న్యూఢిల్లీ: అసోంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అసోంలో పార్టీ విజయం సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ఇది పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. తమ పార్టీ పేదల కోసం పని చేసే పార్టీ అని, అభివృద్ధి పనులే తమను గెలిపించాయని మోదీ వ్యాఖ్యానించారు. ఫలితాలు ఎన్డీఏకి నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందుకు సంతోషం మోదీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు,నితిన్ గడ్కరీ ఉన్నారు.