టీ స్నాక్స్ అమ్మి.. రూ. 650 కోట్లు కూడబెట్టాడు!
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం టీ, స్నాక్స్ అమ్ముకుని భారీ మొత్తంలో సంపాదించాడు. వడ్డీ వ్యాపారం కూడా చేసుకుంటున్న కిషోర్ భజియావాలా అనే వ్యక్తి వద్ద ఉన్న ఆస్తిని లెక్కించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులకు రోజుల తరబడి సమయం పడుతోంది. అతడి మొత్తం ఆస్తి రూ. 650 కోట్లని ఇప్పటికి లెక్కతేల్చారు. కిషోర్ భజియావాల, అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులందరి వద్ద కలిసి గుర్తించిన ఆస్తి విలువ రూ. 650 కోట్లకుపైగా ఉందని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అతడివద్ద 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయని, వీటన్నింటినీ పలు లాకర్లలో పెట్టి దాచేశాడని తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి అతడి బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొద్ది కాలంలోనే అతడు తన ఖాతాల్లో కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడి మీద ఓ కన్నేసి ఉంచగా బండారం మొత్తం బయటపడింది. భజియావాలా, అతడి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 40కి పైగా బ్యాంకు అకౌంట్లున్నాయి.
అయితే అతడి ఆదాయం లెక్క ఇప్పుడు బయటపడిన 650 కోట్లతోనే ఆగకపోవచ్చని.. రాబోయే రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. సూరత్ శివార్లలోని ఉధ్నా అనే ప్రాంతంలో టీ, స్నాక్స్ మాత్రం అమ్ముకునే ఈ భజియావాలా గత మూడు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాడు. దశాబ్ద కాలం నుంచి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి అందులో భారీగా సంపాదించాడు. ఇతగాడి నెల సంపాదనే దాదాపు రూ. 15 కోట్ల వరకు ఉంటుంది గానీ, సంవత్సరానికి తాను కేవలం కోటిన్నర మాత్రమే సంపాదిస్తున్నట్లు ఆదాయపన్ను రిటర్నులలో చూపించాడని తెలిసింది.