కారులో లిఫ్ట్ ఇచ్చి.. లూటీ చేశారు!!
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై జరుగుతున్న దోపిడీల్లో అత్యంత గర్హమైంది ఈ ఘటన! కంపెనీ ఏర్పాటుచేసిన క్యాబ్ మిస్ కావడంతో దారిలేక వేరే ట్యాక్సీ ఎక్కడం ఆ టెక్కీ పొరపాటు కాకపోవచ్చు కానీ దానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. పుణెలో ఐటీ కంపెనీల అడ్డాగా పేరొందిన హింజేవది ఏరియాలో పనిచేసే రవిశంకర్ గోపాల్.. గత మంగళవారం రాత్రి మూడు గంటల సమయంలో ఆఫీస్ కు దగ్గర్లోని బస్ స్టాండ్కు వెళ్లాడు. 'సార్.. లిఫ్ట్ కావాలా..?' అంటూ ఓ కారు డ్రైవర్ అడగడంతో సరేనని ఎక్కి కూర్చున్నాడు.
కాసేపటికి ఆ డ్రైవర్ మరో ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చాడు. కొద్దిదూరం ప్రయాణం తర్వాత మారణాయుధాల్ని బయటికి తీసిన ఆ ఇద్దరు వ్యక్తులు..గోపాల్పై దాడి చేసి పర్సు గుంజుకున్నారు. అంతటితో ఒదిలెయ్యకుండా ఏటీఎం పిన్ నంబర్ చెప్పకపోతే పీక కోసేస్తామని బెదిరించారు. భయంతో వణికిపోయిన గోపాల్కు నంబర్ చెప్పక తప్పలేదు. అలా దుండగులు అతని అకౌంట్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసుకున్నారు. ఏటీఎం నుంచి రోజుకు లక్ష రూపాలయలు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉండటంతో గోపాల్ అకౌంట్లో ఉన్న మరో 50 వేలు కూడా కాజెయ్యడానికి మంగళవారం పొద్దు, రాత్రంతా తమతోనే ఉంచుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 50 వేలు డ్రాచేసి గోపాల్ ను పుణెకు కొద్దిదూరంలో విడిచిపెట్టి దొంగలు పారిపోయారు. ఆ తర్వాత బాధితుడు బిక్కుబిక్కుమంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు. 'బాధితుడు గోపాల్ షాక్ కు గురయ్యాడని, దుండగులకు సంబంధించిన ఆనవాళ్లను చెప్పలేకపోతున్నాడని, అయితే. ఏటీఎంలలో రికార్డయిన సీసీ టీవీ ఫుటేజిల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని' పోలీసులు తెలిపారు.