ముంబైః దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సామాజిక సంస్థ 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్స్' ముంబై ఛాప్టర్ నవరాత్రి ఉత్సవాలను వైదిక మంత్రాలు, భజనలు, యజ్ఞ యాగాదులతోపాటు, చండీహోమం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం, రుద్రహోమం, వాస్తు శాంతి హోమం వంటి అనేక హోమాలతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
దసరా ఉత్పవాల్లో భాగంగా నిర్వహిస్తున్నరుద్ర హోమం ఆనారోగ్యాలను హరించేందుకు సహకరిస్తుందని, అలాగే సుదర్శన హోమం బద్ధకాన్ని తగ్గించి కొత్తఉత్సాహాన్నివ్వడంతోపాటు, జ్ఞానాన్ని పెంచుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఏ హోమాలు నిర్వహించడం వల్ల వాతావరణం పరిశుద్ధమౌతుందని, అన్ని రకాలుగా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. భక్తులంతా ఒకేచోట చేరి ధ్యానాది ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతోపాటు, మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో అష్టమినాడు (దసరాల్లో ఎనిమిదవ రోజు) నిర్వహించే చండీ హోమం నవరాత్రి ఉత్సవాల్లోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని వెల్లడించారు.
చండీ సప్తశతిలో ఉండే 700 మంత్రాలు ఎంతో ప్రతీతిని పొందాయని ఈ మంత్రాలు ఎంతో శక్తిమంతమైనవని, నవరాత్రుల్లోని అష్టమినాడు వీటిని పఠిస్తూ హోమం నిర్వహించడంవల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్బిక్షం ఉండదని, దుఃఖం అనేది దరికి చేరదని, లోకకల్యాణంకోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని నిర్వాహకులు సూచించారు.
నవరాత్రుల్లో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్'
Published Wed, Oct 5 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement