
పాతికేళ్ళ మధురిమ (మధు) పాండే బరువు 93 కిలోలు. గురుగావ్ మధ్యతరగతి కుటుంబం. ఉద్యోగం చేస్తుంటుంది. తెలివైన, ఆధునిక యువతే కానీ తన స్థూలకాయం వల్ల ఆత్మగౌరవం తక్కువ. ఇతరుల పట్ల ఈర్ష్య పడదు. ‘పెళ్ళీడుకొచ్చింది. ఇంకా పెళ్ళవలేదా?’ లాంటి ప్రశ్నలు తప్పించుకోవడానికి ఎమ్బీయే చేయడం ప్రారంభిస్తుంది.
కిట్టీ పార్టీలకెళ్తుండే అమ్మమ్మ, ‘అందం అణుకువ ఉన్న చదువుకున్న పిల్ల, తెల్లటి రంగు, పెద్ద కళ్ళు, పొడుగు జుట్టు, ఆరోగ్యవంతమైన ఫిగర్’ అని శుభ్‌షాదీ డాట్‌కామ్‌లో తన వివరాలు పెట్టినప్పుడు, కుదిర్చే వివాహాలంటే నమ్మకం లేనప్పటికీ మతంటూ ఉన్న ఏ యువకుడూ తనంత లావున్న అమ్మాయిని ఇష్టపడడని అనుకుని అభ్యంతరం చెప్పదు.
మొదటి పెళ్ళి చూపుల సమయంలో టమ్మీ టకర్ వేసుకున్న మధురిమని మగపెళ్ళివారు నిరాకరించినప్పుడు, అమ్మమ్మ ఓదారుస్తుంది: ‘మధుకి ఇంకా మంచివాడెవడో రాసి పెట్టుంటాడు. ఇతను మరీ ఆడంగిలా ఉన్నాడు. వాళ్ళమ్మ బ్లౌజ్ చూశావా? గురుగావ్‌లో సగంమంది వేసుకునేది ఆ డిజైనే’.
ఇలాంటి హాస్యభరితమైన సంఘటనలున్న ‘ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ఎ ఫ్యాట్ బ్రైడ్’ నవలలో– కాబోయే పెళ్ళికొడుకులూ, వారి కుటుంబాలూ మధుని చూడ్డానికి రావడం, అమ్మాయి నచ్చలేదని చెప్పడం పరిపాటిగా మారుతుంది. ఒకసారి హరీష్ అనే యువకుడితో కేఫెటీరియాలో మీటింగ్ ఏర్పరిచినప్పుడు అమ్మమ్మ హెచ్చరించి పంపిస్తుంది: ‘అక్కడికి వెళ్ళి ఎప్పట్లాగే సివంగిలా నవ్వకు’. కేఫేలో హరీశ్ ముక్తసరిగా మాట్లాడుతూ, గంటలోపలే పెళ్ళికి వొప్పేసుకున్నప్పుడు, ‘ఏ లోపాలూ ఉన్నట్టు కనిపించని వ్యక్తి నన్నెలా అంగీకరించాడు? నపుంసకుడో, సమలైంగికుడో కాడు కదా!’ అన్న సందేహాలు మధుని చుట్టుముడతాయి.
అయినప్పటికీ కాబోయే పెళ్ళికూతురిగా– షాపింగుకూ, బ్యూటీ పార్లర్లకూ వెళ్తూ అప్పుడప్పుడూ హరీశ్‌ను కలుసుకుంటూ ఉంటుంది. అయితే, అతను మాత్రం మధుపైన ఆసక్తి కానీ, ప్రేమ కానీ చూపకపోగా ఆమెకి దగ్గరవడానికి కూడా ప్రయత్నించడు. హడావిడిగా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ తరువాత అతని తల్లిదండ్రులు కట్నంలో కారు అడగ్గానే, ఆ సంబంధాన్ని కాదంటుంది మధు.
ఎమ్బీయే పూర్తి చేసి సంవత్సరం గడిచిన తరువాత వొక రోజు, హరీశ్‌ను సైకియాట్రిస్ట్ ఆఫీసులో చూస్తుంది. అతనికి ఆడవాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోయే అరుదైన సమస్య ఉందని తెలిసి– ఇద్దరి కుటుంబాలకీ అయిష్టం అయినప్పటికీ, అతన్ని పెళ్ళి చేసుకుంటుంది.
సమా విసారియా రాసిన ఈ నవల– సమాజంలో ఉండే వరకట్నం, మూఢాచారాలు, ఇరుగుపొరుగు జోక్యం, బాడీ షేమింగ్ అంశాలను సముచితంగా ప్రతిబింబిస్తుంది. ఊబకాయపు అమ్మాయిలకు వరుడు దొరకడం కష్టం అవడాన్ని, స్నేహితుల/ చుట్టాల నుంచి ఎదుర్కునే పెళ్ళి చేసుకోమన్న ఒత్తిడిని హాస్యంగా, నిజాయితీగా వర్ణిస్తారు రచయిత్రి.
నవల ఏదీ ఉపదేశించదు. ‘అందం’ గురించి మన సమాజంలో ఉన్న అభిప్రాయపు చేదు నిజాన్ని చెప్తుంది. భౌతిక సౌందర్యం పట్ల ఇంత పట్టింపున్న సమాజం మానసిక అనారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్య పెడుతుందని ప్రశ్నిస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళ పునాది బలహీనమైనదని చెబుతుంది. మధు వ్యంగ్య ధోరణి, అభిప్రాయాలు కథకు సారాన్ని జోడిస్తాయి. సరళంగా, సాఫీగా సాగే పుస్తకంలో అనవసరమయిన పాత్రలేవీ ఉండవు. ఉన్న కొద్ది పాత్రలూ పాఠకులకు పరిచితమైనవన్నంత వాస్తవికంగా అనిపిస్తాయి. పెంగ్విన్ మెట్రో రీడ్స్ 2017లో ప్రచురించిన ఈ నవల మధ్యలో కొన్ని హిందీ పదాల వాడకం కనిపిస్తుంది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment