నిందితుల దాడిలో ధ్వంసమైన సెంయింట్ మేరీస్ చర్చి (ఫైల్ ఫొటో)
ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం. నాలుగు నెలల కిందట ఓ చర్చిలో ఆమెను చూసి మనసు పారేసుకున్నడు. మొదట ఆమె కూడా ఓకే చెప్పింది. వేర్వేరు మతాలు కాబట్టి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని, ఒక్కసారిగా ప్రేమబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది! ఆమెపై, తమను విడదీసిన కారణంపై కోపం పెంచుకున్న ఆ విఫల ప్రేమికుడు చర్చిని ధ్వసం చేసి పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు!
ఏప్రిల్ 16న నగరంలోని ప్రతాప్ పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, ప్రతిమలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఊహించని విధంగా ప్రేమ కోణం బయటపడింది. ముగ్గురు నిందితుల్లో ఒకరైన హైదర్ అలీ ప్రేమ విఫలమైన నిర్వేదంలోనే స్నేహితుల సహాయంతో చర్చిని ధ్వసం చేశాడని, పోలీసుల ఇంటరాగేషన్లో నేరం అంగీకరించాడని ఓ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు.
సదరు చర్చికి వెళ్లే ఓ యువతి, హైదర్లు ప్రేమించుకున్నారని, మతాలు వేరవ్వడంతో ఆమె పెళ్లికి నిరాకరించి, చెర్చికి రావడం మానేసిందని, దీంతో ఆమెపై, తమను విడదీసిన కారణంపై అక్కసు పెంచుకున్న హైదర్ దురాగతానికి ఒడిగట్టాడని, ఆ మేరకు వాగ్మూలం కూడా రాసిచ్చినట్లు సమాచారం. అయితే ఆగ్రా సిటీ ఎస్పీ సమీర్ సౌరభ్.. హైదర్ ను అదుపులోకి తీసుకున్న విషయం తప్ప మిగతా వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.