జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’ | 'Ship of Theseus' named best film at National film awards | Sakshi
Sakshi News home page

జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’

Published Thu, Apr 17 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’

జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’

* జాతీయ అవార్డుల ప్రకటన
*షాహిద్ చిత్ర దర్శకుడు మెహతాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం
* ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా భాగ్ మిల్కా భాగ్
తెలుగు చిత్రానికి మూడు అవార్డులు

 
న్యూఢిల్లీ: 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2013 సంవత్సరానికిగానూ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో హిందీ సినిమాల హవా నడిచింది. ప్రధాన విభాగాలన్నిటిలోనూ బాలీవుడ్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ‘షిప్ ఆఫ్ థీసీయస్’ (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. గుర్తింపు, నమ్మకం, మరణం వంటి సంక్లిష్టమైన అంశాలను ‘షిప్ ఆఫ్ థీసీయస్’లో సమర్థవంతంగా తెరకెక్కించడంతో ఆనంద్ గాంధీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు.
 
  ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘షాహిద్’ డెరైక్టర్ హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. షాహిద్ చిత్రంలోనే నటించిన రాజ్‌కుమార్ రావ్, మలయాళ చిత్రం పెరారియావతర్‌లో నటించిన సూరజ్ వెంజారమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా పురస్కారం దక్కించుకున్నారు. హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.
 
  ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులను ఎంపిక చేసింది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి, సినీ గీత రచయిత, దర్శకుడు గుల్జార్‌కు అదే రోజు అవార్డు అందించనున్నారు. జాతీయ అవార్డు రావడంతో చాలా ఉద్వేగానికి గురయ్యా అని షిప్ ఆఫ్ థీసీయస్ దర్శకుడు ఆనంద్ గాంధీ చెప్పారు. ఈ అవార్డును షాహిద్ అజ్మీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు.
 
అవార్డులు ఎవరికి?
 ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లిష్)
 ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్-హిందీ)
 ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (షాహిద్-హిందీ),
 సూరజ్ వెంజారమూడు(పెరారియావతర్-మలయాళం)
 ఇద్దరికి సంయుక్తంగా
 ఉత్తమ నటి: గీతాంజలి థాపా (లయర్స్ డైస్-హిందీ)
 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ)
 ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్‌ఎల్‌బీ
 ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం(నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర
 (తలైమురైగల్-తమిళం)
 ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ)
 ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్-బెంగాలీ)
 ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా-మరాఠీ)
 ఉత్తమ మాటల రచయిత: సుమిత్రా భావే(అస్తు-మరాఠీ)
 ఉత్తమ పాటల రచయిత: ఎన్‌ఏ ముత్తుకుమార్ (తంగా మింకాల్-తమిళం)
 ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య(భాగ్ మిల్కా భాగ్-హిందీ)
 ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్-బెంగాలీ)
 ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్(హిందీ)
 
 తెలుగు వెలుగులు...
 ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నా బంగారు తల్లి
 ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా(నా బంగారు తల్లి)
 స్పెషల్ జ్యూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)
 ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement