ఉద్ధరిణి పోయిందా? మూలవిరాట్ జాగ్రత్త! | Narendra modi to make anxiety in people get back black money from swiss bank | Sakshi
Sakshi News home page

ఉద్ధరిణి పోయిందా? మూలవిరాట్ జాగ్రత్త!

Published Sat, Jan 31 2015 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

ఉద్ధరిణి పోయిందా? మూలవిరాట్ జాగ్రత్త!

ఉద్ధరిణి పోయిందా? మూలవిరాట్ జాగ్రత్త!

కొత్త జెండాలు పవర్లోకొచ్చి నవమాసాలు నిండాయి. ఎన్నికల ప్రచార సమయంలో ‘‘ఇంటికో ఉద్యోగం వద్దన్నా తప్పదు’’ అంటూ ఒకాయన మొహమాట పెట్టేస్తే, ‘‘బాబు-జాబు’’ అని ప్రాస వెలిగించాడొకాయన. స్విస్ బ్యాంకు డబ్బు తెస్తా ఓడలు సిద్ధం చేస్తున్నానంటూ మోదీ హిందీలో దపేదపే ఆశ పెట్టారు. ఏవి ఓడలు? ఎక్కడ జాబులు?
 
 వేణుగోపాలస్వామి గుళ్లో ఉద్ధరిణి పోయిందని ఆచారి గారు గాలిగోపురం ప్రతిధ్వ నించేలా కేకలు పెట్టారు. ‘‘నాయనా! వేణుగోపాలా! నీకేదో అపచారం జరిగింద య్యా. నిత్యం పులికాపు పెట్టి మెరిపించే వాడినే. ఆ ఉద్ధరిణి లేక నేనెట్లా ఆచమ్యా, కేశవా చేసుకోను మాధవా! అది ఉద్ధరిణి కాదు, జాతి ఉద్ధ రణ! ‘‘పూజారి నెత్తీ నోరూ కొట్టుకుంటుంటే, ట్రస్టీగార న్నారూ - ‘‘ఉద్ధరిణికేం గాని మూల విరాట్టు, వెండి తొడుగులు కులాసాయేకదా? చూడండి’’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ‘‘... అదంతే. తులన్నర రాగి ఉద్ధ రిణి మీదకు ఊరి వారి మనసు తిప్పి, వెండి శఠారాల్ని మరిపించడం ఒక విద్య. మూడు తరాలుగా ఆయనకా మాయ తెలుసు. మూడు తరాలుగా నాకీ జాగ్రత్త తెలు సు’’ అన్నారు ట్రస్టీ చాలా తాపీగా.
 
 ఇక గుళ్లోంచి ఊళ్లోకి వస్తే - దీన్నే దోవ తప్పించ డం లేదా తప్పుదోవ పట్టించడం అంటారు. మునుపు నెహ్రూ, కృష్ణ మీనన్ లాంటి వాళ్లు పాలించేప్పుడు, దేశంలో సమస్యలు తలెత్తితే ఏ చైనా దురాక్రమణో సరి హద్దుల్లోకి వచ్చేది. ఇక దాంతో జనమంతా అగ్గిపెట్టెలు, కిరసనాయిలు కొనుక్కుని దాచుకునే పనిలో పడిపోయే వారు. ప్రజలు భయం భయంగా దిక్కులు చూస్తుండే వారు. సమస్యలు సద్దుమణిగేవి. సరిహద్దుల్లో జీపుల కుంభకోణాలు జరిగిపోయేవి. ఏదీ దొరక్కపోతే అష్ట గ్రహ కూటమి లేదంటే ఏకంగా యుగాంతం వచ్చేస్తోం దంటారు. పెద్దది చూపించి చిన్నదానికి ఎసరు పెట్టడం, ఉద్ధరిణి చూపించి మూలవిరాట్‌కి ఎసరు పెట్టడం రెండు సముచిత మార్గాలు అనాదిగా అమలులో ఉన్నా యి. వాటినే నేటికీ మనవాళ్లు ఆచరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు.
 
 నిన్న మొన్ననే ఎన్నికలైనట్టు అనిపిస్తున్నా కొత్త జెం డాలు పవర్లోకొచ్చి నవమాసాలు నిండాయి. నాయకుల ఎన్నికల ప్రసంగాలు ఇంకా ఓటర్ల చెవుల్లో రింగుమంటు న్నాయి. ‘‘ఇంటికో ఉద్యోగం వద్దన్నా తప్పదు’’ అంటూ ఒకాయన మొహమాట పెట్టేస్తే, ‘‘బాబు-జాబు’’ అని ప్రాస వెలిగించాడు మరొకాయన. స్విస్ బ్యాంకు డబ్బు తెస్తా ఓడలు సిద్ధం చేస్తున్నానంటూ మోదీ హిందీలో దపేదపే ఆశ పెట్టారు. ఏవి ఓడలు? పెద్దాయన మాట నమ్మి, ఒక బాధ్యతగల భారతీయ పౌరుడిగా, ఒక స్వయం ప్రకటిత మేధావిగా స్విస్ డబ్బు దేశంలోకి దిగ్గానే ఎలాగ చెలామణీలో పెట్టాలో ఒక పథకాన్ని రూపొందించాను.
 
 తెచ్చిన ధనరాశుల్ని సరాసరి ఏడు కొండలవాని హుండీకి తరలించాలి. మరుక్షణం అది ధర్మనిధిగా మారిపోతుంది. పైగా స్వామి స్వార్జితం అవు తుంది. ఏ దేశ కరెన్సీ అయినా, తెలుపు నలుపు ఎరుపు పసుపు విచక్షణ లేక కడిగిన ముత్యాలవుతాయి. పరకా మణిలో లెక్కింపులు అయ్యాక స్వామి పేరిట అంటే తి.తి.దే. ధర్మ నిధి ఖాతాలోకి వెళ్తుంది. ఇహ పండగే? ఆ సొమ్ముని విద్య వైద్యం రోడ్లు భవనాలు వస్తువులు వాహనాలు ఇలా అరవై ఆరు అవసరాలకు ఆగమాగ మంగా వాడుకోవచ్చు. దేశం యావత్తూ శ్రీవారిదే కనుక నిధిని దేశ రక్షణకి కైంకర్యం చేయవచ్చు. అందరూ ఆయన సేవకులే కనుక జీతాలు నాతాలు అందులోనే సర్దచ్చు. కాకపోతే చిత్తూరు దేవదేవుని సొంత జిల్లా కాబట్టి ఒక పది పైసలు ఉదారంగా ఆ జిల్లా మీద ఖర్చు చేస్తే ఆయ న సంతోషిస్తాడు. దీనిపై ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేశా. ఎటొచ్చీ ఓడలు రావడమే తరువాయి.  స్వచ్ఛ భారత్‌తో చీపురు కట్టలు చేతికి వచ్చాయి.
 
అటకలెక్కిన రేడియోలు గొంతులు సవరించుకుంటు న్నాయి. పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు అంటూ పెద్ద జాబితా కంటే ‘స్త్రీ’ అనే ఒక్క అక్షరాన్ని ట్రంప్‌కార్డ్ చేసుకున్నారట మోది. స్వైన్‌ఫ్లూ తెలంగాణ సర్కార్‌కి సాయపడుతోంది. స్వచ్ఛందంగా జనం నోరు ముక్కూ మూసుకు తిరుగుతున్నారు. చంద్రబాబుని నవ్యాంధ్ర క్యాపిటల్ అపర సంజీవనై కొన్నాళ్లు కాపాడు తుంది. నక్షత్రాల్ని చూపిస్తూ ఆకలిని అట్టే కాలం మరి పించలేరు!
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)  
 - శ్రీరమణ

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement