‘‘కొత్తపేట కలాలు’’పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : బాల్యంలో విద్యార్థులు కథలు రాయడం గొప్ప అనుభూతినిస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డీకే చదువుల బాబు సంపాదకత్వంలో 20 మంది విద్యార్థులు రాసిన ‘‘కొత్తపేట కలాలు’’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి వయసులోనే పుస్తకాలను రాయాలనే ఆలోచన రావడం అరుదైన విషయమన్నారు. విద్యార్థులను ఈ వైపుగా ప్రోత్సహించిన చదువుల బాబును అభినందించారు. గురువులేని విద్య ప్రకాశించదని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే రచనలు చేయాలని పేర్కొన్నారు.
కథలు రాయడం వల్ల విద్యార్థుల్లో పరిశీలన, సృజనాత్మక శక్తి అభివృద్ధి చెందుతుందని అన్నారు. కథల్లో స్నేహం, సహకార గుణం, సేవాతత్వం, తల్లిదండ్రుల ప్రేమ, పరోపకారం తదితర అంశాలు కనిపించాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శతావధాని నరాల రామారెడ్డి మాట్లాడుతూ రాచమల్లు శివప్రసాదరెడ్డిలా మాట్లాడే శాసనసభ్యులు రాష్ట్రంలోనే అరుదుగా ఉన్నారని చెప్పారు. రాచమల్లు రామచంద్రారెడ్డి, భైరవ కొండారెడ్డి గొప్ప కవులు అని తెలిపారు. ఆయన వంశంలో కవులు ఉన్న కారణంగానే ఆయనకు వాక్చాతుర్యం అలవడిందన్నారు. ఆయన భాష, భావం చక్కగా ఉంటాయని పేర్కొన్నారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పాఠశాల వయసులోనే సమాజంపై అవగాహన పెంచుకుని కథలు రాసిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు రాయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయభారతి, ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి, చదువులబాబు, హిమజాత, దేవదత్తు, పద్మావతి, రమాదేవి, కృష్ణ మాధవీలత, రామానాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment