ఇస్రో మాజీ చీఫ్ కన్నుమూత
బెంగుళూరు: ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో భారత అంతరిక్ష సంస్ధ(ఇస్రో) షాక్‌కు గురిచేసింది. గత ఏడాదిగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
1984-1994 మధ్య ఇస్రోకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో బోధకుడిగా పనిచేశారు కూడా. యూఆర్.రావు శాస్త్రవేత్తగా పది అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ పరిపాలనా విభాగ చైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.
సతీష్ ధావన్ తర్వాత పదేళ్ల పాటు ఇస్రోకు చైర్మన్‌గా వ్యవహరించింది రావు మాత్రమే. మామ్ మిషన్ కోసం ఇస్రోతో కలసి ఆయన పనిచేశారని సీనియర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆయన లేరనే మాట ఊహించడానికి కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి రావు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది.
ఈ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్న ఆయన 'నా మరణానంతరం అవార్డు వస్తుందని అనుకున్నా' అని వ్యాఖ్యానించారు. యూఆర్ రావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీటర్ ద్వారా స్పందించారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు.
Saddened by demise of renowned scientist, Professor UR Rao. His remarkable contribution to India's space programme will never be forgotten.
— Narendra Modi (@narendramodi) 24 July 2017