భారీ ఆస్తుల చాయ్‌వాలాకు ఈడీ ఝలక్!
అహ్మదాబాద్: గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వ్యక్తి కేవలం టీ, స్నాక్స్ అమ్ముకుని దాదాపు రూ.650 కోట్లు కూడబెట్టడం గత డిసెంబర్ లో కలకలం రేపింది. ఆ తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తూ వందల కోట్లు పోగేసిన కిషోర్ భజియావాలా అక్రమాస్తులు పెద్ద నోట్ల రద్దు తర్వాత వెలుగుచూసిన విషయం తెలిసిందే. గతంలో కొన్ని ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా.. తాజాగా రూ.1.02 కోట్లను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వారు అటాచ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) ఆఫ్ 2002 ప్రకారం ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఆయన అక్రమాస్తులపై ఈడీ తమ చర్యలను వేగవంతం చేసింది. మరిన్ని అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చేందుకు యత్నిస్తుండగా భజియావాలా భాగోతం బయటపడింది. దీంతో గత డిసెంబర్ నెలలో ఆయన ఇంటిపై, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ ధికారులు లెక్కచూపని రూ.10.45 కోట్ల డబ్బుతో పాటు దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసి తిరిగి విత్ డ్రా చేసేందుకు వందల మందిని ఉపయోగించాడని ఐటీ అధికారులు గతంలోనే వెల్లడించారు.
ఈ సూరత్ వడ్డీ వ్యాపారికి సంబంధించి 27 బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 20 బినామీల పేరుతో ఉన్నవే కావడం గమనార్హం. గత డిసెంబర్ చివరి వారంలో రూ.1.45 కోట్ల నగదు, రూ.1.48 కోట్ల విలువైన బంగారం, రూ.4,92,96,314విలువైన వజ్రాలు, ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిషోర్ భజియావాలా కేసు సీబీఐ విచారిస్తోంది.