కనులపండువగా వేణుగోపాలస్వామి రథోత్సవం
హిందూపురం అర్బన్: హిందూపురంలో వేణుగోపాలస్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మూలవిరాట్ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి ఉదయం సుప్రభాతసేవ అనంతరం పంచామృతాభిషేకం చేసి విశేషంగా ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి మేళాతాళాలతో ప్రాకారోత్సవం చేశారు. అనంతరం ర«థసంప్రోక్షణ, రథాంగహోమం, హోమపూర్ణాహుతి గావించారు. తర్వాత యాదవ సంఘం సభ్యులు డప్పు వాయిద్యాలతో రథ చక్ర కర్రదండలతో ఊరేగింపుగా వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల గుండా తీసుకువచ్చి పూజలు చేశారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. పూజల అనంతరం రథాన్ని లాగారు. బెంగళూరు రోడ్డు గుండా వక్కల బజార్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఆలయానికి రథం చేరుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ర«థోత్సవానికి ముందే యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ జేపీకే రాము, ఆలయ ఈఓ శ్రీనివాసులు, మునిసిపల్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, ఆలయ కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.