
ధూమపానానికి యువత ఎక్కువగా ఆకర్షితులవుతుండటంతో, వారిని అదుపులోకి ఉంచడానికి కేంద్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సిగరెట్ షాపులో బిస్కెట్లు, సాఫ్ట్‌డ్రింకులు, కాండీస్, చిప్స్ వంటి ఇతర ఉత్పత్తులు అమ్మకుండా నిషేధం విధించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో సిగరెట్ వాడకానికి కొంత దూరం ఉంచవచ్చని చూస్తోంది. సిగరెట్లు అమ్మే షాపుల్లో ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయిస్తోంది. ఇతర పొగాకు ఉత్పత్తులకు కూడా లీగల్ అథారిటీల వద్ద రిజిస్ట్రార్ అయ్యే నిబంధనను కూడా తీసుకొస్తోంది. ఈ దుకాణాలు తప్పనిసరిగా రిజిస్ట్రర్ అయి, స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆర్థిక సలహాదారు అరుణ్ ఝా తెలిపారు.
దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని సిగరెట్ షాపులను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని కూడా తప్పనిసరిగా ట్రాక్ చేయబోతున్నట్టు ఝా తెలిపారు. ఈ నిబంధనలపై తాము పంపిన లేఖలకు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిని ఎలా అమలు చేయాలో చూడాలన్నారు. పొగాకు వాడకాన్ని నిర్మూలించే క్రమంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.