pennahobilam
-
వైభవంగా ఉట్ల పరుష
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉట్ల పరుస వైభవంగా జరిగింది. ఈఓ అక్కిరెడ్డి, ప్రధాన అర్చకులు ద్వారకనాథచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల పెన్నోబులేసుడి ఆలయం నుంచి పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకమార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినృసింహున్ని ప్రత్యేక పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం యువకులు ఉట్లపరుసలో పాల్గొని, ఉట్టిని పగులగొట్టారు. -
ముగిసిన పెన్నోహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం మహా మంగళహారతి, కుంకమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ద్వారకనాథాచార్యులు ఆధ్వర్యంలో ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబులేసుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
నమో నారసింహా..
- వైభవంగా లక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవం - భక్తులతో పోటెత్తిన పెన్నహోబిల క్షేత్రం ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : ‘నమో నారసింహా’ అంటూ భక్తుల గోవింద నామస్మరణతో పెన్నహోబిల క్షేత్రం మార్మోగింది. శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగించారు. ధూళోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లాగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీసంఖ్యలో భక్తులు తరలిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కనుల పండువగా కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్ : మండల పరిధిలోని శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భాగంగా అత్యంత కీలకమైన శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి పలు పూజా కార్యక్రమాల అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వేద పండితుల మధ్య స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు వేలాదిమంది భక్తాదుల నడుమ సందడిగా సాగింది. ఉత్సవ ఉభయదాతలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహుడిని ప్రత్యేకంగా అలంకరించి హంస వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. -
పెన్నహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనారసింహుడి బ్రహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆమిద్యాల గ్రామం పెన్నబిళేసుడి ఆలయం నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను తీసుకోరావడానికి ప్రత్యేక పల్లకిను పెన్నహోబిలం నుంచి తీసుకెళ్లారు. ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారాకానాథ్చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి తీసుకొచ్చారు. -
ముస్తాబైన పెన్నహోబిళం
- రేపటి నుంచి శ్రీలక్ష్మీనారసింహుని బ్రహోత్సవాలు - 14న కల్యాణోత్సవం, 16న బ్రహ్మరథోత్సవం, 19న ఉత్సవాల ముగింపు ఉరవకొండ : రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీలక్ష్మీ నారసింహుడి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెన్నహోబిళం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. స్వస్తిశ్రీ హేవలంబినామ సంవత్సరం వైశాఖ శుద్ధ ద్వాదశి ఈనెల 7వ తేదీ ఆదివారం శ్రీలక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఆమిద్యాల నుంచి శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. 8న ధ్వజారోహణం, 9న సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు, 10న గోవాహనం, శేష వాహనంపై స్వామి దర్శనం, 11న హంస వాహనోత్సవం, 12న హనమంత వాహనోత్సవం, 13న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉంటాయి. 14న గరుడ వాహనోత్సవం అనంతరం శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 15న ఐరావత వాహనోత్సవం, 16న శ్రీవారి బ్రహ్మరథోత్సవం, 17న అశ్వవాహనోత్సవం, 18న ధ్వజావరోహణం, శయనోత్సవం ఉంటాయి. 19న ఉత్సవమూర్తులను ఆమిద్యాలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీంతో బ్రహోత్సవాలు ముగిస్తాయని ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకుడు ద్వారకానాథ్చార్యులు తెలిపారు. ఆలయ సంక్షిప్త చరిత్ర పెన్నహోబిళానికి క్షేత్ర పురాణం ఉన్నట్లు పూర్వీకుల కథనం. ఆ మేరకు పెన్నానదికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకు కింది భాగంలో తూర్పుదిశగా గొల్లపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామస్తునికి చెందిన ఒక గోవు ప్రతిరోజూ కొండపై ఉన్న బిలం మధ్యకు వచ్చి పాలిచ్చి వెళ్లేది. తన గోవు పొదుగు ప్రతిరోజూ ఖాళీగా ఉండటం గమనించి దాని యజమాని కలత చెందగా, ఆయనకు నారసింహుడు అగుపించి నీ గోవు పాలు తానే సేవిస్తున్నానని చెప్పారు. దీంతో బిలం ప్రాంతంలో పరిశీలించిన ఆవు యజమానికి బిలం పై భాగంలో 5.3 అడుగుల పరిమాణంలో ఉన్న స్వామివారి పాదముద్రిక ఉన్న శిలాఫలకం, కింది భాగంలో నైరుతి దిశలో లక్ష్మీదేవి శిల అగుపించాయి. దీంతో గొల్లపల్లి గ్రామస్తులు శ్రీవారి, అమ్మవారి ఆలయాలు నిర్మించి పూజలు ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయులు విజయనగరం నుంచి పెనుకొండకు వెళ్తూ ఈ క్షేత్రంలో మజిలీ గావించినట్లు కూడా ఆధారాలున్నాయి. ఈ కొండపై ఉద్దాలక మహర్షి తపస్సు కూడా చేసినట్లు చెబుతారు. ప్రకృతి అందాలకు నిలయం ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన పెన్నహోబిళం పర్యాటక ప్రాంతంగా అందరి మనస్సులు దోచేస్తోంది. ఆలయం కింది భాగంలో గల గల పారే సేలయేళ్లు, ఎటు చూసినా పచ్చని చెట్లు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఉద్భవ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం పక్కన కోనేరులు, నెమళ్లు, జింకలు అప్పుడప్పుడూ పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. నిత్యం భక్తుల తాకిడి ఉండే పెన్నహోబిళానికి జిల్లా కేంద్రమైన అనంతపురానికి 35 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి పెన్నహోబిళానికి ప్రతి అరగంటకూ ఒక బస్సుంది. అన్నీ ఏర్పాట్లూ చేశాం బ్రహోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశాం. ఎండలు మండిపోతున్న దృష్ట్యా ఆలయ ప్రాంగణం చుట్టూ చలువ పందిళ్లు వేయించాం. దీంతోపాటు భక్తులకు తాగునీరు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. - రమేష్‌బాబు, ఈఓ, పెన్నహోబిళం -
వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ
పెన్నహోబిళం(ఉరవకొండ) : మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి పల్లకి ఉత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారాకానా«థ్ చార్యులు అధ్వర్యంలో అభిషేకం, మహా మంగళహరతి సేవలను నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహా స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగారు.