ఇది తిరోగమనమా? పురోగమనమా?
ఇన్ బాక్స్
మార్చి 1న తెలంగాణ రాష్ట్ర సీపీఎం ప్లీనరీ సమా వేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చేతి వృత్తులను పునరుద్ధరిస్తామని సీపీఎం నాయ కులు ప్రకటించారు. కొందరు చెప్పులు కుడుతూ, కొందరు పాలిష్ చేస్తూ కుల వృత్తులకు పూర్వ వైభ వం తీసుకొస్తామని ఫొటోలు దిగారు.
కమ్యూనిస్టులు ఇంత అశాస్త్రీయంగా, అనాలో చితంగా ఎలా మాట్లాడతారో? చెప్పులు కుట్టే వృత్తిని పునరుద్ధరిస్తాం, ఆ పనికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పులు కుడుతూ ఫొటోలకు ఫోజు లిస్తే అది అత్యంత మహిమాన్వితం కాజాలదు. చెప్పులు కుట్టే వృత్తి గాని, ఇతర చేతివృత్తులు గాని కాలక్రమంలో అవి ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. దీన్ని జాగ్రత్తగా ఆలోచించి మార్గనిర్దేశనం చేయా ల్సిన వారు ఇలా మహాసభల సందర్భంగా కొంద రిని ఆకర్షించడానికి మాట్లాడటం, పాట్లు పడటం సమంజసంగా లేదు.
చేతివృత్తుల్లో భృతి లేదు. గిట్టుబాటు కావడం లేదు. సరైన ‘డిమాండ్’ లేదు. డిమాండ్ లేని దాన్ని ‘సప్లై’ చేస్తే నష్టపోయేది సదరు వ్యక్తులే. ఈ విష యం చేతివృత్తుల వారు చాలా కాలం క్రితమే గుర్తిం చారు. జీవనానికై కొత్త బాటలను ఎంచుకుంటు న్నారు. ఇది కాల ధర్మం. అంతేగాని ప్రపంచీకరణ కారణంగా ఇది జరుగుతోందని విశ్లేషించుకోవడం విషాదం. ప్రపంచీకరణ ఛాయలు లేనప్పటి తరా లైనా ఆ వృత్తి నుంచి బయట పడటానికి పడరాని పాట్లు పడ్డాయి. ఇప్పుడు షష్టిపూర్తి చేసుకున్న వారు తమ యుక్త వయసులో చేతి వృత్తుల నుంచి దూరం జరిగిన వారే. ఎందుకంటే అందులో మెరుగైన జీవ నం లేదని ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తెస్తామంటున్న నాయకులు, మేధావులు తమ తమ వృతు ్తలకు ఎప్పుడో దూరమైన విషయం మరచి ఇప్పుడు హిపోక్రసీతో మాట్లాడితే ఎలా?
మేధావులు, నాయకులు ఎప్పుడు... ఏది చెప్పినా అది ఆచరణ సాధ్యమయ్యేదిగాను, ప్రజల జీవన విధానం మెరుగుపడేందుకు ఉపకరించేది గాను ఉండాలి తప్ప ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చందంగా ఉండకూడదు కదా! వాస్తవానికి ఇప్పుడు చెప్పులు కుట్టే వృత్తి దశాబ్దాల క్రితమే కనుమరు గైంది. చెప్పుల, బూట్ల తయారీ ఫ్యాక్టరీలు వచ్చా యి. అనేక బ్రాండ్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పులు కుట్టే వృత్తికి ప్రాసంగికత ఉందా? ఉంటుందని వామపక్ష నాయకులు, మేధావులు భావిస్తున్నారా?
పారిశ్రామిక విప్లవం వచ్చి దాదాపు రెండు శతాబ్దాలు అవుతున్నా, అనంతరం అనేక సాంకేతిక, సామాజిక విప్లవాలు చోటుచేసుకున్నా, ఇప్పుడు ప్రపంచం ఒక కక్ష్యలో ప్రవేశించి అనూహ్య వేగంతో, చాలా మంది ఊహకు అందనంత రీతిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దూసుకు పోతూ ఉంటే కొత్త తరాలు ఆ దారుల వెంట పరుగులు పెడుతుంటే వామపక్షాల నాయ కులు, కొందరు మేధావులు, శతాబ్దపు క్రితం నాటి చేతి వృత్తుల పునరుద్ధరణ, నాటి పునర్ వైభవం గూర్చి మాట్లడటం తిరోగమన వైఖరే తప్ప, పురోగ మన దృక్పథం కాదు.
చెప్పులు కుట్టే వృత్తి నుంచి వచ్చిన వారికి విద్య అబ్బేలా చూసి, వారి నైపుణ్యాలు పెంచి, సాం కేతిక అవగాహన కల్పించి, చెప్పుల తయారీ భారీ కర్మాగారాల్లో పనిచేసేందుకు తర్ఫీదు ఇచ్చేలా ప్రోత్సహించడం, లేదా ఆయా వ్యక్తుల అభిరుచి మేరకు, ఆసక్తి మేరకు కొత్త వృత్తిలో (ఇంజనీరింగ్ మరొకటో) చేరేలా ప్రోత్సహించి ఈ కాలానికి తగ్గ ఆదాయం లభించే వృత్తిలో నైపుణ్యం సాధించమని సహకరిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అంతే తప్ప ఇప్పుడు చెప్పుల జత తయారు చేసి మార్కె ట్లో అమ్మకానికి పెడితే డిమాండ్ లేకపోవడమే గాక అమ్మినా కూలి గిట్టుబాటు కాదు. కావడం లేదు. ఈ విషయాన్ని దశాబ్దాలుగా ఆయా చేతి వృత్తుల వాళ్లు నెత్తి నోరూ కొట్టుకున్నా పట్టించుకోకుండా తమ జండా ప్రాభవం పెరిగేందుకు ఇలా అమాయకు లను ఉద్దేశించి అమాయకంగా, అశాస్త్రీయంగా ప్రక టనలు గుప్పించడం సబబు కాదు. సెల్‌ఫోన్, యాప్స్, కంప్యూటర్ ఉపయోగిస్తున్న వారేనా ఇలా మాట్లాడేది!
పేద ప్రజల బతుకులు బాగు చేస్తాం. వారికి సాధికారత సాధించి పెడతామని తాపత్రయపడే వామపక్షాలు ఎంత నిశితమైన విశ్లేషణ చేసి నికార్స యిన ప్రకటనలు చేయాలి? వాటన్నింటినీ గాలి కొదిలేసి ‘గాలివాటం’ నినాదాలు, కాలం చెల్లిన ప్రక టనలు, విశ్లేషణలు చేసి ఎవరిని ఆకట్టుకుంటారు?
ఉప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్టు