సాక్షి, న్యూఢిల్లీ : నక్కీరన్ గోపాల్‌గా ప్రసిద్ధి కెక్కిన తమిళ ద్వైవార పత్రిక ఎడిటర్ ఆర్. రాజగోపాల్ అరెస్ట్, విడుదల వెనక పెద్ద సెక్స్ కుంభకోణమే దాగుంది. ఆ కుంభకోణాన్ని దర్యాప్తు చేసే దమ్ములేని తమిళ పోలీసులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేసి అనవసరంగా అభాసుపాలయ్యారని తమిళ జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. నక్కీరన్‌ను అరెస్ట్ చేయడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు తమిళనాడు గవర్నర్ కార్యాలయం కూడా క్షమాపణలు చెప్పాలని మద్రాస్ రిపోర్టర్స్ గిల్డ్ సహా రాష్ట్రంలోని 11 జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు తమిళనాడు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఓ మెమోరాండం కూడా సమర్పించారు.
రాష్ట్ర గవర్నర్ భన్వారీ లాల్ పురోహిత్ మధురై కామరాజ్ యూనివర్శిటీకి ఛాన్సలర్‌గా ఉన్నారు. ఈ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న విరుధునగర్ జిల్లాలోని ‘దేవాంగ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిర్మలా దేవీ సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్నారు. మహిళలను, విద్యార్థినులను ప్రలోభపెట్టి సెక్స్‌లోకి దించుతున్నారన్నది ఆమెపై అభియోగం. ఈ కేసులో ఏప్రిల్ 24వ తేదీన అమెను అరెస్ట్ చేశారు. అంతకుముందు నుంచి ఆమె తనకు గవర్నర్ పురోహిత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని పోలీసులతో చెబుతూ వస్తున్నారు. అయినా ఆమెను పోలీసులు విడిచి పెట్టలేదు. ఈ విషయాన్ని గోపాల్ తన నక్కీరన్ పత్రికలో వార్తగా రాశారు. ఆ తర్వాత సెక్స్ స్కామ్‌లో ఓ రీసెర్చ్ విద్యార్థి కరుప్ప స్వామి, కామరాజ్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. మురుగన్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మలా దేవీపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు పెట్టారు.
నిర్మలా దేవీ అరెస్ట్ కాకముందే అంటే, ఏప్రిల్ 16వ తేదీనే రాష్ట్ర గవర్నర్ ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్‌తో తనపై తానే ఏకసభ్య విచారణ కమిషన్‌ను వేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్మలా దేవీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఆ సమావేశంలో తనపై తానే విచారణ కమిటీని వేసుకోవడం ఏమిటని కూడా గవర్నర్‌ను విలేకరులు ప్రశ్నించారు. అది కూడా ఆయనకు కోపం తెప్పించిందట. ‘గవర్నర్‌ను నాలుగుసార్లు కలసుకున్నట్లు నర్మలా దేవీ వెల్లడి: ఆమె ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు’ అన్న శీర్షికతో నక్కీరన్ పత్రిక సెప్టెంబర్ 26–28 నాటి సంచికలో ఓ వార్తను ప్రచురించింది. సీబీఐ విచారణలో నిర్మలా దేవీ తాను నాలుగు సార్లు రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకున్నట్లు వెల్లడించిందని, అయితే సీబీఐ అధికారులు దీన్ని అధికారికంగా నమోదు చేయలేదని ఆ వార్తలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు నక్కీరన్ గోపాల్‌ను అరెస్ట్ చేసి నాలుగు గంటలపాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. ఆయన తరఫున న్యాయవాదిని కూడా అనుమతించలేదు. ఐపీసీలోని 124వ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నక్కీరన్ గోపాల్‌పై దాఖలు చేసిన సెక్షన్‌ను చూసి జడ్జీయే అవాక్కయ్యారు. రాష్ట్రపతి లేదా గవర్నర్లను తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నవారిపై ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఏ విధంగా గవర్నర్ విధులకు గోపాల్ అడ్డుపడ్డారో చెప్పాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కేసును కొట్టివేసి గోపాల్‌ను విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో గోపాల్ విడుదలయ్యారు. గోపాల్ తప్పుడు వార్తలు రాసి ఉన్నట్లయితే ఆయనపై పరువు నష్టం దావా వేయాలిగానీ తప్పుడు కేసు బనాయించడం ఏమిటని తోటి జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. దివంగత కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను అడవి దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేసినప్పుడు ఆయన విడుదలకు నక్కీరన్ గోపాల్ మధ్యవర్తిత్వం వహించిన విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment