కేటరింగ్ ద్వారా మీకు నచ్చిన ప్రాంతీయ ఆహారాన్ని ఆర్డర్ చేయండి.. ఏ ఊరి వెరైటీ ఆ ఊళ్లోనే ఆరగించేయండి..
ప్రయాణికులకు ప్రాంతీయ వంటకాల రుచి చూపించేందుకు భారతీయ రైల్వే ప్రారంభించిన ఈ ‘ఈ–కేటరింగ్’ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. రైల్వే నూతన కేటరింగ్ పాలసీలో భాగంగా ప్రవేశపెట్టిన ‘స్థానిక రుచుల’ సదుపాయానికి డిమాండ్ పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతిరోజు 2వేల మంది ప్రయాణికులు రకరకాల ఆహార పదార్థాలను రుచి చూస్తున్నారు.
2 గంటల ముందు ఆర్డరిస్తే చాలు
ఉత్తరాది నుంచి దక్షిణాదికి, దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లేవారు సహజంగానే ఆయా ప్రాంతాల్లో లభించే వంటకాలను రుచి చూడాలనుకుంటారు. అలాంటి భోజన ప్రియుల కోసం రైల్వే ‘ఈ–కేటరింగ్’విధానాన్ని ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘ఐఆర్‌సీటీసీ’ మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని ‘ఈ–కేటరింగ్’ద్వారా నచ్చిన వంటకాలు ప్రయాణికులు ఎంపిక చేసుకోవచ్చు. టికెట్ పీఎన్నార్ నంబర్ జత చేసి, సమీపంలోని ఏ రైల్వేస్టేషన్‌లో ఆహారం అందజేయాలో తెలియజేస్తే చాలు.. వేడివేడి ఆహారం, ఘుమఘుమలాడే వెరైటీ రుచులు మీ వద్దకే వచ్చేస్తాయి. అయితే ఎంపిక చేసుకునే రైల్వేస్టేషన్‌కు చేరుకోడానికి 2 గంటల ముందు ఆర్డర్ ఇవ్వాలి.
హైదరాబాద్ బిర్యానీ, నాటుకోడి కూర..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానీ, నాటుకోడి కూర, రాయలసీమలో లభించే రాగి సంకటి, తలకాయ మాంసం, ఆంధ్రలో పీతలు, రొయ్యలు, కొర్రమీను చేపల వెరైటీ వంటకాలు మెనూలో ఉంచారు. స్థానిక స్వీట్లనూ ఈ కేటరింగ్ ద్వారా ఆర్డర్ ఇవ్వచ్చు. కాకినాడ కాజా, తాపేశ్వరం లడ్డు వంటి స్వీట్లు.. కేఎఫ్‌సీ, డోమినోస్ పిజ్జాలు, బర్గర్‌లు కూడా రెడీగా ఉన్నాయి. ‘ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మెనూ విస్తరిస్తున్నాం. ప్రస్తుతం రోజూ 2 వేల వరకు ఆర్డర్లు వస్తున్నాయి. రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది’అని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య చెప్పారు.
త్వరలో బేస్ కిచెన్‌లు..
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దురంతో, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి, అజంతా, ఫలక్‌నుమా, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సచ్‌ఖండ్, తపోవన్, దానాపూర్, పూర్ణ వంటి 49 ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనే ప్యాంట్రీకార్లు ఉన్నాయి. ఇవిగాక 34 స్టేషన్‌లలో కిచెన్ యూనిట్లు ఉన్నాయి. ఫుడ్ ప్లాజాలు, కేంటీన్‌లు అందుబాటులో ఉన్నా వాటి సేవలు పరిమితమే. ఆహార పదార్థాల సరఫరాను పూర్తిస్థాయిలో ఐఆర్‌సీటీసీకి అప్పగించేందుకు గతేడాది కొత్త కేటరింగ్ పాలసీ ప్రవేశపెట్టారు. ఆ పాలసీలో భాగంగానే బేస్ కిచెన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలుత సికింద్రాబాద్‌లో..
ప్యాంట్రీ కార్లు, కుకింగ్ యూనిట్‌ల తరహాలోనే బేస్ కిచెన్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు 10 వేల మంది ప్రయాణికులకు అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజన పదార్థాలు తయారు చేసే సామర్థ్యంతో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, రేణిగుంట, రాజమండ్రి తదితర ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ఏప్రిల్ నాటికి బేస్ కిచెన్‌లు ఏర్పాటు చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత సికింద్రాబాద్‌లో ప్రారంభించి తరువాత అన్ని ప్రధాన స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దురంతో, రాజధాని, శతాబ్ది వంటి అన్ని రైళ్లు, స్టేషన్‌లలో ప్రయాణికులకు కోరుకున్న ఆహారపదార్థాలను వీటి ద్వారా అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment