ఒక జననం ఒక మరణం
జనవరి 12...
ఎవడో ఎగరేసిన జెండా తనకు తానుగా సగం దిగిపోయి అవనతమైన రోజు. మరణమెప్పుడూ చివరి చరణం కాదనే సంక్షోభగీతం ఆలపించిన రోజు.
‘కాలాన్ని ఖడ్గంగా పైకెత్తగల గాయాల్ని దిక్సుచిలా ప్రసరించగల వీరుడితో కరచాలనం చేస్తున్నా’ అంటూ నువ్వెళ్లిపోయావ్. అరచేతిలో అదృష్టరేఖలకు బదులు ‘రక్తరేఖ’లు చూసుకుంటూ, వందలాది క్యానమైసిన్‌లు పొడిచేసుకుంటూ... పచ్చగా బతికినోడివి పత్రహరితం కోల్పోయిన మొక్కలా నువ్వు చితికిపోయాక... నీకొచ్చిన కలలాగే... భూమ్మీద నూకలు చెల్లినవారికి ప్రభుత్వం తరపున స్వర్గంలో సన్నబియ్యమిచ్చినట్టే... పత్రికల్లో అలాంటి అవాంఛనీయ సంఘటనలే ఎక్కువయ్యాయి.
ధాన్యపు గింజలొలిస్తే రైతు అస్థి పంజరాలు రాలిపడే దయనీయ దృశ్యాల్లో... ఎడారిలో కన్నీటి ఒయాసిస్సులు నింపిన ఆకలి మూలుగుల్లో... ఏకే 47 గర్జనల్లో... నువ్వే ముఖచిత్రమై కన్పిస్తున్నావ్. కలల మృతకళేబరాలు కాలుతున్న చోట నీ కవిత ప్రతిధ్వనిస్తూనే వుంది. కాలే కడుపుల కన్నీటి దృశ్యమై కదిలిపోతూనే వుంది. రెండున్నర దశాబ్దాల కింద నీ శరీరం మూగవోయినా, నీ కవిత్వం కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసినా భగ్గున మండే ఆకలి కవిత్వమై జనం నాలుకలపై తచ్చాడుతోంది.
‘తమ్ముడూ తమ్ముడూ/ నవ్వొచ్చేటప్పుడు తప్పక/ పిడికెడు మట్టినైనా/ తీసుకురా...ఒక అమరవీరుని జ్ఞాపకమైనా/ మోసుకురా...
మళ్లీ మళ్లీ నాకు/ జగిత్యాల గుర్తొస్తో్తంది/ జైత్రయాత్ర నను/ కలవరపెడుతోంది...’
ఆ ఉద్వేగభరిత సన్నివేశం నీ ఇంటిముందు నుంచి కదిలిపోయి నీ కవితా శక్తికి పోరాట పరిమళాన్ని అద్దింది. కాని అప్పటికే నీ జీవశక్తిని పీల్చేసిన క్షయ మృత్యుగీతాన్ని ఆలపించినా– ‘కాలం అంచున చిగురించిన నెత్తుటి ఊహను నేను/ కలల ఉపరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను/... ఆయుధంగా రూపొందే ఆకలి నేపథ్యం నేను’ అన్నావ్. చనిపోయే రోజు సైతం కవిత రాసిన నీ ధీరత్వానికి నమస్కరించాల్సిందే.
‘మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదుమనోహరాకాశంలో విలపించే/ చంద్రబింబం నా అశ్రుకణం కాదు’ అంటూ నిన్ను నువ్వు నిర్వచించుకొని వెళ్లిపోతే, గుండెలు చించుకుంది సాహితీలోకం. ఇప్పటికీ తెలంగాణ కంటì æనిండా తడి, జగిత్యాల జీవనాడిలో ఆగిపోని అలజడి.
(జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా...)
కె.వి.నరేందర్
94440 28701