ఇండియన్ స్కూల్ కోసం జపనీయుల కష్టం | Japanese artists create stunning mud paintings on this Indian school | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్కూల్ కోసం జపనీయుల కష్టం

Published Fri, Mar 25 2016 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

ఇండియన్ స్కూల్ కోసం జపనీయుల కష్టం

ఇండియన్ స్కూల్ కోసం జపనీయుల కష్టం

పట్నా: అది బిహార్ రాష్ట్రంలోని సుజాత పరిధిలోని ఓ ఎజెన్సీ ప్రాంతం. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అస్తిత్వ లేమి, సంస్కృతిపై దాడి వంటి ఎన్నో బలహీనతలు ఆ ఎజెన్సీ ప్రాంతం సొంతం. అలాంటి ఎజెన్సీ ప్రాంతం, ఏనాడు ఏ ఒక్కరూ శ్రద్ధ చూపని ప్రాంతం నేడు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఒకే ఒక్క చర్య కారణంగా ఇప్పుడది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే 'ది నిరంజనా పబ్లిక్ వెల్ఫేర్ స్కూల్ స్థాపన'. అవును ఈ స్కూల్ ప్రత్యేకంగా ఎజెన్సీ ప్రాంత పిల్లలకోసం జపాన్ కు చెందిన కొందరు యువ విద్యార్థులు భారత్లోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఏర్పాటుచేశారు.

1 నుంచి 7 తరగతుల వరకు చదివేందుకు అవకాశం ఉన్న ఈ పాఠశాల ప్రస్తానం 2006లో మొదలైంది. తొలి రోజుల్లో ఇందులో కొద్ది మంది మాత్రమే చేరారు. ప్రస్తుతం ఆ స్కూల్లో వందల సంఖ్యలో విద్యార్థులు చేరారు. కేవలం పదేళ్లలో ఇంతలా మార్పు తీసుకొచ్చిన ఆ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే 'మడ్ పెయింటింగ్'. అవును టోక్యో గాకుగెయ్ యూనివర్సిటీకి చెందిన 50 మంది జపాన్ విద్యార్థులు బిహార్ లోని బోదగయలో ఈ పాఠశాలను నిర్మించారు. పేదలకు విద్యను అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. ఎంతోమంది ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ స్కూల్ నిలదొక్కుకోలేదు. 2010 నాటికి ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థుల చేరారు.

అయితే, విద్యనైతే అందిస్తున్నారు గానీ ఆ ప్రాంతంలో సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఏదో ఒక ప్రత్యేకత ఆ ప్రాంతానికి ఉంటే తప్ప ప్రభుత్వాలుగానీ, ఇతర వ్యక్తులుగానీ అక్కడి ప్రజల బాధలు పట్టించుకోరని సుధీర్ఘంగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి సంవత్సరం తప్పకుండా ఒక ప్రత్యేక ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించారు. దీని ద్వారా పాఠశాలకు ప్రత్యేకతను తీసుకురావడమే కాకుండా ఆ గ్రామ సమస్యలు మొత్తం పై అధికారులకు తెలియజేసినట్లవుతుందనేది వారి అంచనా.

అయితే, ఈ ఆర్ట్ ఫెస్టివల్ మాత్రం ఎవరూ ఊహించనిది. పూర్తిగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలాగా స్వయంగా ఈ స్కూల్ ను స్థాపించిన జపాన్ విద్యార్థులే ఆ స్కూల్ గోడలపైన, పై కప్పు భాగంలో ఎంతో అందంగా మడ్ పెయింటింగ్(బురదతో రంగులు) వేయడం ప్రారంభిచారు. ఇందులో ఆ స్కూల్ లో చదివే చిన్నారుల ఆశయాలు కూడా ప్రతిబింబించేలా వారితో హస్త, పాద ముద్రికలు కూడా వేయించి ఎంతో రమణీయంగా గోడపై చిత్రాలు గీయడం ప్రారంభించారు. ఇలా అప్పటి నుంచి నేటి వరకు బురదతోనే అక్కడ గోడలపై చిత్రాలు గీసి ఆర్ట్‌ ఫెస్టివల్ నిర్వహించడం అది అయిపోగానే దానిని తొలగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆర్ట్ ఫెస్టివల్ ను చూసేందుకు పై అధికారులు కూడా కుప్పలుగా వస్తుండటంతో గ్రామ సమస్యలు కూడా వారికి చెప్పేందుకు అవకాశం దొరికినట్లయింది.

Advertisement
Advertisement