అంగారక యాత్ర.. ఆద్యంతం ఆసక్తికరం.. చందమామను దాటి గ్రహాంతరాలకు... భారత అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం.. ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగాల్లో మేలిమలుపు ఇంతకూ ఎందుకీ ప్రయోగాలు? సాధించేదేమిటి?.. అన్నేసి కోట్ల కిలోమీటర్ల ప్రయాణమెలా సాధ్యం?
15 అంతస్తుల నిర్మాణం నిట్టనిలువుగా పెకైగిరితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండింటికి టీవీ చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ దాదాపు 144 అడుగుల ఎత్తై పీఎస్‌ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా నింగికెగురుతూ కన్పిస్తుంది.
ఇంతకూ ఎందుకీ ప్రయోగం?
దీని ద్వారా సాధించదలచిందేమిటి? ఈ ప్రశ్నలు ఎంత ఆసక్తికరమో, వీటికి జవాబులు కూడా అంతే ఆసక్తికరం. సౌరకుటుంబంలో భూమి తరవాత మనిషి నివసించేందుకు కొద్దో గొప్పో అవకాశాలున్న ఏకైక గ్రహమైన అంగారకుడిపై మన ఆసక్తి ఇప్పటిది కాదు. భూమితో అనేక సారూప్యతలుండటం దీనికి కారణం. భూమి నుంచి దాదాపు సగటున 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అరుణ గ్రహంపైకి ఇస్రో ఈ ఏడాదే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు కారణముంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో అది ఈ ఏడాది భూమికి అతి దగ్గరగా రానుంది. నవంబరు-జనవరి మధ్యకాలంలో భూమికి కేవలం 5.4 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ ప్రయోగం లక్ష్యం. అన్నీ సవ్యంగా సాగితే దాదాపు 300 రోజుల ప్రయాణం తరవాత, అంటే 2014 సెప్టెంబరు నెలాఖరుకల్లా అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశిస్తుంది.
లక్ష్యాలేమిటి?
ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపథ్యంలో మనకూ ఆ సామర్థ్యముందని నిరూపించేందుకు దీన్ని తలపెట్టారు. దీంతోపాటు అంగారకుడి వాతావరణంలో మీథేన్, నీటి ఉనికి గర్తింపు, కాలక్రమంలో అది నాశనమైన క్రమ నిర్ధారణ, ఉపరితల ఖనిజ సమ్మేళనాన్ని అంచనా వేయడం ఈ ప్రయోగపు శాస్త్రీయ లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.
మూడు దశల్లో ప్రయాణం
ఇంతటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించగల ఉపగ్రహాలను, అందుకు అవసరమైన రాకెట్లను తయారు చేయడం, ప్రయోగించడం, వాటిని భూమి మీదినుంచే నియంత్రించడం ఆషామాషీ కాదు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారక యాత్ర మొత్తం మూడు దశల్లో సాగుతుంది. ప్రయోగానంతరం భూమి చుట్టూ దాదాపు 5 సార్లు చక్కర్లు కొట్టిన తరువాత అంగారక కక్ష్య మార్గంలోకి ప్రవేశిస్తుందీ మార్స్ ఆర్బిటర్ మిషన్. ఈ చక్కర్లు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పద్ధతి ప్రకారం జరుగుతాయి. తొలి దశలో పెరిగీ (భూమికి అతి దగ్గరగా ఉండే దశ) దాదాపు 250 కి.మీ. ఉంటే.. అపొగీ(భూమికి అతి దూరంగా ఉండే దశ) దాదాపు 23,000 కిలోమీటర్లుంటుంది.
తరవాతి 4 దశల్లో పెరిగీలో పెద్ద మార్పుండదు గానీ అపొగీ మాత్రం 40,000 నుంచి దాదాపు 2 లక్షల కి.మీ వరకు పెరుగుతుంది. ఈ దశల తరువాత ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్య మార్గంలోకి దూసుకెళ్తుంది. ఇక రెండోది హీలియో సెంట్రిక్ దశ. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంగారకుడుండే నిర్దిష్ట స్థానం ఆధారంగా ఈ దశ ప్రయాణం ఉంటుంది. ఇక అంగారక గ్రహ ప్రభావముండే ప్రాంతం (ఆ గ్రహం నుంచి 5.7 లక్షల కిలోమీటర్లు)లోకి ప్రవేశించడంతో మూడో దశ మొదలవుతుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఉపగ్రహం క్రమేపీ ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
- సాక్షి, సైన్స్ బ్యూరో
ఈ ఐదూ కీలకం..
మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం మొత్తం బరువు దాదాపు 1,336 కిలోలు. దీంట్లో 860 కిలోలు ఇంధనం. మిగతా బరువులో దాదాపు 15 కిలోల బరువుతో 5 శాస్త్రీయ పరికరాలుంటాయి. అవి...
1. లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: నీరు నాశనమయ్యే క్రమంలో ఏర్పడే డ్యుటీరియం, హైడ్రోజన్‌ల నిష్పత్తిని అంచనా వేస్తుంది. గ్రహ వాతావరణ పై పొరల్లో ఈ నిష్పత్తిని గుర్తించడం ద్వారా అక్కడ
నీరెలా నాశనమైందో అంచనా వేయొచ్చు.
2. మీథేన్ సెన్సర్: అరుణ గ్రహ వాతావరణంలోని మీథేన్‌ను గుర్తిస్తుంది. ఇది అత్యంత సూక్ష్మ స్థాయిలో, అంటే 100 కోట్లలో ఒక్క వంతుండే మీథేన్‌ను కూడా పసిగట్టగలదు. అంతేకాక అది రసాయన ప్రక్రియ ద్వారా పుట్టిందా, లేక ఒకప్పటి జీవరాశి నాశనమవడం ద్వారానా అన్నదీ నిర్ధారించుకోవచ్చు.
3. మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: అంగారక గ్రహ ఉపరితలానికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే తటస్థ మూలకాల సమ్మేళనం ఏ విధంగా ఉందో విశ్లేషించేందుకు ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు.
4. మార్స్ కలర్ కెమెరా: ఎప్పటికప్పుడు మారిపోతూండే మార్స్ ఉపరితలాన్ని, వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ఇది తీసే ఫొటోలు ఉపయోగపడతాయి. గ్రహ ఉపరితలం తాలూకు ఖనిజ నమ్మేళనాన్ని కూడా వాటి ద్వారా అర్థం చేసుకోవచ్చు.
5. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్: పరారుణ కాంతి పరిధిలో అరుణ గ్రహం నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తించేందుకు పనికొస్తుంది