నమో నారసింహా..
- వైభవంగా లక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవం
- భక్తులతో పోటెత్తిన పెన్నహోబిల క్షేత్రం
ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : ‘నమో నారసింహా’ అంటూ భక్తుల గోవింద నామస్మరణతో పెన్నహోబిల క్షేత్రం మార్మోగింది. శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగించారు. ధూళోత్సవం నిర్వహించారు.
ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లాగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీసంఖ్యలో భక్తులు తరలిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.