
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.
ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు.
అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్‌కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి.