గోరఖ్‌పూర్/లక్నో/న్యూఢిల్లీ: భారతీయ శ్రామికుల స్వేదం, రక్తపు బొట్లతో తాజ్‌మహల్ నిర్మితమైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ను ద్రోహులు నిర్మించారని.. ఇలాంటి కట్టడాలకు చరిత్రలో స్థానం లేదని సొంతపార్టీ ఎమ్మెల్యే సోమ్ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
సోమ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. చరిత్ర, వారసత్వాలను గౌరవించలేని ఏ దేశమూ ముందుకెళ్లలేదన్నారు. కాగా, బానిస చిహ్నాలుగా ఉన్న తాజ్‌మహల్‌తోపాటుగా ఎర్రకోట, పార్లమెంటు భవనాలనూ తొలగిస్తే బాగుంటుందని సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యానించారు.
నిర్మించిందెవరని కాదు.. కాపాడటం మా బాధ్యత
భారత కార్మికుల కష్టంతోనే తాజ్‌మహల్ నిర్మితమైందన్న యోగి.. వచ్చేవారం ఆగ్రాలో పర్యటించి నగరాభివృద్ధి, తాజ్ పర్యాటకం కోసం రూ.370 కోట్లతో రూపొందించిన ప్రణాళికపై సమీక్ష జరుపుతామన్నారు. ‘ప్రపంచ ప్రఖ్యాత అద్భుతమైన కట్టడమది.
చరిత్రాత్మకమైన ఈ కట్టడాన్ని ఎవరు నిర్మించారనే దానితో సంబంధం లేకుండా.. దీన్ని కాపాడుతూ, పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయటం యూపీ ప్రభుత్వం బాధ్యత’ అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. తాజ్‌మహల్ భద్రత, పర్యాటకులకు సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామన్నారు. ‘ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్.. దేశానికే గర్వకారణం. అందుకోసం దీన్ని వివాదాల్లోకి లాగటం, దీనిపై రాజకీయాలు చేయటం సరికాదు’ అని యూపీ గవర్నర్ రాంనాయక్ పేర్కొన్నారు.
‘ఏ దేశమైనా తన చరిత్ర, వారసత్వంపై గౌరవం లేకుండా అభివృద్ధి చెందలేదు. ఒకవేళ ఇలాగే ముందుకెళ్తే.. కొంతకాలం తర్వాత ఆ దేశం తన ఉనికిని కోల్పోవటం ఖాయం’ అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే సోమ్ వ్యాఖ్యలపై మోదీ పరోక్షంగా స్పందించారు.
వాటినీ కూల్చేయండి: ఆజంఖాన్
సోమ్ వ్యాఖ్యలపై వివాదం చల్లారకముందే సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ స్పందించారు. ‘బానిస చిహ్నాలను తప్పనిసరిగా తొలగించాలన్న అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఎప్పుడూ తాజ్‌మహల్ ఒక్కటే ఎందుకు? పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, కుతుబ్ మినార్, ఎర్రకోట.. వంటివన్నీ బానిస చిహ్నాలే కదా’ అని అన్నారు.
తాజ్‌మహల్ భారత సంస్కృతి వారసత్వం కాదని బీజేపీ, సోమ్‌లు అంత పట్టుదలగా ఉంటే.. అప్పుడు తాజ్‌ను ధ్వంసం చేసేందుకు ఆ ఎమ్మెల్యే, ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు కలసిరావాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని ఆజంఖాన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment