Story writer
-
ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు. అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్‌కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి. (చదవండి: జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!) -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ రచయిత కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు. తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించారు. అలాగే ఆయన గీతా ఆర్ట్స్ మొదటి సినిమా బంట్రోతు భార్య సినిమాకు కూడా బాల మురుగనే కథ అందించారు. ఇక శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన సోగ్గాడు సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పి శివాజీ గణేషన్‌కు దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. అయ్యో పాపం అనకుండా ఉండలేరు..! -
Mannu Bhandari: రాలిన రజనీగంధ
స్వాతంత్య్రానంతరం వచ్చిన రచయితల తరంలో మన్నూ భండారీ(3 ఏప్రిల్ 1931 – 15 నవంబర్ 2021) ఒక అద్భుతమైన మహిళ. కథకురాలిగా, నవలా రచయిత్రిగా పురుషాధిక్య ప్రపంచంలో ఆమె తలెత్తుకు నిలబడ్డారు. అజ్మీర్(రాజస్థాన్)లో కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె స్వాతంత్య్రోద్యమపు బందులు, నిరసనలు, ఊరేగింపుల్లో పాల్గొన్నారు. వీధుల్లో అబ్బాయిలతో మార్చ్ చేస్తూ, స్లోగన్లు ఇస్తూ, రెచ్చగొట్టేలా ప్రసంగిస్తున్న ఆమె తీరును తండ్రి జీర్ణించుకోలేకపోయారు. కానీ నరాల్లో ఉద్యమావేశపు లావా ఉప్పొంగుతున్నప్పుడు ఆమెను ఎవరు ఆపగలరు? అదే కృతనిశ్చయాన్ని ఆమె తన సహ రచయిత రాజేంద్ర యాద వ్ను వివాహమాడటంలోనూ చూపారు. పై చదువులకు కోల్‌కతా వెళ్లినప్పుడు యాదవ్‌ను ఆమె కలిశారు. అదే కోల్‌కతాలో హిందీ టీచర్‌గా ఆమె కొన్నాళ్లు పనిచేశారు. చక్కటి చదువరి అయిన మన్ను తన మొదటి కథ ‘మై హార్ గయీ’(నేను ఓడిపోయాను) అలా రాసేశారు. 1957లో ‘కహానీ’ మ్యాగజైన్లో దానికి వచ్చిన స్పందన ఆమెను గాలిలో తేలి యాడించింది. ప్రతిగా మరిన్ని కథలు రాశారు. అన్నీ కూడా తను పెరిగిన అజ్మీర్‌లోని మనుషులను ఆధారం చేసుకొన్నవి. రాజేంద్ర యాదవ్ 1951 నాటికే ‘సారా ఆకాశ్’ రాసివున్నారు. హిందీ రచయితలకు సాహిత్య వాతావరణం మరింత అనుకూలంగా ఉంటుందని వాళ్లు 1964లో ఢిల్లీకి మారిపోయారు. ఢిల్లీ యూనివర్సిటీలో మన్నూకు లెక్చరర్‌గా ఉద్యోగం దొరికింది. ఇక తర్వాతి సంవత్సరాల్లో మిరుమిట్లు గొలిపే కీర్తిశిఖరాలను ఆమె అధిరోహించారు. కథలు రాస్తూనే, నవలలకు మారి, అటుపై సినిమా రచన ల్లోనూ మునిగిపోయారు. యాభైకి పైగా ఉన్న ఆమె కథలు ముఖ్యంగా చిన్న పట్ట ణాల్లోని మధ్య, దిగువ తరగతి జీవితాలను అరుదైన సున్నితత్వంతో చిత్రిస్తాయి. సామాజిక బంధనాల్లో చిక్కుకున్న, వాటిని దాటడానికి పోరాడిన, అలసిపోయిన మహిళలు కూడా ఆమె రచనల్లో కనబడతారు. 1950ల మధ్యలో మొదలైన నవ్య కథా ఉద్యమంలో మన్నూ భండారీ కూడా భాగం. ఆమె భర్త రాజేంద్ర యాదవ్‌తో పాటు మోహన్ రాకేశ్, కమలేశ్వర్ ప్రారంభించిన ఈ ఉద్యమం స్వాతంత్య్రానంతర తరం వారి ఆందోళనలు, అనుభవాలను ఎత్తి చూపడానికి లక్ష్యించినది. ముగ్గురు కూడా అసమాన ప్రతిభావంతులు, అదే సమయంలో ఎవరి అహాలు వారికి ఉండేవి. యాదవ్‌కూ మోహన్ రాకే శ్కూ చెడినప్పుడు కూడా మోహన్‌తో మన్నూ స్నేహం కొనసాగించింది. ‘నా సొంత అస్తిత్వం నాకు ఉండదా?’ అని రాకేశ్‌ను ప్రశ్నించారు మన్నూ. అయితే ముప్ఫై ఏళ్ల సహ జీవనం తర్వాత యాదవ్‌తో ఆమె వివాహ బంధం ముగిసింది. కానీ యాదవ్ ఇచ్చిన సహకారాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుంచు కున్నారు. ఇద్దరూ కలిసి ‘ఏక్ ఇంచ్ ముస్కాన్’(ఒక అంగుళం చిరునవ్వు) నవల కూడా రాశారు. అందులోని అమర్ పాత్ర భాగాలు యాదవ్ రాస్తే, అమల, రంజన కోణాల్లోవి మన్నూ రాశారు. 1970 నాటికి ఆమె నాలుగు కథాసంపుటాలు ప్రచురించారు. తల్లిదండ్రులు విడిపోదామని నిర్ణయించుకున్నప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు బంటీ మానసి కోద్వేగపు ప్రయాణపు కోణంలో ‘ఆప్కా బంటీ’ రాశారు. అప్పటికి మన్నూకు కూడా తొమ్మిదేళ్ల పాప రచన ఉండటం కాకతాళీయం కాదు. ఈ నవల ధారావాహికగా ప్రచురితం అవుతున్నప్పడు వస్తున్న ఉత్తరాలను చూసి పోస్ట్‌మాన్... ఈ ఇంట్లోనే ఒక ఆఫీస్ తెరవకూడదా అన్నాడట. నవల మీద విప రీతమైన చర్చలు జరిగాయి. అయితే పాఠకుల స్పందన అధికంగా బంటీ మీదే కేంద్రీకృతమై... తన లక్ష్యానికీ, మాతృత్వానికీ మధ్య నలిగిపోయిన ఆధునిక స్త్రీ మీదకు ఎక్కువ ప్రసరించకపోవడం పట్ల ఆమె కొంత నొచ్చుకున్నారు కూడా. 1974లో బాసూ ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘రజనీగంధ’ ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆమె కథ ‘యేహీ హై సచ్’(ఇదే నిజం) ఆధారంగా తీసిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. అప్పటికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బాసూ ఛటర్జీ కోసం శరత్ కథ ‘స్వామి’ని తిరగరాశారు. సినిమా బాగా ఆడినప్పటికీ, క్లైమా క్స్‌లో భర్త కాళ్ల మీద భార్య పడే సీన్ పట్ల ఆమె పూర్తిగా విభేదించారు. భార్యను తన చేతుల్లోకి భర్త తీసుకోవడం ద్వారా కూడా అదే ఫలితం రాబట్టవచ్చని ఆమె వాదన. బాసూ ఛటర్జీ దూరదర్శన్ కోసం తీసిన ‘రజని’ సీరియల్ కోసం కూడా మన్నూ పని చేశారు. ఇది కూడా సంచలనం సృష్టించింది. బిహార్‌లోని బెల్చి గ్రామంలో జరిగిన దళితుల ఊచకోత ఘటనకు కదలిపోయి 1979లో పూర్తిస్థాయి రాజకీయ నవల ‘మహాభోజ్’ రాశారు. ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున అమల్ అల్లానా దర్శకత్వంలో నాటకంగా వచ్చి అరు దైన సమీక్షలు పొందింది. ఎన్ఎస్డీకి అది స్వర్ణయుగం. మనోహర్ సింగ్, సురేఖా సిక్రీ, ఉత్తర బావోకర్, రఘువీర్ యాదవ్ లాంటివాళ్లు అందులో ఉండి, నాటకంలో పాత్రధారుల య్యారు. ఇంతటి విజయాలు చూసిన తర్వాత ఎవరిలోనైనా అహం పొడసూపడం సహజం. కానీ మన్నూలో లేశమాత్రం కూడా అది కనబడేది కాదు. అన్ని స్థాయుల వాళ్లతోనూ ఆమె తన జీవితాంతం స్నేహం చేశారు. చివరి దశలో అనారోగ్యం ఆమెను తినేసింది. నవంబర్ 15వ తేదీన ఆమె మరణించారు. కానీ చెరిగి పోని ఆమె వారసత్వం మనకు మిగిలివుంది. – పూనమ్ సక్సేనా పాత్రికేయురాలు, అనువాదకురాలు -
ఇండస్ట్రీలోకి దిల్‌రాజు సతీమణి..!
కరోనా వైరస్ విజృంభణతో చిత్ర పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. తొమ్మిది నెలల విరామం అనంతరం ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నా.. ప్రేక్షకుడు మాత్రం ఆ వైపుకు కన్నెత్తికూడా చూడటంలేదు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ భయం దర్శక, నిర్మాతలను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో నిర్మించబోయే సినిమాలను ఓటీటీని వేదికగా చేసుకుని విడుదల చేయాలనే ఆలోచనలో పడ్డారు. దీనికి అనుగుణంగానే కథలను సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ.. ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారు. (కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా) ఈ క్రమంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు సైతం ఓటీటీకి తగ్గకథల కోసం వెతుకులాట ఆరంభించారు. అయితే భర్త కోసం తన సతీమణి తేజస్వీని స్వయంగా ఓ కథను సిద్ధం చేశారని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఆమె కొత్త కథలపై దృష్టిసారించారని, ఓటీటీకి అనుగుణంగా సృజనాత్మకతతో కూడిన ఓ కథను భర్తకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. భార్య స్టోరీకి ఫిదా అయిన దిల్‌రాజు.. ఆ కథకు మరింత మెరుగులు దిద్దేందుకు ఆమెకు సహాయంగా ఓ రచనా బృందాన్ని ఏర్పాటు చేశాడని తెలిసింది. (దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!) ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యంలో భార్య రూపొందించిన కథాంశాన్ని తెరక్కించాలని నిర్ణయించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఎఫ్3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు. కాగా దిల్’రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని గత మార్చిలో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. -
అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత అనిశెట్టి
అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు. 1922 అక్టోబర్ 23న నరసరావుపేటలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోట్లింగం. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఉన్నత పాఠశాలలో కుందుర్తి ఆంజనేయులు, రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవీ ప్రసాదులు ఆయన ççసహాధ్యాయులు. అనిశెట్టి 1941లో గుంటూరు ఏసీ కళాశాల నుండి బీఏ పట్టభద్రుడయ్యాడు. జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్టిండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్టయ్యాడు. సన్నిహిత మిత్రులైన ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండ రాందాసులు శ్లిష్టా, శ్రీశ్రీ, నారాయణబాబుల ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్లారు. నరసరావుపేట కేంద్రంగా 1942లో ఏర్పడిన నవ్యకళాపరిషత్కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. అనిశెట్టి మద్రాసులో లా చదివే రోజుల్లో బెంగాలీ విప్లవకారుడు రతన్‌కుమార్ ఛటర్జీకి అశ్రయమిచ్చాడు. ఆయన విప్లవ కరపత్రాలు బయటపడి పోలీసులు అనిశెట్టిని అరెస్టుచేసి రాయవెల్లూరు జైలుకు పంపిం చారు. ప్రభుత్వ అధికారులు జైలు శిక్ష తగ్గిస్తామని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రలోభపెట్టినా రాజీ పడలేదు. అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి, ఆరుద్రలు‘అఆ’లని శ్రీశ్రీ ప్రశంసించాడు. అనిశెట్టి 1943లో తెనాలిలో తాపీ ధర్మారావు అధ్యక్షతన ఆరంభమైన అరసం తొలి మహాసభల నుండి 1947లో పి.వి. రాజమన్నార్ గారి అధ్యక్షతన జరి గిన నాలుగో మహాసభల వరకు కార్యవర్గ సభ్యులుగా చురుగ్గా పాల్గొన్నాడు. 1950లో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించటంతో అభ్యుదయ రచయితలైన శ్రీశ్రీ, అనిశెట్టి, ఆరుద్ర వంటి వారు సినీరంగానికి వెళ్లారు. 1941 నుండి 1947 వరకు భారతి, కృష్ణాపత్రిక, తెలుగుతల్లి, అభ్యుదయ వంటి పత్రికల్లో ప్రచురించిన తన కవితలను అనిశెట్టి ‘అగ్నివీణ’ కవితా సంపుటిగా ప్రచురిం చాడు. అభ్యుదయ కవితా ఉద్యమంలో కె.వి. రమణారెడ్డి భవనఘోష, రెంటాల సర్పయాగం, గంగి నేని ఉదయిని కవితా సంపుటాలు ప్రసిద్ధాలు. అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950లో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్ మనో విశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలా మంది రచయితలు అనుసరించారు. ఆంగ్ల సాహిత్యాన్ని ఔపోశనపట్టిన అని శెట్టి 1951లో తొలిసారిగా తెలుగులో (ఫాంటోమైమ్) శాంతి ముకాభినయాన్ని రాశాడు. శాంతి కాముకతో అనిశెట్టి రాసిన ఈ మూకాభినయం 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్ర«థమ బహుమతి బంగారుపతకాన్ని పొందింది. తమిళం, మలయాళం, కన్నడ వంటి అనేక ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లిష్, రష్యా, చైనా వంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడి అనిశెట్టికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. సినీ రచయితగా 1952 నుండి 1979 వరకు సంతానం, రక్త సంబంధం వంటి 50 సినిమాలకు మంచి పాటలు రాసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. వంద సినిమాలకు సంభాషణలు రాశాడు. దాదాపు 300 తమిళ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందాడు. ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడుగా విలక్షణమైన శీర్షికలు నిర్వహించాడు. 1979 డిసెంబర్లో మరణించిన అనిశెట్టి సుబ్బారావు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడుగా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు. (నేడు అనిశెట్టి సుబ్బారావు 98వ జయంతి) డాక్టర్ పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు, అనిశెట్టి సాహిత్య పరిశోధకులు ‘ 98491 77594 -
బాల్యంలో కథలు రాయడం గొప్ప అనుభూతి
ప్రొద్దుటూరు : బాల్యంలో విద్యార్థులు కథలు రాయడం గొప్ప అనుభూతినిస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డీకే చదువుల బాబు సంపాదకత్వంలో 20 మంది విద్యార్థులు రాసిన ‘‘కొత్తపేట కలాలు’’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి వయసులోనే పుస్తకాలను రాయాలనే ఆలోచన రావడం అరుదైన విషయమన్నారు. విద్యార్థులను ఈ వైపుగా ప్రోత్సహించిన చదువుల బాబును అభినందించారు. గురువులేని విద్య ప్రకాశించదని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలని పేర్కొన్నారు. కథలు రాయడం వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. కథల్లో స్నేహం, సహకార గుణం, సేవాతత్వం, తల్లిదండ్రుల ప్రేమ, పరోపకారం తదితర అంశాలు కనిపించాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శతావధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ రాచమల్లు శివప్రసాదరెడ్డిలా మాట్లాడే శాసనసభ్యులు రాష్ట్రంలోనే అరుదుగా ఉన్నారని చెప్పారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, భైరవ కొండారెడ్డి గొప్ప కవులు అని తెలిపారు. ఆయన వంశంలో కవులు ఉన్న కారణంగానే ఆయనకు వాక్చాతుర్యం అలవడిందన్నారు. ఆయన భాష, భావం చక్కగా ఉంటాయని పేర్కొన్నారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాఠశాల వయసులోనే సమాజంపై అవగాహన పెంచుకుని కథలు రాసిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయభారతి, ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి, చదువులబాబు, హిమజాత, దేవదత్తు, పద్మావతి, రమాదేవి, కృష్ణ మాధవీలత, రామానాయుడు పాల్గొన్నారు. -
ఛాలెంజ్
ఈ కథను మనం కథకుడి నోటి నుంచి వింటాం. అతడు సైన్యంలో పనిచేస్తుంటాడు. వాళ్లు ‘ఎన్...’ అనే చిన్న పట్టణంలో ఉన్నారప్పుడు. ఆర్మీ అంటే డ్రిల్లు, డిన్నరు, పేక; ఇదే జీవితం. యూనిఫారాలు తప్ప మరొకటి కనబడవు. సైనికులు తమ బృందంతో కలవనిచ్చే వేరే వ్యక్తి ఒక్కడే. ఆయన వయసు ముప్పై ఐదు ఉండొచ్చు. ఈ కుర్రాళ్ల మధ్య అతడు పెద్దమనిషి కిందే లెక్క. అతడు ఎక్కువ మాట్లాడడు. మాట్లాడినా కోసినట్టుగా ఉంటుంది మాట. చూడ్డానికి రష్యన్‌లా కనబడినా పేరు విదేశీలా ధ్వనిస్తుంది. కుర్రాళ్లందరికీ సిల్వియో అంటే ఒక ఇది ఉంటుంది. అతడు అంతకుముందు అశ్వికదళంలో పనిచేశాడు. మరి ఎందుకు అందులోంచి రిటైర్ అయ్యాడో, ఎందుకు ఈ పాడుబడిన ఊళ్లో ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. సిల్వియో సైనికుల గుంపుతో కలిసి షాంపేన్ తాగుతాడు. వాళ్లు అడిగితే తన దగ్గరున్న పుస్తకాలు ఇస్తాడు. అవి ఎక్కువగా సైన్యం గురించినవే అయివుంటాయి. సిల్వియోకు ఎక్కువ వినోదకరమైంది మాత్రం షూటింగ్. బుల్లెట్లు తగిలి అతడి ఇంటి గోడలు తేనెపట్టు రంధ్రాలైనాయి. సిల్వియో గురి ఎంత గొప్పదంటే, నీ టోపీ మీదున్న పండును కొడతానని గనక అతడంటే, దాన్ని నెత్తిన పెట్టుకోవడానికి ఏ ఒక్క సైనికుడు కూడా జంకడు. సైనికుల సంభాషణ తరచూ ద్వంద్వయుద్ధాల మీదకు మళ్లేది. ఆ రోజుల్లో ఇద్దరు మనుషుల మధ్య తేడా వచ్చిందంటే ద్వంద్వయుద్ధానికి సవాల్ విసరడం మామూలే. కానీ వాటిలో సిల్వియో జోక్యం చేసుకునేవాడు కాదు. బదులిచ్చినా పొడిగానే. అయినా సిల్వియో పిరికివాడై ఉంటాడన్న ఆలోచన కూడా ఎవరి తలలోకి దూరేది కాదు. కానీ ఒక సంఘటన కథకుడిని విస్తుపోయేలా చేసింది. ఒకరోజు ఓ పదిమంది సిల్వియోతో విందు చేసుకున్నారు. అనంతరం సైనికులు అడిగిన మీదట బలవంతంగా పేక ఆడటానికి ఒప్పుకున్నాడు సిల్వియో. అయితే, స్కోర్ దగ్గర చిన్న తేడా జరిగింది. ఎక్కువ మాట్లాడని సిల్వియో దాన్ని చాక్‌పీస్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిలోనే మాటలు పెరిగాయి. కొత్తగా ఆ రెజిమెంటుకు వచ్చిన కుర్ర లెఫ్ట్‌నెంట్ కోపంగా సిల్వియో మీదకు టేబుల్ మీదున్న ఇత్తడి దీపపు సెమ్మె విసిరేశాడు. జరిగినదానికి మిగతా సైనికులు భీతిల్లారు. వీడింక చచ్చాడే అనుకున్నారు. అయినా కాసేపు ఆట మౌనంగా కొనసాగింది. సిల్వియోకు ఆసక్తి పోయిందని గ్రహించి ఒక్కొక్కరూ బయటికి నడిచారు. తెల్లారి గుర్రపు స్వారీల దగ్గర ఆ లెఫ్ట్‌నెంట్ ఇంకా బతికేవున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సిల్వియో ద్వంద్వయుద్ధానికి సవాల్ విసరలేదా? ఇది కుర్రాళ్ల దృష్టిలో సిల్వియోను పలుచన చేసింది. మనిషి గుణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైందని యువకులు తలిచే ధైర్యం లేకపోవడాన్ని వాళ్లు క్షమించలేరు. అందరికన్నా సిల్వియోతో ఎక్కువ దగ్గరితనం ఉన్న కథకుడు కూడా సిల్వియో కళ్లలోకి చూడటానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని చదవగానే సిల్వియో కళ్లు మెరిశాయి. తను ఇక నిష్క్రమించాల్సిన తరుణం వచ్చిందనీ, వెళ్లేలోగా చివరిసారి రాత్రికి తనతో భోజనం చేయమనీ కుర్రాళ్లను ఆహ్వానించాడు. ప్రత్యేకించి కథకుడికి మరీ మరీ చెప్పాడు. విందు బాగా జరిగింది. అందరూ సిల్వియోకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కథకుడు కూడా బయలుదేరుతుండగా చేయి పట్టి ఆపాడు సిల్వియో. ఇద్దరూ మౌనంగా కాసేపు పైపులు కాల్చారు. ‘ఇంక మనం మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు. వెళ్లేముందు నేను నీకో వివరణ ఇవ్వాల్సివుంది’ అన్నాడు సిల్వియో. ‘నా మీద ఉన్న చెడు తలంపును దూరం చేయకపోతే అది నన్ను జీవితకాలం వెంటాడుతుంది’ అని చెప్పి, ఆ రోజు ఆ తాగుబోతు ‘ఆర్...’ను వదిలేయడానికి తన ఔదార్యం మాత్రమే కారణం కాదనీ, వాడిని పిస్టల్‌తో కాల్చడంలో తనకో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ఆయుధాల ఆటలో తన జీవితం కూడా ప్రమాదంలో పడే వీలుందనీ చెప్పాడు సిల్వియో. ఈ వివరణ కథకుడిని మరింత స్తంభించేలా చేసింది. మృత్యువు అంచుకు వెళ్లే హక్కు తనకు లేదంటాడు సిల్వియో. దానిక్కారణం ఆరేళ్లుగా అతడు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఒక ప్రతీకారం. తనను దెబ్బ కొట్టిన శత్రువు ఇంకా బతికేవున్నాడు. ఆ గతానికి గుర్తుగా పెట్టెలోంచి తీసి బుల్లెట్ దిగిన ఒక టోపీని చూపించాడు. సిల్వియో అశ్వికదళంలో పనిచేసే రోజుల్లో అసాధారణ వీరుడిగా పేరొచ్చింది. ద్వంద్వయుద్ధాల్లో అతడికి సాటి లేరు. అలాంటి రోజుల్లో వాళ్ల రెజిమెంటుకు కొత్త ఆఫీసర్ వస్తాడు. అతడు ధనవంతుడు, అందగాడు, దేన్నీ లెక్కచేయని ధైర్యవంతుడు, మాటకు మాటను తెలివిగా విసురుతాడు. తనను సవాల్ చేసేవాడే లేడనుకున్న తరుణంలో వచ్చిన ఈ కొత్త ఆఫీసర్ సిల్వియోలో ఈర్ష్య పుట్టిస్తాడు. చివరికి ఒకరోజు ఒక విందునాట్యంలో అతడిని పరుషమైన మాటంటాడు సిల్వియో. బదులుగా అతడు సిల్వియో ముఖం మీద కొడతాడు. ఇద్దరూ కత్తులు దూసుకుంటారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ రాత్రే వాళ్లు ద్వంద్వయుద్ధానికి సవాల్ విసురుకుంటారు. తెల్లవారుతుంది. నిర్దేశిత స్థలంలో సిల్వియో అసహనంగా ఎదురుచూస్తుంటాడు. వెంబడి ముగ్గురు సహాయకులుంటారు. కొత్త ఆఫీసర్ తాపీగా నడుచుకుంటూ వస్తాడు. తన క్యాపులో చెర్రీపళ్లు ఉంటాయి. వెంట ఒక్కడే సహాయకుడు. సహాయకులు ఇద్దరి మధ్యా పన్నెండు అంగల దూరం కొలుస్తారు. ముందు ఎవరు కాల్చాలి? సిల్వియో చేయి వణుకుతుంది. తనకు తాను ఆ నిశ్చలత ఇచ్చుకోవడానికి వీలుగా ఆఫీసర్‌కు మొదటి షాట్ ఆఫర్ ఇవ్వబోతాడు సిల్వియో. కానీ సహాయకులు వారించి పాచిక వేస్తారు. ఆఫీసర్ చెప్పిన అంకె పడుతుంది. అతడు గురిపెట్టి మొదటి షాట్ కాలుస్తాడు. సరిగ్గా సిల్వియో నుదురు పైన అంగుళం దూరం నుంచి క్యాపుగుండా వెళ్తుంది బుల్లెట్. ఇప్పుడు సిల్వియో వంతు. గురి చూసి కొట్టడంలో మొనగాడైన సిల్వియో చేతుల్లో ఆఫీసర్ ప్రాణం ఉంది. సిల్వియో పిస్టల్ గురి పెడతాడు. అతడిలో ఏమైనా భయం జాడ ఉన్నదా? ఊహు. తాపీగా టోపీలోంచి విరగబండిన చెర్రీపళ్లను తీసుకు తింటూ, వాటి గింజలు నోట్లోంచి దూరంగా సిల్వియో కాళ్ల దగ్గర వచ్చి పడేలా ఊస్తూ నిలబడతాడు. ఇది సిల్వియోను కలవరపరుస్తుంది. ఎవడైనా భయపడితే వాడి బతుకును లాక్కోవచ్చు. ఇట్లాంటివాడిని చంపితే ఎంత, చంపకపోతే ఎంత? పిస్టల్ దించి, నువ్వింకా చావడానికి సిద్ధంగా లేనట్టున్నావు, నీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, నేను అడ్డురానంటాడు సిల్వియో. అడ్డు వస్తున్నావని ఎవరన్నారు? కాల్చుకో, షాట్ నీది, నేను ఎప్పుడైనా సిద్ధం అంటాడు అతను. సహాయకులతో తన షాట్‌ను ఈ రోజు తీసుకోనని సిల్వియో చెప్పడంతో ఆ ద్వంద్వయుద్ధం ఆగిపోతుంది. తర్వాత సిల్వియో ఈ ఊరికి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డాడు. తన ప్రతీకారం గురించి అతడు ఆలోచించని రోజంటూ లేదు. అనుకోకుండా సిల్వియో ఏజెంట్ మాస్కో నుంచి రాసిన ఆ ఉత్తరంలో ‘ఒకానొక వ్యక్తి’ ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని రాశాడు. ఈ కథంతా సిల్వియో కథకుడికి చెప్పి, ఆ ఒకానొక వ్యక్తి ఎవరో నీకు అర్థమైందనుకుంటాను, అని అడుగుతాడు. ఆ రోజు మృత్యువు ముఖంలోకి చెర్రీపళ్లు తింటూ చూసినట్టుగానే ఈ వివాహ వేడుక సందర్భంగా కూడా చూస్తాడా? సిల్వియో తన సామగ్రి సిద్ధం చేసుకుని, బోనులోంచి బయటపడిన పులిలా ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అతడి కోసం గుర్రాల బండి సిద్ధంగా ఉంది. చాలా ఏళ్లు గడిచాయి. కుటుంబ పరిస్థితులు మన కథకుడిని ‘ఎమ్...’ అనే ఊళ్లో స్థిరపడేలా చేశాయి. ఊళ్లో ప్రత్యేకించి ఏమీ జరగదు. ఒక్క విశేషం ఉంటే దాని గురించి రెండు నెలలు చెప్పుకుంటారు గ్రామస్థులు. కథకుడి ఇంటికి నాలుగు వర్స్ దూరం(1 వర్స్ = 1.1 కిలోమీటర్)లో దొరసాని బి... ఎస్టేట్ ఉంది. అది ఎ... అనే గ్రామం కిందికి వస్తుంది. ఎస్టేట్‌లో పర్యవేక్షకుడు తప్ప ఎవరూ ఉండరు. ఆమెకు పెళ్లయిన తొలి ఏడాది ఓసారి ఇక్కడికి వచ్చి వెళ్లిందట. మళ్లీ ఆమె భర్తతో సహా ఎస్టేట్‌కు వస్తున్నారని తెలిసి కథకుడు ఉత్సాహపడతాడు. ఊళ్లల్లో జరగ్గలిగే విశేషాలు అంతకంటే ఏముంటాయి? జమీందారు, అతడి భార్య వచ్చారని తెలిశాక వచ్చిన మొదటి ఆదివారం కథకుడు తన వందనాలు తెలియజేయడానికి వెళ్లాడు. భవంతి అత్యంత విలాసవంతంగా ఉంది. పుస్తకాలు, కంచు ప్రతిమలు, తివాచీలు, పెద్ద అద్దం... ఒక పనివాడు ఈయన వచ్చినట్టు చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ఇంత సంపద ఎప్పుడూ చూసివుండని కథకుడిలో కొంత వణుకు పుట్టిన మాట నిజం. కానీ అందమైన ముప్పై రెండేళ్ల వరకు వయసుండే జమీందారు వచ్చీరావడంతోనే స్నేహంగా పలకరించాడు. ఈ లోపల దొరసాని కూడా వచ్చింది. ఆమె ఇంకా అందగత్తె. కథకుడి బిడియం పోయేలా ఇద్దరూ మామూలుగా మాట్లాడసాగారు. ఆ గదిలో ఉన్న ఒక పెయింటింగ్, అది స్విట్జర్లాండ్‌లోని ఒక దృశ్యం, కథకుడిని ఆకర్షించింది. దానిమీద సరిగ్గా ఒక దానిమీద ఒకటి తగిలిన రెండు బుల్లెట్ గుర్తులున్నాయి. మంచి షాట్’ అన్నాడు కథకుడు. ‘అవును, అసాధారణమైన షాట్’ అని బదులిచ్చాడు జమీందారు. అట్లా మాటల్లో ముప్పై అంగల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చగలనని చెప్పాడు కథకుడు. నువ్వు కూడా అలా కాల్చగలవా డియర్, అని అడిగింది దొరసాని. ఏదో ఒక రోజు నేనూ కాల్చగలనన్నాడు జమీందారు. నాకు తెలిసిన ఒకతను ఉండేవాడు, గోడ మీద ఈగ కనబడితే పిస్టల్ తెమ్మని కేకేసేవాడు, ఢాం, అదీ అతడి గురి అని చెప్పాడు కథకుడు. ఎవరాయన? అడిగాడు జమీందారు. ‘సిల్వియో అని...’ ‘సిల్వియో!’ అరిచినంత పనిచేశాడు జమీందారు. దీంతో ఆ పాత కథంతా తవ్వుకోవాల్సి వస్తుంది. జమీందారుకు పెళ్లయి నెలే అయిందప్పుడు. ఆరోజు కొత్త దంపతులు గుర్రపు స్వారీకి వెళ్లారు. దొరసాని గుర్రం ఆ రోజు మాట వినకపోతే ఆమె దిగి నడుచుకుంటూ వస్తానంది. జమీందారు ముందు ఇల్లు చేరాడు. వచ్చేసరికి సిల్వియో ఉన్నాడు. అతణ్ని చూడగానే జమీందారు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాకీ తీర్చమని అడిగాడు సిల్వియో. జమీందారు సిద్ధమయ్యాడు. భార్య వచ్చేలోగా కాల్చమని కోరాడు. మళ్లీ సిల్వియో సందేహపడ్డాడు. ఇలా కాల్చడం మర్డర్ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మళ్లీ చీటీలు వేశారు. ఈసారీ జమీందారుకే తొలి ఛాన్స్ వచ్చింది. మహాచెడ్డ అదృష్టవంతుడు. జమీందారు కాల్చిన షాట్ మిస్ అయి ఆ పెయింటింగుకు తగిలింది. ఇప్పుడు కాల్చడం సిల్వియో వంతు. పిస్టల్ గురి పెట్టాడు. అప్పుడే దొరసాని ఆ గదిలోకి వచ్చింది. కాల్చవద్దని సిల్వియో కాళ్లదగ్గర పడింది. ‘మాషా, ఇది నీకు సిగ్గుగా లేదూ!’ అని జమీందారు వారించాడు. అదిగో, అప్పుడు సిల్వియో వదిలేసి వెళ్లాడు. వెళ్తూ, గురి కూడా చూడకుండా జమీందారు కాల్చిన పెయింటింగును అదే స్థానంలో కాల్చాడు. తనకు అంతకుముందు తెలిసినదానికి జమీందారు చెప్పినదానితో కలిపి కథకుడు కథ పూర్తి చేస్తాడు. తర్వాత చాలా ఏళ్లకు అలెగ్జాండర్ ఇప్సిలాంటి నేతృత్వంలోని తిరుగుబాటులో సిల్వియో పాల్గొని స్కౌలానా యుద్ధంలో మరణించినట్టు కథకుడికి తెలుస్తుంది. అలెగ్జాండర్ పుష్కిన్ 1831లో రాసిన ‘ద షాట్’ కథాసారం ఇది. రష్యన్ ఆధునిక సాహిత్యానికి పుష్కిన్ మార్గదర్శి అంటారు. -
ఒక పెళ్లికూతురి లావుపాటి కథ
పాతికేళ్ళ మధురిమ (మధు) పాండే బరువు 93 కిలోలు. గురుగావ్ మధ్యతరగతి కుటుంబం. ఉద్యోగం చేస్తుంటుంది. తెలివైన, ఆధునిక యువతే కానీ తన స్థూలకాయం వల్ల ఆత్మగౌరవం తక్కువ. ఇతరుల పట్ల ఈర్ష్య పడదు. ‘పెళ్ళీడుకొచ్చింది. ఇంకా పెళ్ళవలేదా?’ లాంటి ప్రశ్నలు తప్పించుకోవడానికి ఎమ్బీయే చేయడం ప్రారంభిస్తుంది. కిట్టీ పార్టీలకెళ్తుండే అమ్మమ్మ, ‘అందం అణుకువ ఉన్న చదువుకున్న పిల్ల, తెల్లటి రంగు, పెద్ద కళ్ళు, పొడుగు జుట్టు, ఆరోగ్యవంతమైన ఫిగర్’ అని శుభ్షాదీ డాట్‌కామ్‌లో తన వివరాలు పెట్టినప్పుడు, కుదిర్చే వివాహాలంటే నమ్మకం లేనప్పటికీ మతంటూ ఉన్న ఏ యువకుడూ తనంత లావున్న అమ్మాయిని ఇష్టపడడని అనుకుని అభ్యంతరం చెప్పదు. మొదటి పెళ్ళి చూపుల సమయంలో టమ్మీ టకర్ వేసుకున్న మధురిమని మగపెళ్ళివారు నిరాకరించినప్పుడు, అమ్మమ్మ ఓదారుస్తుంది: ‘మధుకి ఇంకా మంచివాడెవడో రాసి పెట్టుంటాడు. ఇతను మరీ ఆడంగిలా ఉన్నాడు. వాళ్ళమ్మ బ్లౌజ్ చూశావా? గురుగావ్‌లో సగంమంది వేసుకునేది ఆ డిజైనే’. ఇలాంటి హాస్యభరితమైన సంఘటనలున్న ‘ఎన్కౌంటర్స్ ఆఫ్ ఎ ఫ్యాట్ బ్రైడ్’ నవలలో– కాబోయే పెళ్ళికొడుకులూ, వారి కుటుంబాలూ మధుని చూడ్డానికి రావడం, అమ్మాయి నచ్చలేదని చెప్పడం పరిపాటిగా మారుతుంది. ఒకసారి హరీష్ అనే యువకుడితో కేఫెటీరియాలో మీటింగ్ ఏర్పరిచినప్పుడు అమ్మమ్మ హెచ్చరించి పంపిస్తుంది: ‘అక్కడికి వెళ్ళి ఎప్పట్లాగే సివంగిలా నవ్వకు’. కేఫేలో హరీశ్ ముక్తసరిగా మాట్లాడుతూ, గంటలోపలే పెళ్ళికి వొప్పేసుకున్నప్పుడు, ‘ఏ లోపాలూ ఉన్నట్టు కనిపించని వ్యక్తి నన్నెలా అంగీకరించాడు? నపుంసకుడో, సమలైంగికుడో కాడు కదా!’ అన్న సందేహాలు మధుని చుట్టుముడతాయి. అయినప్పటికీ కాబోయే పెళ్ళికూతురిగా– షాపింగుకూ, బ్యూటీ పార్లర్లకూ వెళ్తూ అప్పుడప్పుడూ హరీశ్‌ను కలుసుకుంటూ ఉంటుంది. అయితే, అతను మాత్రం మధుపైన ఆసక్తి కానీ, ప్రేమ కానీ చూపకపోగా ఆమెకి దగ్గరవడానికి కూడా ప్రయత్నించడు. హడావిడిగా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ తరువాత అతని తల్లిదండ్రులు కట్నంలో కారు అడగ్గానే, ఆ సంబంధాన్ని కాదంటుంది మధు. ఎమ్బీయే పూర్తి చేసి సంవత్సరం గడిచిన తరువాత వొక రోజు, హరీశ్‌ను సైకియాట్రిస్ట్ ఆఫీసులో చూస్తుంది. అతనికి ఆడవాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోయే అరుదైన సమస్య ఉందని తెలిసి– ఇద్దరి కుటుంబాలకీ అయిష్టం అయినప్పటికీ, అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. సమా విసారియా రాసిన ఈ నవల– సమాజంలో ఉండే వరకట్నం, మూఢాచారాలు, ఇరుగుపొరుగు జోక్యం, బాడీ షేమింగ్ అంశాలను సముచితంగా ప్రతిబింబిస్తుంది. ఊబకాయపు అమ్మాయిలకు వరుడు దొరకడం కష్టం అవడాన్ని, స్నేహితుల/ చుట్టాల నుంచి ఎదుర్కునే పెళ్ళి చేసుకోమన్న ఒత్తిడిని హాస్యంగా, నిజాయితీగా వర్ణిస్తారు రచయిత్రి. నవల ఏదీ ఉపదేశించదు. ‘అందం’ గురించి మన సమాజంలో ఉన్న అభిప్రాయపు చేదు నిజాన్ని చెప్తుంది. భౌతిక సౌందర్యం పట్ల ఇంత పట్టింపున్న సమాజం మానసిక అనారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్య పెడుతుందని ప్రశ్నిస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళ పునాది బలహీనమైనదని చెబుతుంది. మధు వ్యంగ్య ధోరణి, అభిప్రాయాలు కథకు సారాన్ని జోడిస్తాయి. సరళంగా, సాఫీగా సాగే పుస్తకంలో అనవసరమయిన పాత్రలేవీ ఉండవు. ఉన్న కొద్ది పాత్రలూ పాఠకులకు పరిచితమైనవన్నంత వాస్తవికంగా అనిపిస్తాయి. పెంగ్విన్ మెట్రో రీడ్స్ 2017లో ప్రచురించిన ఈ నవల మధ్యలో కొన్ని హిందీ పదాల వాడకం కనిపిస్తుంది. - కృష్ణ వేణి -
ఆలిస్ మన్రో
ఆధునిక చెహోవ్ అనిపించుకున్న రచయిత్రి ఆలిస్ మన్రో. 1931లో కెనడాలో జన్మించారు. అసలు పేరు ఆలిస్ యాన్ లెయిడ్‌లా. వాళ్ల నాన్న నక్కలను పెంచేవాడు. వాటి తోలుకు అప్పట్లో మంచి గిరాకీ ఉండేది. డిమాండ్ పడిపోయాక, కుటుంబం టర్కీ కోళ్ల వైపు మళ్లింది. ఈ వాతావరణం ఆలిస్ కథల్లో కనిపిస్తుంది. ఆలిస్ కూడా వెయిట్రెస్గానూ, పొగాకు తోటల్లోనూ, గ్రంథాలయ గుమస్తాగానూ పనిచేసింది. యూనివర్సిటీ సహవిద్యార్థి జేమ్స్ మన్రోను పెళ్లి చేసుకుని, ఆలిస్ మన్రో అయిన తర్వాత దంపతులిద్దరూ ‘మన్రోస్ బుక్స్’ పేరిట బుక్ స్టోర్ తెరిచారు. తర్వాతి కాలంలో అది ప్రతిష్టాకరమైన పుస్తకాలయంగా పేరు తెచ్చుకుంది. కొత్తలో అందులోని పుస్తకాలు కొన్ని చదివి, తాను ఇంతకంటే బాగా రాయగలనని రాయడం ప్రారంభించానని వ్యాఖ్యానించారు. కానీ ఆమె టీనేజ్లోనే రాయడం మొదలైంది. 1968లో ఆమె తొలి కథా సంపుటి వెలువడినప్పుడు సానుకూల స్పందన వచ్చింది. కథకు కొత్త నిర్మాణపద్ధతిని ఇచ్చిన మన్రో విస్తృతంగా రాస్తూ, సుమారు నాలుగేళ్లకో కథా సంపుటి వెలువరిస్తూ వచ్చారు. మానవ సంక్లిష్టతను అత్యంత సరళంగా ఆవిష్కరించే తీరు విమర్శకుల మెప్పు పొందింది. ఆమె కొన్ని కథలు సినిమాలుగా కూడా తీశారు. 2013లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. పాత కథకే కొత్త వెర్షన్ రాయడం ఆలిస్ ప్రత్యేకతల్లో ఒకటి. -
బాలల కథా రచయిత జగదీశ్వర్ ఆత్మహత్య
చిట్యాల/రామన్నపేట: నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల కథా రచయిత, కార్టూనిస్ట్, ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ (45) మంగళ వారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివా రులోని శ్రీ బాలనర్సింహస్వామి ఆలయం సమీపంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రచించిన పలు బాలల కథలు ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్డే బుక్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘చెట్టు కోసం’ అనే కథ మొదటగా సాక్షిలోనే ప్రచురితమైంది. ఆ కథను మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. -
రచయిత మునిపల్లె రాజు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలుగు కథను సుసంపన్నం చేసిన ప్రఖ్యాత కథకుడు, రచయిత మునిపల్లె రాజు ఇకలేరు. ఏఎస్రావు నగర్‌లోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె ఆయన స్వగ్రామం. తండ్రి హనుమంతరావు తల్లి శారదమ్మ. చిన్నప్పటినుంచి కథా సాహిత్యంపై మక్కువ పెంచుకున్న మునిపల్లె రాజు 1943 నుండి 1983 వరకు భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగ్ సర్వీసులో సర్వేయర్‌గా ఉద్యోగం చేశారు. అస్తిత్వనదం ఆవలి తీరాన, దివోస్వప్నాలతో ముఖాముఖి, పుష్పాలు - ప్రేమికులు - పశువులు, మునిపల్లె రాజు కథలు తదితర కథా సంకనాలు వెలువరించారు. అలసిపోయినవాడి అరణ్యకాలు, వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు కవితా సంపుటాలు ప్రచురించారు. ఆయనను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. తెలుగులో మేజిక్ రియలిజంలో మొదటగా రాసిన రచయిత కూడా మునిపల్లె రాజే. ఆయన గురించి ‘సాక్షి’ సాహిత్యం పేజీలో వచ్చిన ప్రత్యేక వ్యాసం ఇది మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు... -
మంచు హీరో కోసం బాహుబలి రైటర్
సాక్షి, సినిమా : సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించే కథలు చాలా వరకు బ్లాక్ బస్టర్లు అవుతాయనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. ముఖ్యంగా బాహుబలి, భజిరంగీ భాయ్‌జాన్‌లతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అందుకే భాషలకతీతంగా దర్శకులు ఆయన కథ కోసం ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరో యువ హీరో కోసం ఆయన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘‘మంచు విష్ణు కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సోషల్ డ్రామాగా అది ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో స్క్రిప్టును పక్కాగా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడి కోసం విష్ణు వేటను ప్రారంభించేశాడు. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరెక్టర్లను పేర్లను విష్ణు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది’’ అన్నది ఆ కథనం సారాంశం. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు విష్ణు నటించిన రెండు చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, గాయత్రి విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్-మంచు విష్ణు -
ఖదీర్‌బాబు, సుజాతాదేవికి ‘పెద్దిభొట్ల’ పురస్కారం ప్రదానం
విజయవాడ కల్చరల్: ప్రముఖ కథా రచయిత, కథా పరిశోధకుడు మహ్మద్ ఖదీర్‌బాబు, బాల సాహిత్య కథా రచయిత్రి డి.సుజాతాదేవి 2017 సంవత్సరానికి గాను పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారాలను అందుకున్నారు. పెద్దిభొట్ల స్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సభలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల జీవితాలే పెద్దిభొట్ల కథా వస్తువులని, యువ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పురస్కారాల నిర్వాహకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య మాట్లాడుతూ తెలుగు కథా ప్రపంచానికి సేవలు చేస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం (అభ్యుదయ రచయితల సంఘం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెద్దిభొట్ల రాసిన కథలన్నీ ఆణిముత్యాలేనని వివరించారు. ఆయన కథలు ఆంగ్లంలోకి, రష్యన్ భాషలోకి అనువదించబడ్డాయన్నారు. కథారచయితలను లయోలా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ పరిచయం చేశారు. పురస్కారాలు అందుకున్న ఖదీర్‌బాబు, సుజాతాదేవి తమ స్పందన తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి, ఎవీకే ఫౌండేషన్ నిర్వాహకులు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సాహితీ గురుమిత్రుడు బుచ్చారెడ్డి
వల్లపురెడ్డి బుచ్చారెడ్డి ఈ ప్రపంచానికి ఒక సాహిత్యకారునిగా, ఒక విమర్శకుడుగా, పరిష్కర్తగా, కథా రచయితగా పరిచయమైనవాడు. మన దృక్కోణాన్ని బట్టి మనకు కనిపించేది ఒక్కోలా కనిపిస్తుంది. మన అనుభవం వల్ల దృక్కోణం స్థిరపడినప్పుడు, ఎదుటిది.. అంటే మనం చూసేది, అది ప్రకృతైనా, వస్తువైనా, మని షైనా స్థిరపడుతుంది. నేను అతన్ని కలిసినప్పుడు నాకు ఒక కొత్త వెలుగులో దర్శనమిచ్చారు. ఆయనకూ నాకూ మధ్య 50 సంవత్సరాల వయో వ్యత్యాసం ఉంది. అయితే మా ఇద్దరి అస్తిత్వం భౌతిక పరిధిని దాటినది. సాహిత్యానికి, పాండిత్యానికంటే చాలా ఎత్తులో జీవించారు ఆయన. ఆయన నాకు ‘గురు మిత్రుడు’. మాది ఒక ‘లవ్ ఎఫైర్’. ఒక అర్ధరాత్రి ఆయన నన్ను అడిగారు. ‘మన ఇద్దరి సంబంధాన్ని ఎలా వర్ణిస్తావ్’ అని. ‘మీరు నాకేమీ నేర్పించని గురువు– నేను ఏమీ నేర్చుకోని శిష్యున్ని’ అన్నాను. ఎంత అందంగా నవ్వారో. మా స్నేహానికి ఆధారం సాహిత్యం కాదు. ఒక సూక్ష్మ ఆధ్యాత్మిక అనుభవం. ఆయనవి ఉత్త మాటలు కావు. అవి ఆచరణలోంచి పలికినవి. ఆయన ఆచరిస్తూ చెప్పిన మాటలు చైతన్యపు నిప్పు కణికలు. ఒకసారి ఇలా అన్నారు. ‘‘ఈ శరీరాన్ని నాతో ఈడ్చుకుపోతున్నా.. వచ్చిందా సరే... లేకపోతే నా దారిన నే పోతా’’ అన్నారు. మరోసారి ‘‘కవిత, సాహిత్యం, కథ.. ఎంత గొప్పదయినా పనికిరాదు.. ఆచరణలోంచి రాకపోతే’’ అన్నారు. అప్పుడు ఆయనో పరమహంస నా కళ్లకు. నా కళ్లు తన కళ్లని చూసాయి. ఆయన కళ్లు నన్ను చూసాయి. అనిర్వచణీయమైన ధార కన్నీళ్లై జలజలా రాలాయి. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఆయనను ఈ మధ్య ఐసీయూలో చూసాను. శరీరం తన ప్రయాస తను పడుతోంది. కళ్లు ప్రశాంతంగా ఓ గమ్మల్తైన కాంతితో, తెల్లగా మల్లెపూలవలె మెరుస్తున్నాయి. ఆయన ఏ లోకంలో అయినా హాయిగా ఉండాలనీ, ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ పలికే పనికిరాని మాటలు బుచ్చారెడ్డికి సరిపడవు. కనుక వాడను. ఆయన ఎక్కడ ఉన్నా పూర్ణ చైతన్యంతో నిలువగల ప్రశాంతమూర్తి. బుచ్చారెడ్డి, నాకు తెలిసిన బుచ్చారెడ్డి స్వయం ప్రేమ, చైతన్యం, కరుణ, అనిర్వచనీయమైన కఠినం. ఆయన నాకు ఇచ్చిందేదైనా ఉంటే నిష్కల్మషమైన కాంతి. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి 1950–60లలో మొత్తం 52 కథలు రాశారు. ఈ కథలన్నీ భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి నాటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. లభ్యమైన తన 35 కథలను కలిపి ఒక కథా సంకలనం ప్రచురించారు. అలాగే గాలిబ్ తదితర ఉర్దూ కవుల కవితలను అనువదించి ‘మధుగీత’ పేరిట ప్రచురిం చారు. అలాగే కొన్ని తాళపత్ర గ్రంథాలను పరిష్కరిం చారు. ఈయన సినారె సమకాలికులు. మధుగీత పుస్తకానికి సినారె ముందుమాట కూడా రాశారు. బిరుదురాజు రామరాజు ఈయన గురువు, సన్నిహితులు. ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్‌గా, డిగ్రీకాలేజీ లెక్చరర్‌గా పనిచేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ తర్వాత ప్రముఖ సాహితీవేత్తగా వెలుగొందారు. (జననం 07.10.1932 – మరణం 31.08.2017) కాంత్ రీసా, రచయిత, చిత్రకారుడు, మహబూబ్‌నగర్: మొబైల్: 91779 08556 -
బోయ జంగయ్యకు కన్నీటి వీడ్కోలు
చౌటుప్పల్(నల్లగొండ): ప్రముఖ కవి, కథా రచయిత బోయ జంగయ్య(74) అంత్యక్రియలను సోమవారం ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో నిర్వహించారు. అంతకుముందు జంగయ్య భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి నల్లగొండ పట్టణానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.