ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికులను అగౌరవపరిచేలా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సైన్యం కంటే వేగంగా సుశిక్షితులైన సైనికులను ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధం చేస్తుందని భగవత్ చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రతి భారతీయుడిని అవమానించేలా ఉన్నాయని, జాతి కోసం మరణించిన వారిని అగౌరవపరిచేలా ఆయన మాట్లాడారని రాహుల్ తప్పుపట్టారు.
సైనికులంతా జాతీయ పతాకానికి శాల్యూట్ చేస్తారని..దీంతో భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ పతాకాన్ని కూడా అవమానించినట్టేనని రాహుల్ ట్వీట్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల భేటీలో భగవత్ మాట్లాడుతూ భారత సైన్యం ఆరేడు నెలల్లో తయారుచేసే సైనికులను సంఘ్ పరివార్ కేవలం మూడు రోజుల్లోనే సిద్ధం చేస్తుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశానికి అలాంటి పరిస్థితి ఎదురైతే సైనికులను దీటుగా సన్నద్ధం చేయగల సత్తా సంఘ్‌కు ఉందని, రాజ్యాంగం అనుమతిస్తే అందుకు తాము సిద్ధమని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment