
త్వరలో ఆన్‌లైన్ ఆపరేషన్
దేశంలో టెలిమెడిసిన్ ప్రాజెక్టు
35 వైద్య కళాశాలల్లో ఏర్పాటు
తొలిదశలో ఏపీలో ఎస్వీ, రంగరాయ కళాశాలలు
రెండో దశలో ఉస్మానియా
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తొలిసారిగా టెలిమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ అనుసంధానించాలని నిర్ణయించింది. తొలి దశలో సుమారు 13 రాష్ట్రాల్లోని 35 కళాశాలలను టెలి మెడిసిన్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. నేషనల్ మెడికల్ కాలేజెస్ నెట్‌వర్క్ (ఎన్‌ఎంసీఎన్) కింద ఈ కళాశాలలన్నీ పనిచేస్తాయి. తొలి దశ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా మెడికల్ కళాశాల, కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. రెండో దశలో తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కళాశాలను అనుసంధానిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన రెండు కళాశాలలకు ఇద్దరు నోడల్ అధికారులను నియమిస్తారు. వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి నోడల్ అధికారిగా ఒకరు ఉంటారు. రాష్ట్రస్థాయి అధికారి టెలి మెడిసిన్‌ను పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించిన సాంకేతిక సంపత్తిని రెండు నెలల్లోగా ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి టెలిమెడిసిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
టెలిమెడిసిన్ ఉపయోగాలివీ..
► ఒక్కో కళాశాలలో ఒక్కో విధమైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇకపై మెరుగైన వైద్య ఫలితాలు వచ్చిన కళాశాలల్లో అమలవుతున్న విధానాలను టెలి మెడిసిన్ ద్వారా మిగతా కళాశాలలకు వివరిస్తారు
► కొన్ని కళాశాలల్లో నిపుణులైన వైద్యులున్నారు. వీరిలో చాలామంది వారి నైపుణ్యాన్ని ఉపయోగించి సూక్ష్మ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేస్తారు. ఇలాంటి పద్ధతులను నెట్‌వర్క్‌కు అనుసంధానించి వాటిని అన్ని కళాశాలల్లో అవలంబించేలా చేస్తారు. ఉదాహరణకు రాజస్థాన్‌లో ఓ రోగికి శస్త్రచికిత్స చేసేందుకు హైదరాబాద్‌లో ఉన్న వైద్యులు టెలి మెడిసిన్ ద్వారా సూచనలిస్తారు. ఈ సూచనలను అనుసరించి అక్కడి వైద్యులు లైవ్‌లో ఆపరేషన్ నిర్వహించేందుకు వీలుంటుంది.
► చాలా చోట్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా చేస్తున్నారు. అయితే, అవి ఆ ఆస్పత్రికో, ఆ ప్రాంతానికో పరిమితమవుతున్నాయి. ఇదే విధమైన వ్యాధులకు మిగతా చోట్ల ఈ తరహా శస్త్రచికిత్సలు అందడంలేదు. దీంతో రోగులు ఇబ్బంది పడటమో, ఇతర ఆస్పత్రులకు వెళ్లడమో జరుగుతోంది. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా క్లిష్టమైన శస్త్రచికిత్సలు జరుగుతున్న సమయంలో టెలిమెడిసిన్ ద్వారా ఆయా వైద్య కళాశాలలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తద్వారా ఇదే విధమైన శస్త్ర చికిత్సలు అన్ని ఆస్పత్రులకు అందుబాటులోకి వస్తాయి.
► ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ తదితర పరీక్షల నిర్ధారణలో ఒక కళాశాల అనుసరిస్తున్న తీరును ఇతర కళాశాలలకు వివరిస్తారు.
► ప్రస్తుతం ఒకే వ్యాధికి ఒక్కో పేషెంటుకు వైద్యులు ఒక్కో రకమైన వైద్యం చేస్తున్నారు. అలా కాకుండా స్టాండర్డ్ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్ (ఎస్జీటీ)ని టెలి మెడిసిన్ ద్వారా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది.