‘పెద్దల’ సవరణలకు నో
ఆర్థిక బిల్లుపై రాజ్యసభ సవరణలు తిరస్కరించిన లోక్‌సభ
- బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: ఆర్థిక బిల్లు–2017కు గురువారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ చేసిన 5 సవరణలను లోక్‌సభ తిరస్కరించింది. పన్నువసూలు అధికారులకు కళ్లెం వేయటం, రాజకీయ పార్టీలకు కంపెనీల కానుకల విషయంలో రాజ్యసభ చేసిన సూచనలను దిగువసభ మూజువాణీ ఓటుతో తోసిపుచ్చింది. 2017–18 ఏడాదికి బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేసింది. రాజ్యసభ సవరణలపై చర్చ ముగించే సందర్భంగా ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. ‘రాజ్యసభ సవరణలను ప్రభుత్వం ఆమోదించలేదు. కానీ ఎన్నికల నిధుల వ్యవహారం స్వచ్ఛంగా, పారదర్శకంగా మారేందుకు అన్ని పార్టీలు సలహాలు ఇవ్వాలని ఆహ్వానిస్తున్నాం’ అని అన్నారు.
మండిపడ్డ విపక్షాలు
ఆర్థిక బిల్లులో తీసుకొచ్చిన అమానుషమైన మార్పుల ద్వారా రాజకీయ దోపిడీకి కేంద్రం తెరలేపిందని విపక్షాలు విమర్శించాయి. రాజ్యసభ సూచించిన సవరణలను తిరస్కరించినందుకు కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశాయి. ‘పార్టీల ఫండింగ్‌ను పారదర్శకం చేయాల్సింది పోయి.. ఈ అంశం మరుగున పడేలా కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రాజకీయ దోపిడీకి తెరలేపేలా ఉంది’ అని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా అన్నారు.
పన్నువసూలు అధికారాలకు కత్తెర వేసి పన్నుచెల్లించేవారి హక్కులను కాపాడాలన్న రాజ్యసభ సవరణనూ కేంద్రం తిరస్కరించటం దారుణమని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ విమర్శించారు. ఐటీ చట్టంలో క్లాజ్ 51లోని 132(ఏ)ను తొలగించాలని సవరణ చేసినా పట్టించుకోలేదన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రక్రియను తొలిసారిగా మార్చి 31కి ముందే పార్లమెంటు పూర్తి చేసింది. దీని ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయింపులు, పన్ను ప్రణాళికలు రూపొందించుకునేందుకు మరింత సమయం లభిస్తుంది.
నటులతో ఎంపీల క్రికెట్!
క్షయ వ్యాధిపై అవగాహన పెంచేందుకు, భారత్‌ను క్షయ వ్యాధి రహిత దేశంగా మార్చేందుకు పార్లమెంటు సభ్యులు, బాలీవుడ్ నటులు కలిసి ఏప్రిల్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో క్రికెట్ ఆడనున్నారు. విషయాన్ని బీజేపీ ఎంపీ అనురాగ్ లోక్‌సభలో చెప్పారు. ఆరోగ్య రంగంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు జీడీపీలో 1.3 శాతమేనన్నారు. దేశంలో దాదాపు 4 కోట్ల కుటుంబాలకు ఇళ్లు లేవనీ, 2022 నాటికి ‘అందరికీ ఇల్లు’ సాకారమయ్యేలా2.95 కోట్ల ఇళ్లను నిర్మించాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి లోక్‌సభలో చెప్పారు.