కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గతేడాది 50.2 శాతం పెరగడంపై ప్రతిపక్షాలు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. స్విస్ బ్యాంకుల్లోని డబ్బును వెనక్కు తెచ్చి భారతీయుడి ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానంటూ 2014 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ప్రధాని∙మోదీ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించాయి. శుక్రవారం ఉదయం కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల సొమ్మంతా నల్లధనమేనంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
అవినీతిపరులు ఎవరైనా స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో నల్లధనం దాచినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గోయల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ మోదీ లక్ష్యంగా ట్వీట్లు చేశారు. ‘అంటే స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారతీయుల సొమ్మంతా నల్లధనం కానేకాదట. చట్ట ప్రకారం సంపాదించినదేనని ఇప్పుడు మోదీ చెబుతారు’ అంటూ రాహుల్ మోదీపై విరుచుకుపడ్డారు. ‘స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కుతెచ్చి ఒక్కో బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తానని 2014లో మోదీ చెప్పారు. 2016లోనేమో నల్లధనానికి విరుగుడు నోట్లరద్దేనన్నారు. ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు నల్లధనం కాదు, తెల్లధనమేనని ఆయన అంటారు’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.
తీవ్ర ఆందోళన కలిగిస్తోంది: జేడీయూ
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గతేడాది భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా వ్యాఖ్యానించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరగడం తనకు ఏ మాత్రం ఆశ్చర్యకరంగా లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment