brahma rathothsavam
-
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అశేష భక్తజనం నడుమ అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8.56 గంటలకు రథం ముందుకు కదిలింది. స్వామివారు తిరువీధుల గుండా విహరించి సాయంత్రం 3.45 గంటలకు యథాస్థానం చేరుకున్నారు. రథం తిరువీధుల్లోని గండి మడుగు ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకోగానే ఎడమ వైపు ఉన్న తేరు మోకు రెండు సార్లు తెగిపోయి అంతరాయం కలిగింది. చివర్లో రథం గోడకు ఆనుకోవడంతో అక్కడ కూడా గంటకు పైగా ఆలస్యమైంది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆనవాయితీగా మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తూ వచ్చారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు రథోత్సవానికి విచ్చేసినట్లు ఆలయ, పోలీసు అధికారుల అంచనా. ఎండలు మండిపోతున్నా భక్తులు ఏమాత్రం లెక్కచేయక స్వామివారి సేవలో తరించారు. -
కనులపండువగా వేణుగోపాలస్వామి రథోత్సవం
హిందూపురం అర్బన్: హిందూపురంలో వేణుగోపాలస్వామి రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది. మూలవిరాట్ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి ఉదయం సుప్రభాతసేవ అనంతరం పంచామృతాభిషేకం చేసి విశేషంగా ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుదీర్చి మేళాతాళాలతో ప్రాకారోత్సవం చేశారు. అనంతరం ర«థసంప్రోక్షణ, రథాంగహోమం, హోమపూర్ణాహుతి గావించారు. తర్వాత యాదవ సంఘం సభ్యులు డప్పు వాయిద్యాలతో రథ చక్ర కర్రదండలతో ఊరేగింపుగా వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల గుండా తీసుకువచ్చి పూజలు చేశారు. భక్తుల గోవిందనామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. పూజల అనంతరం రథాన్ని లాగారు. బెంగళూరు రోడ్డు గుండా వక్కల బజార్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఆలయానికి రథం చేరుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ర«థోత్సవానికి ముందే యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ జేపీకే రాము, ఆలయ ఈఓ శ్రీనివాసులు, మునిసిపల్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, ఆలయ కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
నమో నారసింహా..
- వైభవంగా లక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవం - భక్తులతో పోటెత్తిన పెన్నహోబిల క్షేత్రం ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : ‘నమో నారసింహా’ అంటూ భక్తుల గోవింద నామస్మరణతో పెన్నహోబిల క్షేత్రం మార్మోగింది. శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగించారు. ధూళోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లాగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీసంఖ్యలో భక్తులు తరలిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైభవంగా బ్రహ్మ రథోత్సవం
పావగడ : కణివె శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రాలు , వింజామర సేవలతో అర్చకులు రథంలోకి తరలించి ప్రతిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారి , తహసీల్దార్ తిప్పూరావు రథాన్ని లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బ్రహ్మరథంలోకి అరటి పళ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పలువురు ధర్మకర్తలు భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. -
హరహర మహదేవ శంభోశంకర
- నేత్రపర్వంగా సాగిన చంద్రమౌళీశ్వర బ్రహ్మరథోత్సవం - భక్తులతో పోటెత్తిన గవిమఠ సంస్థానం ఉరవకొండ : హరహర మహదేవ శంభోశంకర అనే నామస్మరణతో గవిమఠ సంస్థానం మార్మోగింది. గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా సాగాయి. వేడుకలు తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గవిమఠ సంస్థానం కిటకిటలాడింది. ఉదయం సంప్రదాయబద్ధంగా మేజర్ పంచాయతీ వారు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన భారీ గజమాలను రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్టు అధినేత నర్రాకేశన్న అధ్వర్యంలో ఊరేగింపుగా గవిమఠానికి సమర్పించారు. అనంతరం గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి వారి అధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. తర్వాత భక్తులు హరహర మహదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగారు. ఉరవకొండ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శాయికుమారి, గవిమఠం సహాయ కమిషనర్ ఆనంద్, ఈఓ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ఐ లింగేష్, మాజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవితో పాటు జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ కొత్తలక్ష్మిదేవి, ఎంపీటీసీ సభ్యులు విజయ్, రవి, మాలింగ, ఎర్రిస్వామి పాల్గొన్నారు. -
పోటెత్తిన జనం
- కనుల పండువగా సిద్ధేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం - స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం హేమావతి గ్రామంలో వెలిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన పెద్ద రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మడకశిర, హిందూపురం, కర్ణాటక ప్రాంతాలు చెళ్లికెర, హరియూర్, శిర, తుమకూరు, మైసూర్, బెంగళూరు, మండ్య తదితర ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఉదయం సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా వివిధ రకాల పూలమాలలతో అలంకరించి బ్రహ్మరథోత్సవం వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి వేదమంత్రోచ్చారణల మధ్య రథోత్సవంలో కూర్చోబెట్టారు. అశేష భక్త జన సమూహం మధ్య ఓం నమఃశివాయా.. సిద్ధేశ్వరస్వామి మహరాజ్‌కీ జై.. శివ.. శివహర శంభో అంటూ శివనామస్మరణలతో భక్తులు రథోత్సవాన్ని ముందుకు లాగారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో హేమావతి గ్రామం జనాలతో కిక్కిరిసిపోయింది. దీంతో గ్రామంలోని దుకాణాలు, హోటళ్లు బిజీబిజీగా మారాయి. -
వైభవంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం
కుందుర్పి: శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం బుధవారం కుందుర్పిలో అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఆలయ ధర్మకర్త సత్యనారాయణశాస్త్రి, తహశీల్దార్ రమేషన్ సర్పంచ్ పెద్దనరశింహప్ప తదితరులు రథాన్ని కొంతదూరం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్ తదితరులు స్వామి వారిని దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. రథోత్సవానికి నియోజక వర్గం నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు
హిందూపురం అర్బన్ : గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మరథోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం మూలవిరాట్ రంగనాథస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో అలంకరించి మేళతాళాలతో ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసులు, కమిటీ చైర్మన్ ఎంకే మోహన్, అర్చకులు గోవిందశర్మ, కమిటీ సభ్యులు రుపలేఖా, కదిరప్ప పాల్గొన్నారు.