మొనాకోలో కేసు గెలిచిన భారత్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) సుదీర్ఘ న్యాయపోరాటంలో రూ.60 కోట్లను తిరిగి దక్కించుకుంది. 1995లో జరిగిన యూరియా దిగుమతి కుంభకోణంలో ఆ సంస్థ రూ.133 కోట్లను కోల్పోయిన సంగతి తె లిసిందే. వాటిలో 60 కోట్లను టర్కీకి చెందిన టంకే అలంకస్ మొనాకోలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అప్పటి నుం చి ఆ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ఎన్‌ఎఫ్‌ఎల్ న్యాయపోరాటం చేస్తోం ది.
ఆ డబ్బును ఎన్‌ఎఫ్‌ఎల్‌కు చెల్లించాలని మొనాకోలోని అప్పిలేట్ కోర్టు ఆదేశించింది. పారిస్‌లో స్థిరపడిన భారత సంతతి న్యాయవాది విజయ్ ఫడ్కే ఎన్‌ఎఫ్‌ఎల్ తరఫున వాదించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు బంధువు బి.సంజీవరావు, అప్పటి కేంద్రమంత్రి రాంలఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్రలతో పాటు మరో ఏడుగురిపై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసింది. భారత్‌కు యూరియా దిగుమతి చేసేందుకు టర్కీకి చెందిన కర్సన్ లిమిటెడ్ కంపెనీతో ఎన్‌ఎఫ్‌ఎల్ ఒక ఒప్పందం కుదుర్చుకొని రూ.133 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. అయితే యూరియా పంపించకుండానే ఆ డబ్బును నిందితులంతా పంచుకున్నారు.