ఎందుకు అడ్డుకోలేకపోయారు?
కొచ్చి: పుట్టింగల్ ఆలయ అగ్నిప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాపు జరపాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పుట్టింగల్ దుర్ఘటనపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. చట్టవిరుద్ధంగా బాణసంచా పేలుళ్లు నిర్వహించారని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆలయ ప్రాంగణంలో బాణసంచా కాల్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. అనుమతి ఇవ్వకుంటే బాణసంచా ఎలా కాల్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
అనుమతి లేనప్పుడు ఆలయ ప్రాంగణంలోని బాణసంచాను పోలీసులు ఎందుకు పట్టుకురానిచ్చారని, కాల్పులను ఎందుకు అడ్డుకోలేకపోయారని సూటిగా నిలదీసింది. పేలుళ్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం విధుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఘోర విపత్తుకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు, కొల్లాం జిల్లా అధికార యంత్రాగం వేర్వేరుగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
పుట్టింగల్ ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాల్పులు సందర్భంగా పేలుడు సంభవించడంతో 109 మంది మృతి చెందగా, 300 మందిపైగా గాయపడ్డారు.