‘స్వచ్ఛ భారత్’ ఆదర్శం కావాలి
‘‘స్వచ్ఛ భారత్’’ కూడా ఒక రాజకీయ, ఓట్ల నినాదంగా మారకూడదు. ‘‘గరీబీ హఠావో’’, ‘‘భూసంస్కరణలు’’, ‘‘కోటి ఉద్యోగాల కల్పన’’ లాంటివి మన దేశంలో బూటకంగా మిగిలిపోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యాన్ని అభినందించాల్సిందే. అయితే, దీనికి రాజకీయ సంకల్పం చాలా ముఖ్యం.
స్వచ్ఛ భారత్ పేరుతో రానున్న ఐదేళ్లలో పరిశుభ్ర భారతావనిని నిర్మించే పనికి పూనుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. దీనికోసం రానున్న ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్లను ఖర్చుపెడతామని ప్రకటిం చారు. 4,041 పట్టణాలలో 62 వేల కోట్ల రూపా యలు ఖర్చు పెట్టనున్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వను న్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా దేశవ్యాప్తంగా ప్రారంభించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు, ప్రముఖ నాయకులు మద్దతు ప్రకటించి వారానికి రెండు గంటలు దీనికోసం కేటాయిస్తామని ప్రజలతో కూడా ప్రతిజ్ఞలు చేయించారు. దేశంలో నూతన శకం రాబోతోందని ప్రకటించారు. అందరూ చీపుర్లు చేపట్టి వీధులను, అపరిశుభ్ర పరిసరాలను ఊడ్చ టం మొదలెట్టారు. 2019 మహాత్మాగాంధీ 150 జయంతి నాటికి భారతదేశంలో మరుగుదొడ్ల నిర్మా ణం పూర్తి చేసి, సంపూర్ణ పరిశుభ్రత సాధించి, ఆయనకు ఘననివాళి అర్పించాలని మోదీ భావిస్తున్నారు.
భారతదేశంలో 50 శాతం మందికి పైగా అంటే 61 కోట్లకు పైగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండిం టిలో 73 శాతం మంది ప్రజలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఒక అంచనా. దుర్భర దారి ద్య్రం, పేదరికం, నిరక్షరాస్యత, సాంస్కృతిక పర మైన అంశాలు, వసతులు, నీటివనరుల లేమి, ఆర్థిక స్తోమత లోపించడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జనకు కారణం. మన గ్రామా ల్లో, మురికివాడల్లో నివసించే అత్యధిక ప్రజలు కనీస వసతులకు నోచుకోక పేదరికంలో మగ్గుతు న్నారు. చాలీచాలని కూలి డబ్బులతో జీవనాన్ని గడుపుతున్నారు. గ్రామాలను సస్యశ్యామలం చేయాలని మహాత్మాగాంధీ చెబితే, మన పాలకులు గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, మన దేశంలో బహిరంగ మల విసర్జన ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అత్యధికంగా ఉంది. అయినప్ప టికీ దాన్ని తగ్గించడానికి మన దేశంలో గొప్ప కృషి ఏమీ జరగలేదని ఆ నివేదిక పేర్కొంది. బహిరంగ మల విసర్జన వల్ల కలరా, డయేరియా, డీసెంట్రీ, హైపటైటిస్ ఏ, టైఫాయిడ్ లాంటి జబ్బులు ప్రజ లను పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లేమితో ప్రతి రోజు మన దేశంలో డయేరియాతో కనీసం వెయ్యి మంది పసి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
విద్యాలయాలలో, గ్రామాలలో, పట్టణాలలో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా, ఫలించటం లేదు. నీటి వసతిలేకపోవటం, మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవటం దీనికి ప్రధాన కార ణాలు. ఇందులో సాంస్కృతిక పరమైన విషయాలూ ఉన్నాయి. నివసించే ఇళ్లల్లోనూ, ఊరిలోనూ తిని పడుకునే ప్రాంతాల్లో మరుగుదొడ్లతో మల విసర్జన చేయటం అపవిత్రంగా భావించే స్థితి కూడా ఉంది. కొన్ని గిరిజన తెగల్లో అలా చేస్తే కుల దైవం అపవి త్రం అయిపోతుందనే భావనలు, మూఢనమ్మ కాలు ఉండనే ఉన్నాయి.
విద్యాలయాలలో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మన దేశంలో ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఇటీవలనే పాఠశా లల్లో తక్షణం మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశిం చింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం కూడా ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిం చాలి. కానీ, విషాదం ఏమిటంటే ఎక్కడా ఇది అమ లు జరిగిన దాఖలాలు లేవు. బాలికలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరుగుదొడ్ల అవకాశాలు లేక ప్రత్యేకించి దళిత మహిళలు అవమానాలకు గురవు తున్నారు. దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు.
గత ప్రభుత్వాల నినాదాల లాగే ‘‘స్వచ్ఛ భార త్’’ కూడా ఒక రాజకీయ నినాదంగా, ఓట్ల నినాదం గా మారకూడదు. ‘‘గరీబీ హఠావో’’, ‘‘భూసంస్క రణలు’’, ‘‘కోటి ఉద్యోగాల కల్పన’’ లాంటివి మన దేశంలో బూటకంగా మిగిలిపోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యాన్ని అభినందించాల్సిందే. అయితే, దీనికి రాజ కీయ సంకల్పం చాలా ముఖ్యం. దేశంలో పారిశు ద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలను, ప్రజారోగ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇది ఎప్పటికీ ఆచరణకు నోచుకోని ఒక నినాదంగా మా త్రం మిగిలిపోకూడదు. భారతదేశంలో ప్రతి పౌరు డు ఏ రోజయితే మరుగుదొడ్లు ఉపయోగించగలు గుతాడో, ఆ రోజు దేశం గొప్ప విజయం సాధించిం దని నేను భావిస్తాను అన్న జవహర్ లాల్ నెహ్రూ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
మద్దులూరి ఆంజనేయులు (వ్యాసకర్త సామాజిక కార్యకర్త)