కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం రైతుసంఘాల ప్రతినిధుల వెల్లడి
న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో తమ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని.. పలు రైతుసంఘాలు, సంస్థల ప్రతినిధుల బృందం వెల్లడించింది. ఈ బృందం శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిసింది. ఈ భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌లు కూడా పాల్గొన్నారు. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ చట్టానికి పలు సవరణలు చేస్తూ గత ఏడాది డిసెంబర్ 29న జారీ చేసిన ఆర్డినెన్స్‌పై ప్రతిపక్ష పార్టీలతో పాటు.. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రైతు విభాగంతో సహా వివిధ రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటులో చట్టం చేసేందుకు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం బిల్లు తేనుంది.ముసాయిదా బిల్లులో.. ఆర్డినెన్స్‌లో భూసేకరణ చట్టంలో చేసిన సవరణలన్నీ యథాతథంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే.. పార్లమెంటు లోపలా, వెలుపలా ఎన్‌డీఏయేతర పక్షాలన్నీ భూసేకరణ ఆర్డినెన్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, పలు సామాజిక సంస్థలు, కార్యకర్తలు దీనిపై ఉద్యమించటానికి నిర్ణయం తీసుకోవటం వంటి పరిస్థితుల నేపధ్యంలో.. కేంద్ర మంత్రులు వివిధ రైతుసంఘాల నేతలతో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ నేత యుధ్‌వీర్‌సింగ్ తదితరులు మాట్లాడుతూ.. ఆర్డినెన్స్‌ను తొందరపాటుగా తెచ్చారని, రైతుల ప్రయోజనాలను విస్మరించారని తాము వ్యక్తంచేసిన ఆందోళనలు, అభ్యంతరాలను మంత్రులు సావధానంగా విన్నారని చెప్పారు. వారి నుంచి తమకు సానుకూల సంకేతాలు వచ్చాయని.. తమ ఆందోళలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
భూ ఆర్డినెన్స్‌పై ఆందోళనలను పరిశీలిస్తామన్నారు
Published Sun, Feb 22 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement