
వైభవంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం
కుందుర్పి: శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం బుధవారం కుందుర్పిలో అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఆలయ ధర్మకర్త సత్యనారాయణశాస్త్రి, తహశీల్దార్ రమేషన్ సర్పంచ్ పెద్దనరశింహప్ప తదితరులు రథాన్ని కొంతదూరం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు.
అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్ తదితరులు స్వామి వారిని దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. రథోత్సవానికి నియోజక వర్గం నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.