ఛాలెంజ్‌ | A Story Was Written By Alexander Pushkin | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 1:52 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM

A Story Was Written By Alexander Pushkin - Sakshi

ఈ కథను మనం కథకుడి నోటి నుంచి వింటాం. అతడు సైన్యంలో పనిచేస్తుంటాడు.
వాళ్లు ‘ఎన్‌...’ అనే చిన్న పట్టణంలో ఉన్నారప్పుడు. ఆర్మీ అంటే డ్రిల్లు, డిన్నరు, పేక; ఇదే జీవితం. యూనిఫారాలు తప్ప మరొకటి కనబడవు.
సైనికులు తమ బృందంతో కలవనిచ్చే వేరే వ్యక్తి ఒక్కడే. ఆయన వయసు ముప్పై ఐదు ఉండొచ్చు. ఈ కుర్రాళ్ల మధ్య అతడు పెద్దమనిషి కిందే లెక్క. అతడు ఎక్కువ మాట్లాడడు. మాట్లాడినా కోసినట్టుగా ఉంటుంది మాట. చూడ్డానికి రష్యన్‌లా కనబడినా పేరు విదేశీలా ధ్వనిస్తుంది. కుర్రాళ్లందరికీ సిల్వియో అంటే ఒక ఇది ఉంటుంది. అతడు అంతకుముందు అశ్వికదళంలో పనిచేశాడు. మరి ఎందుకు అందులోంచి రిటైర్‌ అయ్యాడో, ఎందుకు ఈ పాడుబడిన ఊళ్లో ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. సిల్వియో సైనికుల గుంపుతో కలిసి షాంపేన్‌ తాగుతాడు. వాళ్లు అడిగితే తన దగ్గరున్న పుస్తకాలు ఇస్తాడు. అవి ఎక్కువగా సైన్యం గురించినవే అయివుంటాయి. సిల్వియోకు ఎక్కువ వినోదకరమైంది మాత్రం షూటింగ్‌. బుల్లెట్లు తగిలి అతడి ఇంటి గోడలు తేనెపట్టు రంధ్రాలైనాయి. సిల్వియో గురి ఎంత గొప్పదంటే, నీ టోపీ మీదున్న పండును కొడతానని గనక అతడంటే, దాన్ని నెత్తిన పెట్టుకోవడానికి ఏ ఒక్క సైనికుడు కూడా జంకడు.

సైనికుల సంభాషణ తరచూ ద్వంద్వయుద్ధాల మీదకు మళ్లేది. ఆ రోజుల్లో ఇద్దరు మనుషుల మధ్య తేడా వచ్చిందంటే ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరడం మామూలే. కానీ వాటిలో సిల్వియో  జోక్యం చేసుకునేవాడు కాదు. బదులిచ్చినా పొడిగానే. అయినా సిల్వియో పిరికివాడై ఉంటాడన్న ఆలోచన కూడా ఎవరి తలలోకి దూరేది కాదు. కానీ ఒక సంఘటన కథకుడిని విస్తుపోయేలా చేసింది. 

ఒకరోజు ఓ పదిమంది సిల్వియోతో విందు చేసుకున్నారు. అనంతరం సైనికులు అడిగిన మీదట బలవంతంగా పేక ఆడటానికి ఒప్పుకున్నాడు సిల్వియో. అయితే, స్కోర్‌ దగ్గర చిన్న తేడా జరిగింది. ఎక్కువ మాట్లాడని సిల్వియో దాన్ని చాక్‌పీస్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిలోనే మాటలు పెరిగాయి. కొత్తగా ఆ రెజిమెంటుకు వచ్చిన కుర్ర లెఫ్ట్‌నెంట్‌ కోపంగా సిల్వియో మీదకు టేబుల్‌ మీదున్న ఇత్తడి దీపపు సెమ్మె విసిరేశాడు. జరిగినదానికి మిగతా సైనికులు భీతిల్లారు. వీడింక చచ్చాడే అనుకున్నారు. అయినా కాసేపు ఆట మౌనంగా కొనసాగింది. సిల్వియోకు ఆసక్తి పోయిందని గ్రహించి ఒక్కొక్కరూ బయటికి నడిచారు.

తెల్లారి గుర్రపు స్వారీల దగ్గర ఆ లెఫ్ట్‌నెంట్‌ ఇంకా బతికేవున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సిల్వియో ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరలేదా? ఇది కుర్రాళ్ల దృష్టిలో సిల్వియోను పలుచన చేసింది. మనిషి గుణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైందని యువకులు తలిచే ధైర్యం లేకపోవడాన్ని వాళ్లు క్షమించలేరు. అందరికన్నా సిల్వియోతో ఎక్కువ దగ్గరితనం ఉన్న కథకుడు కూడా సిల్వియో కళ్లలోకి చూడటానికి ఇష్టపడలేదు.
ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని చదవగానే సిల్వియో కళ్లు మెరిశాయి. తను ఇక నిష్క్రమించాల్సిన తరుణం వచ్చిందనీ, వెళ్లేలోగా చివరిసారి రాత్రికి తనతో భోజనం చేయమనీ కుర్రాళ్లను ఆహ్వానించాడు. ప్రత్యేకించి కథకుడికి మరీ మరీ చెప్పాడు. విందు బాగా జరిగింది. అందరూ సిల్వియోకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కథకుడు కూడా బయలుదేరుతుండగా చేయి పట్టి ఆపాడు సిల్వియో. ఇద్దరూ మౌనంగా కాసేపు పైపులు కాల్చారు. ‘ఇంక మనం మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు. వెళ్లేముందు నేను నీకో వివరణ ఇవ్వాల్సివుంది’ అన్నాడు సిల్వియో.

‘నా మీద ఉన్న చెడు తలంపును దూరం చేయకపోతే అది నన్ను జీవితకాలం వెంటాడుతుంది’ అని చెప్పి, ఆ రోజు ఆ తాగుబోతు ‘ఆర్‌...’ను వదిలేయడానికి తన ఔదార్యం మాత్రమే కారణం కాదనీ, వాడిని పిస్టల్‌తో కాల్చడంలో తనకో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ఆయుధాల ఆటలో తన జీవితం కూడా ప్రమాదంలో పడే వీలుందనీ చెప్పాడు సిల్వియో. ఈ వివరణ కథకుడిని మరింత స్తంభించేలా చేసింది. మృత్యువు అంచుకు వెళ్లే హక్కు తనకు లేదంటాడు సిల్వియో. దానిక్కారణం ఆరేళ్లుగా అతడు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఒక ప్రతీకారం. తనను దెబ్బ కొట్టిన శత్రువు ఇంకా బతికేవున్నాడు. ఆ గతానికి గుర్తుగా పెట్టెలోంచి తీసి బుల్లెట్‌ దిగిన ఒక టోపీని చూపించాడు.

సిల్వియో అశ్వికదళంలో పనిచేసే రోజుల్లో అసాధారణ వీరుడిగా పేరొచ్చింది. ద్వంద్వయుద్ధాల్లో అతడికి సాటి లేరు. అలాంటి రోజుల్లో వాళ్ల రెజిమెంటుకు కొత్త ఆఫీసర్‌ వస్తాడు. అతడు ధనవంతుడు, అందగాడు, దేన్నీ లెక్కచేయని ధైర్యవంతుడు, మాటకు మాటను తెలివిగా విసురుతాడు. తనను సవాల్‌ చేసేవాడే లేడనుకున్న తరుణంలో వచ్చిన ఈ కొత్త ఆఫీసర్‌ సిల్వియోలో ఈర్ష్య పుట్టిస్తాడు. చివరికి ఒకరోజు ఒక విందునాట్యంలో అతడిని పరుషమైన మాటంటాడు సిల్వియో. బదులుగా అతడు  సిల్వియో ముఖం మీద కొడతాడు. ఇద్దరూ కత్తులు దూసుకుంటారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ రాత్రే వాళ్లు ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసురుకుంటారు.

తెల్లవారుతుంది. నిర్దేశిత స్థలంలో సిల్వియో అసహనంగా ఎదురుచూస్తుంటాడు. వెంబడి ముగ్గురు సహాయకులుంటారు. కొత్త ఆఫీసర్‌ తాపీగా నడుచుకుంటూ వస్తాడు. తన క్యాపులో చెర్రీపళ్లు ఉంటాయి. వెంట ఒక్కడే సహాయకుడు. సహాయకులు ఇద్దరి మధ్యా పన్నెండు అంగల దూరం కొలుస్తారు. ముందు ఎవరు కాల్చాలి? సిల్వియో చేయి వణుకుతుంది. తనకు తాను ఆ నిశ్చలత ఇచ్చుకోవడానికి వీలుగా ఆఫీసర్‌కు మొదటి షాట్‌ ఆఫర్‌ ఇవ్వబోతాడు సిల్వియో. కానీ సహాయకులు వారించి పాచిక వేస్తారు. ఆఫీసర్‌ చెప్పిన అంకె పడుతుంది. అతడు గురిపెట్టి మొదటి షాట్‌ కాలుస్తాడు. సరిగ్గా సిల్వియో నుదురు పైన అంగుళం దూరం నుంచి క్యాపుగుండా వెళ్తుంది బుల్లెట్‌. 

ఇప్పుడు సిల్వియో వంతు. గురి చూసి కొట్టడంలో మొనగాడైన సిల్వియో చేతుల్లో ఆఫీసర్‌ ప్రాణం ఉంది. సిల్వియో పిస్టల్‌ గురి పెడతాడు. అతడిలో ఏమైనా భయం జాడ ఉన్నదా? ఊహు. తాపీగా టోపీలోంచి విరగబండిన చెర్రీపళ్లను తీసుకు తింటూ, వాటి గింజలు నోట్లోంచి దూరంగా సిల్వియో కాళ్ల దగ్గర వచ్చి పడేలా ఊస్తూ నిలబడతాడు. ఇది సిల్వియోను కలవరపరుస్తుంది. ఎవడైనా భయపడితే వాడి బతుకును లాక్కోవచ్చు. ఇట్లాంటివాడిని చంపితే ఎంత, చంపకపోతే ఎంత?

పిస్టల్‌ దించి, నువ్వింకా చావడానికి సిద్ధంగా లేనట్టున్నావు, నీ బ్రేక్‌ఫాస్ట్‌ కానీ, నేను అడ్డురానంటాడు సిల్వియో. అడ్డు వస్తున్నావని ఎవరన్నారు? కాల్చుకో, షాట్‌ నీది, నేను ఎప్పుడైనా సిద్ధం అంటాడు అతను. సహాయకులతో తన షాట్‌ను ఈ రోజు తీసుకోనని సిల్వియో చెప్పడంతో ఆ ద్వంద్వయుద్ధం ఆగిపోతుంది.

తర్వాత సిల్వియో ఈ ఊరికి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డాడు. తన ప్రతీకారం గురించి అతడు ఆలోచించని రోజంటూ లేదు. అనుకోకుండా సిల్వియో ఏజెంట్‌ మాస్కో నుంచి రాసిన ఆ ఉత్తరంలో ‘ఒకానొక వ్యక్తి’ ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని రాశాడు. ఈ కథంతా సిల్వియో కథకుడికి చెప్పి, ఆ ఒకానొక వ్యక్తి ఎవరో నీకు అర్థమైందనుకుంటాను, అని అడుగుతాడు. ఆ రోజు మృత్యువు ముఖంలోకి చెర్రీపళ్లు తింటూ చూసినట్టుగానే ఈ వివాహ వేడుక సందర్భంగా కూడా చూస్తాడా? సిల్వియో తన సామగ్రి సిద్ధం చేసుకుని, బోనులోంచి బయటపడిన పులిలా ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అతడి కోసం గుర్రాల బండి సిద్ధంగా ఉంది.
    
చాలా ఏళ్లు గడిచాయి. కుటుంబ పరిస్థితులు మన కథకుడిని ‘ఎమ్‌...’ అనే ఊళ్లో స్థిరపడేలా చేశాయి. ఊళ్లో ప్రత్యేకించి ఏమీ జరగదు. ఒక్క విశేషం ఉంటే దాని గురించి రెండు నెలలు చెప్పుకుంటారు గ్రామస్థులు. కథకుడి ఇంటికి నాలుగు వర్స్‌ దూరం(1 వర్స్‌ = 1.1 కిలోమీటర్‌)లో దొరసాని బి... ఎస్టేట్‌ ఉంది. అది ఎ... అనే గ్రామం కిందికి వస్తుంది. ఎస్టేట్‌లో పర్యవేక్షకుడు తప్ప ఎవరూ ఉండరు. ఆమెకు పెళ్లయిన తొలి ఏడాది ఓసారి ఇక్కడికి వచ్చి వెళ్లిందట. మళ్లీ ఆమె భర్తతో సహా ఎస్టేట్‌కు వస్తున్నారని తెలిసి కథకుడు ఉత్సాహపడతాడు. ఊళ్లల్లో జరగ్గలిగే విశేషాలు అంతకంటే ఏముంటాయి?

జమీందారు, అతడి భార్య వచ్చారని తెలిశాక వచ్చిన మొదటి ఆదివారం కథకుడు తన వందనాలు తెలియజేయడానికి వెళ్లాడు. భవంతి అత్యంత విలాసవంతంగా ఉంది. పుస్తకాలు, కంచు ప్రతిమలు, తివాచీలు, పెద్ద అద్దం... ఒక పనివాడు ఈయన వచ్చినట్టు చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ఇంత సంపద ఎప్పుడూ చూసివుండని కథకుడిలో కొంత వణుకు పుట్టిన మాట నిజం. కానీ అందమైన ముప్పై రెండేళ్ల వరకు వయసుండే జమీందారు వచ్చీరావడంతోనే స్నేహంగా పలకరించాడు. ఈ లోపల దొరసాని కూడా వచ్చింది. ఆమె ఇంకా అందగత్తె. కథకుడి బిడియం పోయేలా ఇద్దరూ మామూలుగా మాట్లాడసాగారు. ఆ గదిలో ఉన్న ఒక పెయింటింగ్, అది స్విట్జర్లాండ్‌లోని ఒక దృశ్యం, కథకుడిని ఆకర్షించింది. దానిమీద సరిగ్గా ఒక దానిమీద ఒకటి తగిలిన రెండు బుల్లెట్‌ గుర్తులున్నాయి.

మంచి షాట్‌’ అన్నాడు కథకుడు. ‘అవును, అసాధారణమైన షాట్‌’ అని బదులిచ్చాడు జమీందారు. అట్లా మాటల్లో ముప్పై అంగల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చగలనని చెప్పాడు కథకుడు. నువ్వు కూడా అలా కాల్చగలవా డియర్, అని అడిగింది దొరసాని. ఏదో ఒక రోజు నేనూ కాల్చగలనన్నాడు జమీందారు. నాకు తెలిసిన ఒకతను ఉండేవాడు, గోడ మీద ఈగ కనబడితే పిస్టల్‌ తెమ్మని కేకేసేవాడు, ఢాం, అదీ అతడి గురి అని చెప్పాడు కథకుడు. ఎవరాయన? అడిగాడు జమీందారు. ‘సిల్వియో అని...’ ‘సిల్వియో!’ అరిచినంత పనిచేశాడు జమీందారు. దీంతో ఆ పాత కథంతా తవ్వుకోవాల్సి వస్తుంది.

జమీందారుకు పెళ్లయి నెలే అయిందప్పుడు. ఆరోజు కొత్త దంపతులు గుర్రపు స్వారీకి వెళ్లారు. దొరసాని గుర్రం ఆ రోజు మాట వినకపోతే ఆమె దిగి నడుచుకుంటూ వస్తానంది. జమీందారు ముందు ఇల్లు చేరాడు. వచ్చేసరికి సిల్వియో ఉన్నాడు. అతణ్ని చూడగానే జమీందారు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాకీ తీర్చమని అడిగాడు సిల్వియో. జమీందారు సిద్ధమయ్యాడు. భార్య వచ్చేలోగా కాల్చమని కోరాడు. మళ్లీ సిల్వియో సందేహపడ్డాడు. ఇలా కాల్చడం మర్డర్‌ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మళ్లీ చీటీలు వేశారు. ఈసారీ జమీందారుకే తొలి ఛాన్స్‌ వచ్చింది. మహాచెడ్డ అదృష్టవంతుడు. జమీందారు కాల్చిన షాట్‌ మిస్‌ అయి ఆ పెయింటింగుకు తగిలింది. ఇప్పుడు కాల్చడం సిల్వియో వంతు. పిస్టల్‌ గురి పెట్టాడు. అప్పుడే దొరసాని ఆ గదిలోకి వచ్చింది. కాల్చవద్దని సిల్వియో కాళ్లదగ్గర పడింది. ‘మాషా, ఇది నీకు సిగ్గుగా లేదూ!’ అని జమీందారు వారించాడు.

అదిగో, అప్పుడు సిల్వియో వదిలేసి వెళ్లాడు. వెళ్తూ, గురి కూడా చూడకుండా జమీందారు కాల్చిన పెయింటింగును అదే స్థానంలో కాల్చాడు. తనకు అంతకుముందు తెలిసినదానికి జమీందారు చెప్పినదానితో కలిపి కథకుడు కథ పూర్తి చేస్తాడు. 
తర్వాత చాలా ఏళ్లకు అలెగ్జాండర్‌ ఇప్సిలాంటి నేతృత్వంలోని తిరుగుబాటులో సిల్వియో పాల్గొని స్కౌలానా యుద్ధంలో మరణించినట్టు కథకుడికి తెలుస్తుంది.
అలెగ్జాండర్‌ పుష్కిన్‌ 1831లో రాసిన ‘ద షాట్‌’ కథాసారం ఇది. రష్యన్‌ ఆధునిక సాహిత్యానికి పుష్కిన్‌ మార్గదర్శి అంటారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement