
మార్స్ మెటీరియల్‌తో స్మార్ట్‌ఫోన్!
♦ రూ.651కే.. పదేళ్ల తరువాత డెలివరీ!
♦ రింగింగ్‌బెల్స్‌కు పేరడీ సైట్
న్యూఢిల్లీ: అత్యంత చవగ్గా రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థను ఎద్దేవా చేస్తూ ఓ కొత్త వెబ్‌సైట్ వచ్చింది.పేరు ఫ్రీడమ్651.కామ్. అచ్చం ఫ్రీడమ్251.కామ్ సైట్‌లాగే తమది కూడా రూపొందించి అందులో ‘డజ్‌నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అని పేర్కొన్నారు. తమ ఫోన్ అంగారక గ్రహంపై దొరికే ముడిసరుకుతో తయారవుతుంది కాబట్టే రూ. 651కే ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. 2025 నాటికి మనుషులు అంగారక గ్రహంపైకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. అప్పుడు అక్కణ్నునంచి మెటీరియల్ తెప్పించుకుని ఫోన్లు తయారు చేస్తామని.. 2026 జూన్ 30న డెలివరీ చేస్తామని తెలిపారు.
అంగారకుడిపై వెళ్లటానికి శివకాశిలోని స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. రెండుకోట్ల రాకెట్లు కొని వాటి ద్వారా మనుషులను మార్స్ పైకి పంపుతామని, అందుకు రూ.651 కడితే సరిపోతుందన్నారు. ‘బయ్‌నవ్’ అని ఉండే చోట ‘డునాట్ బై’ అనే బటన్ ఉంచి, కస్టమర్ కేర్ నంబర్‌ను 0420-420420, 4200420 అని పేర్కొన్నారు. సంప్రదించాల్సిన చోట.. కస్టమర్ తాత వివరాలు, పొరుగింటి వివరాలు.. అడ్రస్ మార్స్‌పైనైనా ఇవ్వచ్చన్నారు. ఫామ్‌ను సబ్మిట్ చేయటానికి ప్రయత్నించవద్దని పేర్కొన్నారు. తమ గురించి పేర్కొన్న చోట ఇది కేవలం పేరడీ సైట్ అని చెప్పారు.