సాహితీ గురుమిత్రుడు బుచ్చారెడ్డి | Vallapureddy Bucha Reddy is a great Story writer | Sakshi
Sakshi News home page

సాహితీ గురుమిత్రుడు బుచ్చారెడ్డి

Published Fri, Sep 8 2017 12:53 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

సాహితీ గురుమిత్రుడు బుచ్చారెడ్డి

సాహితీ గురుమిత్రుడు బుచ్చారెడ్డి

వల్లపురెడ్డి బుచ్చారెడ్డి ఈ ప్రపంచానికి ఒక సాహిత్యకారునిగా, ఒక విమర్శకుడుగా, పరిష్కర్తగా, కథా రచయితగా పరిచయమైనవాడు. మన దృక్కోణాన్ని బట్టి మనకు కనిపించేది ఒక్కోలా కనిపిస్తుంది. మన అనుభవం వల్ల దృక్కోణం స్థిరపడినప్పుడు, ఎదుటిది.. అంటే మనం చూసేది, అది ప్రకృతైనా, వస్తువైనా, మని షైనా స్థిరపడుతుంది.

నేను అతన్ని కలిసినప్పుడు నాకు ఒక కొత్త వెలుగులో దర్శనమిచ్చారు. ఆయనకూ నాకూ మధ్య 50 సంవత్సరాల వయో వ్యత్యాసం ఉంది. అయితే మా ఇద్దరి అస్తిత్వం భౌతిక పరిధిని దాటినది. సాహిత్యానికి, పాండిత్యానికంటే చాలా ఎత్తులో జీవించారు ఆయన. ఆయన నాకు ‘గురు మిత్రుడు’. మాది ఒక ‘లవ్‌ ఎఫైర్‌’.

ఒక అర్ధరాత్రి ఆయన నన్ను అడిగారు. ‘మన ఇద్దరి సంబంధాన్ని ఎలా వర్ణిస్తావ్‌’ అని. ‘మీరు నాకేమీ నేర్పించని గురువు– నేను ఏమీ నేర్చుకోని శిష్యున్ని’ అన్నాను. ఎంత అందంగా నవ్వారో. మా స్నేహానికి ఆధారం సాహిత్యం కాదు. ఒక సూక్ష్మ ఆధ్యాత్మిక అనుభవం. ఆయనవి ఉత్త మాటలు కావు. అవి ఆచరణలోంచి పలికినవి. ఆయన ఆచరిస్తూ చెప్పిన మాటలు చైతన్యపు నిప్పు కణికలు.

ఒకసారి ఇలా అన్నారు. ‘‘ఈ శరీరాన్ని నాతో ఈడ్చుకుపోతున్నా.. వచ్చిందా సరే... లేకపోతే నా దారిన నే పోతా’’ అన్నారు. మరోసారి ‘‘కవిత, సాహిత్యం, కథ.. ఎంత గొప్పదయినా పనికిరాదు.. ఆచరణలోంచి రాకపోతే’’ అన్నారు. అప్పుడు ఆయనో పరమహంస నా కళ్లకు. నా కళ్లు తన కళ్లని చూసాయి. ఆయన కళ్లు నన్ను చూసాయి. అనిర్వచణీయమైన ధార కన్నీళ్లై జలజలా రాలాయి. వాట్‌ ఏ వండర్‌ఫుల్‌ మ్యాన్‌.

ఆయనను ఈ మధ్య ఐసీయూలో చూసాను. శరీరం తన ప్రయాస తను పడుతోంది. కళ్లు ప్రశాంతంగా ఓ గమ్మల్తైన కాంతితో, తెల్లగా మల్లెపూలవలె మెరుస్తున్నాయి. ఆయన ఏ లోకంలో అయినా హాయిగా ఉండాలనీ, ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ  పలికే పనికిరాని మాటలు బుచ్చారెడ్డికి సరిపడవు. కనుక వాడను. ఆయన ఎక్కడ ఉన్నా పూర్ణ చైతన్యంతో నిలువగల ప్రశాంతమూర్తి. బుచ్చారెడ్డి, నాకు తెలిసిన బుచ్చారెడ్డి స్వయం ప్రేమ, చైతన్యం, కరుణ, అనిర్వచనీయమైన కఠినం. ఆయన నాకు ఇచ్చిందేదైనా ఉంటే నిష్కల్మషమైన కాంతి.

వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 1950–60లలో మొత్తం 52 కథలు రాశారు. ఈ కథలన్నీ భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి నాటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. లభ్యమైన తన 35 కథలను కలిపి ఒక కథా సంకలనం ప్రచురించారు. అలాగే గాలిబ్‌ తదితర ఉర్దూ కవుల కవితలను అనువదించి ‘మధుగీత’ పేరిట ప్రచురిం చారు. అలాగే కొన్ని తాళపత్ర గ్రంథాలను పరిష్కరిం చారు. ఈయన సినారె సమకాలికులు. మధుగీత పుస్తకానికి సినారె ముందుమాట కూడా రాశారు. బిరుదురాజు రామరాజు ఈయన గురువు, సన్నిహితులు. ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్‌గా, డిగ్రీకాలేజీ లెక్చరర్‌గా పనిచేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ తర్వాత ప్రముఖ సాహితీవేత్తగా వెలుగొందారు.
(జననం 07.10.1932 – మరణం 31.08.2017)
 

కాంత్‌ రీసా, రచయిత, చిత్రకారుడు,
మహబూబ్‌నగర్‌: మొబైల్‌: 91779 08556

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement