‘మామ్’కు మొదటి పుట్టినరోజు | marsh orbiter mission of one year | Sakshi
Sakshi News home page

‘మామ్’కు మొదటి పుట్టినరోజు

Published Fri, Sep 25 2015 4:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

‘మామ్’కు మొదటి పుట్టినరోజు

‘మామ్’కు మొదటి పుట్టినరోజు

కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తి
 
సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్  దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో. అమెరికా, రష్యా, యూరప్ దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచేటట్లు చేసిన మామ్..అంచనాలకు మించి అంగారకుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించింది. మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళయాన్ యాత్ర విశేషాలు తెలుసుకుందాం.

 
అరుణ గ్రహ యాత్రలో కీలక ఘట్టాలు..
10 నెలలు..67 కోట్ల కిలోమీటర్లు..
శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను 2013 నవంబర్ 5న అంతరిక్షంలోకి పంపారు. ఈ ఉపగ్రహం అప్పటి నుంచి 67 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. కక్ష్యలో ఒక సారి తిరగడానికి 72 గంటల 51 నిమిషాల 51 సెకన్ల సమయం పడుతుంది. సెప్టెంబర్ 28న తన మొదటి ఛాయాచిత్రాన్ని తీసి పంపింది. అప్పటి నుంచి ఆ కక్ష్యలో పరిభ్రమిస్తూ అరుదైన ఛాయాచిత్రాలను, అత్యంత విలువైన సమాచారాన్ని చేరవేసింది. ఇప్పటికీ చేరవేస్తూనే ఉంది.

 

నీరు మాయమవటంపై శోధన..
మామ్‌లో లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్, మీథేన్ సెన్సర్, కలర్ కెమెరా, థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రో మీటర్‌ను ఉంచారు. ఇవి అంగారక గ్రహం మీద డ్యూటీరియం, హైడ్రోజన్‌ల నిష్పత్తిని లెక్కించి, ఆ లెక్కల ఆధారంగా మార్స్‌పై నీరు ఎలా అదృశ్యమైందనే కోణంలో శోధన చేస్తాయి.

కక్ష్యలో స్వల్పమార్పులు..
మామ్ కక్ష్యలోకి తోకచుక్క వచ్చి ఢీకొనే అవకాశం ఉండటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు గతేడాది అక్టోబర్ 7న ఉపగ్రహ కక్ష్యలో స్వల్పమార్పులు చేశారు. ఆ తోకచుక్క 2014 అక్టోబర్ 19న అంగారక గ్రహంపై పడింది. దీని కారణంగా మామ్ పనితీరులో ఎలాంటి మార్పు జరగలేదు.

అంతకు మించి..
2015 మార్చి 24 నాటికి మామ్ తన నిర్దేశిత ఆరు నెలల కాలాన్ని పూర్తిచేసుకుంది. అయినప్పటికీ అంచనాలకు మించి సేవలు అందిస్తోంది. ఇంకా 35 కిలోల ఇంధనం మిగిలి ఉండటంతో శాస్త్రవేత్తలు దీని కాలపరిమితిని మరో ఆరు నెలల పొడిగించారు.  ఇంధనం మిగిలి ఉండటం, అందులోని పరికరాలన్నీ బాగా పనిచేస్తుండడంతో మరి కొన్ని ఏళ్లపాటు మామ్ సేవలు అందించనుంది.

తాత్కాలిక అంతరాయం
ఈ ఏడాది జూన్ 2 నుంచి 22 వరకు కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకుండా పోయింది. సూర్యుడి వెనుక భాగానికి అంగారకుడు వెళ్లిపోవటంతో ఈ సమస్య ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
విశేషాలు..
తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను ప్రవేశపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా రికార్డు సృష్టించింది.
కేవలం రూ.450 కోట్ల వ్యయం(6.7 కోట్ల డాలర్లు)తో ఇస్రో ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తిచేసింది. అంగారక యాత్ర కోసం అమెరికా ఏకంగా 67.1 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది.
మామ్‌కు ముందు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా..అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి.
మామ్ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా..ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ పేజీపై ప్రత్యేకమైన డూడుల్‌ను పోస్ట్ చేసింది.
 


మామ్ ఘనత.. అంగారకుని ఉపగ్రహమైన డియ్‌మోస్ అవతలి వైపున తన కెమెరాలో బంధించింది మామ్. అంగారకుని అవతలి వైపును ఫొటో తీసిన తొలి మిషన్ మామ్ ఉపగ్రహమే. అరుణ గ్రహంపై గతంలో వివిధ దేశాలు చేపట్టిన ఏడు మిషన్‌లలో ఏదీ కూడా అంగారకుని అవతలి వైపు ఫోటో తీయలేకపోయింది. అంగారకునికి ఉన్న రెండు ఉపగ్రహాల్లో డియ్‌మోస్ చిన్నది.

పయనీర్ అవార్డు.. అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేసి, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించటంతో మామ్ బృందానికి అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం 2015 సంవత్సరానికి స్పేస్ పయనీర్ అవార్డు అందజేసింది.
 


‘అట్లాస్’ విడుదల చేసిన ఇస్రో
మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అంగారకుడి అట్లాస్‌ను ఇస్రో గురువారం అహ్మదాబాద్‌లో విడుదల చేసింది. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, ఇతర ప్రముఖులు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో దీనిని విడుదల చేశారు. అట్లాస్‌లోని ఫొటోలన్నీ మామ్‌లో ఉన్న మార్స్ కలర్ కెమెరా(ఎంసీసీ) తీసినవే. నవంబర్ 5న మామ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిష్షింగ్ హామ్లెట్ టు మార్స్’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేయాలని ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement