స్వాధీనం చేసుకున్న కొత్తనోట్లు ఏం చేస్తారు?
స్వాధీనం చేసుకున్న కొత్తనోట్లు ఏం చేస్తారు?
Published Tue, Dec 20 2016 9:13 AM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను శాఖ అధికారులు, పోలీసులు, సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదు పట్టుకుంటున్నారు. వాటిలో చాలావరకు కొత్తగా విడుదలైన 2వేల రూపాయల నోట్లు కూడా ఉంటున్నాయి. మామూలుగా అయితే ప్రజలకు బ్యాంకుల ద్వారా అందాల్సిన డబ్బది. కానీ కొంతమంది పెద్దమనుషుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ డబ్బంతటినీ ఏం చేస్తారో అనే అనుమానం అందరికీ ఉంటుంది. దానికి సమాధానం దొరికింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు నగరాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచింది. స్వాధీనం చేసుకున్న డబ్బంతటినీ ఆ అకౌంట్లలో డిపాజిట్ చేయాలని తెలిపింది. తద్వారా, ఆ డబ్బు అంతా మళ్లీ బ్యాంకులలోకి వెళ్లి, మళ్లీ ప్రజల వద్దకు సర్క్యులేషన్‌లోకి వస్తుందన్న మాట. ఈ విషయాన్ని ఈడీ డైరెక్టర్ కమల్ సింగ్ తెలిపారు. ఇంతకుముందు మాత్రం తాము స్వాధీనం చేసుకున్న ఇతర సామగ్రితో పాటు డబ్బును కూడా స్ట్రాంగ్ రూంలలో పెట్టాలని ఆదేశించామని, కానీ అవి ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులలో డిపాజిట్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఆదాయపన్ను శాఖ కూడా ఇలాగే స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఇంతకుముందు ఏ శాఖ అయినా స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, ఇతర పత్రాలు అన్నింటినీ సాక్ష్యాలుగా స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచేది. తర్వాత ఆ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసేవారు. కొన్ని కేసులు పరిష్కారం కావడానికి ఏళ్లకొద్దీ సమయం పడుతుంది. అందుకని అన్నాళ్ల పాటు లాకర్లలో పెట్టేకన్నా ప్రజలకు ఉపయోగపడేలా ఆ డబ్బును బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనే దాదాపు రూ. 60 కోట్ల విలువైన కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement