కొత్త పుస్తకాలు
1)
మహాసంకల్పం
నవలా రచన: వాసుదేవ్; పేజీలు: 328; వెల: 200; ప్రతులకు: డాక్టర్ కడియాల వాసుదేవరావు, 3-30-9, 1వ లైను, నలందా నగర్, గుంటూరు-522006; ఫోన్: 7702498377
‘యాభై ఏళ్లలో వైద్యరంగంలో వచ్చిన మార్పులను సందర్భోచితంగా డాక్టర్ వాసుదేవ్ చక్కగా వివరించారు. సమాంతరంగా మన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలను కూడా ‘‘ఒక పక్షం వహించకుండా’’ వివరిస్తూ వచ్చారు’. ‘ప్రజల యెడల బాధ్యతగా వుండే డాక్టర్లు కీలక స్థానాలలోకి వస్తే ఎంతగా ప్రజలకు మేలు చేయవచ్చో డాక్టర్ రామేశ్వరం, డాక్టర్ అనసూయ పాత్రల ద్వారా చూపించారు.’ ‘చిరునవ్వు, సానుభూతి, మానవతా విలువలు వైద్యవృత్తికి పట్టుగొమ్మలు కావాలని, వీటిని మించిన ఔషధాలు లేవని నొక్కి చెబుతారు రచయిత’.
2)
అసమాన వీరుడు - అనురాగ దేవత
రచన: దోరవేటి; పేజీలు: 104; వెల: 80; ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్, కాచిగూడ; ప్రచురణ కర్త ఫోన్: 9963770587
‘రొమాన్స్, సాహసం, యుద్ధవ్యూహాలు, ఎత్తుగడలు, దేశభక్తి, మతవిశ్వాసాలు, బ్రాహ్మణాధిపత్యం, రాజనీతిజ్ఞత అన్నీ కలగలిపి బాజీరావు-మస్తానీల సాహస ప్రేమకథను దోరవేటి నవలగా మలిచిండు’. ‘18 ఏండ్లకే మరాఠా రాజ్య ప్రధానమంత్రి పదవి చేపట్టి, చేసిన అన్ని యుద్ధాల్ని గెలిచి కేవలం 42వ యేట 1740లో మరణించిన బాజీరావు కథ ఇది’. ‘మతమేదైనా ప్రేమించిన స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ పాణంగా చూసుకోవాలని చెప్పే కథ’. ‘తెలుగు చారిత్రక నవలా సాహిత్యానికి మేలైన జోడింపు’.
3)
వత్తావా మా వూరికి
కవి: సైదులు ఐనాల; పేజీలు: 104; వెల: 60; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430; కవి ఫోన్: 9948714105
‘తన జ్ఞాపకాల్లోంచి, గ్రామీణ జీవిత నేపథ్యంలోంచి, తన అమ్మ, అమ్మమ్మ, తాతయ్యల జీవితాన్ని అవలోకిస్తూ, ఇవాళ్టి ప్రపంచంలో తన స్థానం కోసం వెదుక్కుంటూ కవిత్వంగా వ్యక్తం’ అయ్యాడు ఐనాల. ‘కవికి అనుభూతి అత్యంత ప్రధానం’. ‘తెలంగాణ పలుకుబడిలో సజీవమైన భాషలో వ్యక్తీకరించిన కవితలన్నీ నేటివిటీని మనముందు ఉంచుతాయి’.
4)
రెండో అధ్యాయానికి ముందుమాట!
కవి: విరించి విరివింటి; పేజీలు: 144; వెల: 100; ప్రతులకు: కవి, ప్లాట్ నం.18, శ్రీనివాసం, విజయాగార్డెన్స్ కాలనీ, బండ్లగూడ రోడ్, నాగోల్, హైదరాబాద్-68; ఫోన్: 9948616191
‘పరాయీకరణకు బదులు సొంతదనం, లొంగిపోవడానికి బదులు తలెత్తడం, ద్వేషాలకి బదులు ప్రేమలు, కృత్రిమత్వానికి బదులు సహజత్వం, విడిపోవడానికి బదులు కలిసిపోవడాలు... ఇవీ ఈ కవి ఇష్టాలు. వీటినే పలు కవితల ద్వారా వ్యక్తపరిచాడు. ఈ వ్యక్తీకరణల్లో అతని స్వరం అసెర్టివ్‌గా వుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని కొత్త దారుల్లో పరిచి కవితలకు ప్రత్యేకమైన కాంతిని ఇచ్చాడు’.
5)
తప్తస్పృహ
కవి: మౌనశ్రీ మల్లిక్; పేజీలు: 152; వెల: 100; ప్రతులకు: స్వప్న ఆరెల్లి, 18-1-101/3/4, శివసాయి నగర్, ఉప్పుగూడ, హైదరాబాద్-53; ఫోన్: 9394881004
‘మల్లిక్‌లో అన్ని విశ్వదర్శనాలు ఇముడుతాయి’. అతనిలో ‘కవి ఉన్నాడు. తాత్విక చింతన ఉన్నది’. ‘మంచి కవిత్వం, చెడు కవిత్వం అంటూ ఉండదు. కవిత్వం అంటే ఏమిటో తెలిసినవారు ఏదిరాసినా అది బాగుంటుందని నమ్ముతా’డు. ‘కవిత్వం కీర్తి కాదు ఆర్తి’ అనే మౌనశ్రీ మల్లిక్- ‘దిగంబర’, ‘గరళమ్’ తర్వాత వెలువరిస్తున్న 64 కవితల మూడో సంపుటి ఇది.
6)
సమైక్యాంధ్ర ఉద్యమం - ‘అనంత’ అనుభవం
రచన: ఎస్.సుభాస్; పేజీలు: 408; వెల: 100; ప్రచురణ: ఎస్.శ్రీవాణి, 660, రాగమయూరి గ్రీన్‌హిల్స్, కర్నూలు-2; ఫోన్: 9949992757
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గ్రంథానికి మూలం. కాగా, దాన్ని వ్యతిరేకిస్తూ వెల్లువెత్తిన రాష్ట్రవ్యాపిత ఉద్యమంలో భాగంగా, అనంతపురం జిల్లా ఉద్యమాన్ని గ్రంథస్తం చేశాడు రచయిత. కేవలం రోజువారీ ఉద్యమమే గాక, ఉద్యమ మూలాలు, ఆశయాలు, మంచిచెడ్డలు విపులీకరించాడు’. ‘తెలుగు నుడికారంపై, వాక్య నిర్మాణంపై, ఉద్యమ ఎత్తుపల్లాలు వర్ణించడంలో మెచ్చుకోదగ్గ నేర్పు ప్రదర్శించాడు’.