ఇంటర్ టాపర్ అసాధారణ నిర్ణయం
అహ్మదాబాద్ :
సాధారణంగా పరీక్షల్లో టాపర్‌గా నిలిచే విద్యార్థులు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటారు. ఉన్నత చదువుల కోసం ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించిన గుజరాత్ యువకుడు (17) వర్షిల్ షా మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. చదువులు పక్కన పెట్టి గురువారం సూరత్ పట్టణంలో సన్యాసం స్వీకరించాడు.
కళ్యాణ్ మహరాజ్ అనే జైన సన్యాసిని స్ఫూర్తిగా తీసుకొని షా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే, కరెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియలో అనేక జలచరాలు చనిపోతాయని భావించి కరెంట్ వాడకాన్ని షా కుటుంబం బాగా తగ్గించింది. అందుకే ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి పరికరాలు లేవు. ప్రతిభావంతురాలు అయిన షా అక్క కూడా చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసింది. షా కుటుంబానికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని పొరుగువారు తెలిపారు.