ట్రాన్స్‌జెండర్స్‌ బిల్లుపై అసంతృప్తి | Unhappy with the bill transjendars | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్స్‌ బిల్లుపై అసంతృప్తి

Published Mon, Jul 24 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

Unhappy with the bill transjendars

కీలక అంశాలను ప్రస్తావించలేదు: స్టాండింగ్‌ కౌన్సిల్‌
న్యూఢిల్లీ: ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం ఉద్దేశించిన బిల్లులో కీలకమైన పలు అంశాలను ప్రస్తావించలేదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు వ్యక్తులకు సంబంధించి పౌర హక్కులైన పెళ్లి, విడాకులు వంటి వాటి గురించి బిల్లులో ప్రస్తావించలేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ రమేశ్‌ బైస్‌ నేతృత్వంలోని ఈ ప్యానెల్‌ సామాజిక న్యాయం, సాధికారత అనే అంశానికి సంబంధించిన నివేదికను శుక్రవారం లోక్‌సభ ముందు ఉంచింది. అందులో ట్రాన్స్‌జెండర్లను ఇప్పటికీ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 377 కింద నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ముసాయిదా ట్రాన్స్‌జెండర్స్‌ పర్సన్స్‌ (హక్కుల రక్షణ) బిల్లు 2016లో కీలకమైన పెళ్లి, విడాకులు, దత్తత వంటి పౌర హక్కులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావనా లేదని ప్యానెల్‌ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల కేటగిరీలో ట్రాన్స్‌జెండర్లకు సామాజికంగా, విద్యా పరంగా రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఈ బిల్లులో ప్రస్తావించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ప్రతిపాదించిన చట్టం ట్రాన్స్‌జెం డర్ల హక్కులకు సంబంధించి చాలా తక్కువ స్థాయిలో ఉందని పేర్కొంది. హార్మోన్ల ప్రకారం.. లేదా సర్జరీ కింద తమ జెండర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ, అవ కాశం వారికి ఉండాలని స్పష్టంచేసింది. ముసాయిదా బిల్లులో ట్రాన్స్‌జెండర్‌ నిర్వచనం స్పష్టంగా లేదని, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరముందని అభిప్రా యపడింది.

Advertisement
Advertisement