సయీఫ్ ముస్తఫా (హైజాకర్) రాయని డైరీ | Saif mustafa not written diary Hijacker | Sakshi
Sakshi News home page

సయీఫ్ ముస్తఫా (హైజాకర్) రాయని డైరీ

Published Sun, Apr 3 2016 11:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

సయీఫ్ ముస్తఫా (హైజాకర్) రాయని డైరీ

సయీఫ్ ముస్తఫా (హైజాకర్) రాయని డైరీ

నా భార్య సైప్రస్‌లో. నేను ఈజిప్టులో. ఆ దీవికి, ఈ దేశానికి మధ్య ఉన్న వెయ్యి కిలోమీటర్ల దూరం.. నా భార్య నన్ను నెట్టేసిన దూరం కన్నా చాలా చిన్న దూరం. ‘ఇడియట్’ అంటుండేది నన్నెప్పుడూ! ప్రేమించడం తప్ప నాకేం తెలియదట. ‘ఉదయం ప్రేమ. మధ్యాహ్నం ప్రేమ. సాయంత్రం ప్రేమ. షిట్’ అంటుంది. ప్లానింగ్ లేకుండా, పౌండ్ ఆదాయం లేకుండా ఊరికే తనను ప్రేమిస్తూ కూర్చుంటానట. ‘ఛీ.. నీ ముఖం నాకు చూపించకు’ అంది ఒకరోజు. ఇరవై నాలుగేళ్ల క్రితం ఒకరోజు! ఈజిప్టు వచ్చేశాను. దైవకృప. తను వెళ్లిపోతాననలేదు. నన్ను వెళ్లిపొమ్మంది. తను వెళ్లిపోయుంటే లోటస్ పువ్వును చేత్తో పట్టుకుని ఈజిప్టంతా ఈరోజుకీ తనకోసం వెతుక్కుంటూ ఉండేవాడిని. సైప్రస్‌లో తనెక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి లోకంలో నేను ఏ దిక్కున ఉన్నా ఆమె నాతో ఉన్నట్టే.
 
 ‘మిస్టర్ సయీఫ్ ఎల్డిన్ ముస్తఫా..’ అంటూ కస్టడీ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు. ‘మిమ్మల్ని అందరూ ఇడియట్ అంటుంటే  నాకెంతో బాధగా ఉంది’ అన్నాడు. ‘హి ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్. హి ఈజ్ ఏన్ ఇడియట్’ అంటున్నారట నన్ను. ఆయన ముఖంలో నిజంగానే బాధ కనిపిస్తోంది. ‘అనుకోనివ్వండి ఆఫీసర్’ అన్నాను. ఇడియట్ అన్నది నాకెంతో ప్రియమైన పిలుపు అని నేను ఆయనతో చెప్పదలచుకోలేదు. ‘‘వేరే ఇంకే కారణంతోనైనా మీరు విమానాన్ని హైజాక్ చేసి ఉండవలసింది మిస్టర్ ముస్తఫా. భార్యను కలవడం కోసం ఎవరైనా విమానాలను హైజాక్ చేసి ప్రభుత్వాలను బెదిరిస్తారా?’’ అన్నాడు.
 
 నేనేం మాట్లాడలేదు. దేశం పట్ల ప్రేమ లేని ద్రోహినని ఈజిప్టు నన్ను ఐదేళ్లుగా కదలనివ్వడం లేదు. ప్రేమించడం తప్ప పనికొచ్చే పని ఒక్కటీ చెయ్యడం లేదని నా భార్య నన్ను ఇరవై నాలుగేళ్లుగా కలవనివ్వడం లేదు. ఏం చెయ్యాలి? ప్రాణం కొట్టుకుపోతుంటే! ‘నీ ముఖం నాకు చూపించకు’ అంది కానీ, ‘నా ముఖం నీకు చూపించను’ అనలేదు కదా. అందుకే ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి, సైప్రస్‌లో దింపాను. తనొచ్చి నన్ను చూస్తేనే అందర్నీ వదిలిపెడతానన్నాను. తను రాలేదు. పోలీసులు వచ్చారు!
 
 ‘మీరు హైజాక్ చేసిన విమానంలోని ప్రయాణికులు, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెన్ అంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మిస్టర్ ముస్తఫా. మీరొక్కరే జైల్లో ఉన్నారు. బెన్ ఇన్నెస్ అనే కుర్రాడైతే మీతో దిగిన సెల్ఫీతో ఫేమస్ అయిపోయాడు. సైప్రస్ ప్రెసిడెంట్ ప్రెస్‌మీట్ పెట్టి, రిలాక్స్‌డ్‌గా నవ్వి, ఇంటికి వెళ్లిపోయాడు...’ ఆవేదనగా  చెబుతున్నాడు కస్టడీ ఆఫీసర్.  కస్టడీలో నాకిది ఐదో రోజు. ఇంకో మూడు రోజుల్లో కస్టడీ ముగుస్తోందంటేనే బెంగగా ఉంది. నేను జైల్లో ఉన్నానా, జైలు బయట ఉన్నానా అని కాదు. సైప్రస్‌లో ఉన్నాను. నా భార్య ఉన్న దీవిలోనే నేనూ ఉన్నాను. అదీ నా సంతోషం. కానీ ఒకటే బాధ. కాపురాలు కూలడం కన్నా, ప్రభుత్వాలు కూలడం పెద్ద విషయం అయింది దేశాధినేతలకు!!
 - మాధవ్ శింగరాజు

Advertisement
Advertisement