సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు ఆదివారం విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు తొలివిడతలో, అంటే ఏప్రిల్ 11నే పోలింగ్ జరగనుంది. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 3తో ముగుస్తుండగా, ఎన్నికల ఫలితాలను మే 23న వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేరోజున పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఇప్పటికే గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ప్రస్తుతానికి లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో ఆదివారం సాయంత్రం నుంచే దేశమంతటా ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చింది.
ఈసారి ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామనీ, 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది లక్ష ఎక్కువని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా చెప్పారు. తాజా ఎన్నికల్లో 543 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 90 కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ ఓటు ధ్రువీకరణ యంత్రా(వీవీప్యాట్)లను కూడా అందుబాటులో ఉంచుతామని సునీల్ తెలిపారు. రాజ్యాంగం తమకు అప్పగించిన బాధ్యతల ప్రకారం స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము దృఢ సంకల్పంతో ఉన్నామని సునీల్ చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ ‘దేశవ్యాప్తంగా ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అధికారులు, భద్రతా సిబ్బందితోపాటు ఎన్నికల సంఘానికి నా శుభాభినందనలు. చాలా ఏళ్లుగా ఎంతో వేగంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘాన్ని చూసే ఇండియా గర్విస్తోంది’అని మోదీ ట్వీట్ చేశారు.
గత ఎన్నికల లెక్కలు ఇవీ..
2014లో ఏప్రిల్ 7 నుంచి మే 9 వరకు మొత్తం 9 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా ఈ సారి ఏడు దశలకే పరిమితం చేశారు. గత ఎన్నికల్లో 543 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 8,251 మంది అభ్యర్థులు (సగటున ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 15 మంది) పోటీ చేయగా, ఏకంగా 7,000 మంది తమ డిపాజిట్లు కోల్పోయారు. ఆ ఎన్నికల్లో 9.27 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కేవలం 55 కోట్ల మందే (66.3 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 60 లక్షల ఓట్లు నాడు నోటాకు పడ్డాయి. పోటీ చేసిన 8,251 మందిలో మహిళా అభ్యర్థులు కేవలం 668 మంది (8 శాతం) మాత్రమే. వారిలో గెలుపొందింది 62 మందే. అంటే మహిళలు పోటీ చేసిందే చాలా తక్కువ మంది అయితే, వారిలోనూ పది శాతం మంది కూడా గెలవలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 336 స్థానాల్లో గెలుపొంది ఘన విజయం సాధించింది. బీజేపీ సొంతంగానే 282 సీట్లు గెలిచి, ఒంటరిగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగినంత సామర్థ్యాన్ని తొలిసారి సాధించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో ఘోరంగా విఫలమై, పది శాతం సీట్లు కూడా గెలవలేకపోయింది. కేవలం 44 స్థానాలే గెలిచినప్పటికీ లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది.
ఢిల్లీలో మే 12న ఎన్నికలు
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు ఆరో దశలో, అంటే మే 12న జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లోనూ బీజేపీనే గెలవడం గమనార్హం. దేశంలోని మొత్తం ఓటర్లు 90 కోట్లు కాగా, ఒక్క ఢిల్లీలోనే 1.36 కోట్ల మంది ఓటర్లున్నారు. ఎన్నికల ప్రణాళిక ప్రకటన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘మళ్లీ ప్రజలకు అవకాశం వచ్చింది. ఇదే మన ప్రజాస్వామ్యంలోని అసలైన శక్తి. నియంతృత్వ, సమాఖ్య వ్యతిరేక ప్రభుత్వాన్ని చరిత్రలో కలిపేసేందుకు ఇదే సమయం. నోట్ల రద్దు, నిరుద్యోగిత, వ్యాపారాల నాశనం, సమాజంలోని వివిధ మతాల మధ్య సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టడం తదితరాలపై ప్రశ్నించే సమయం వచ్చింది’అని అన్నారు. ఆప్ ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు
ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్ల మధ్య పోలికలు ఉన్నప్పుడు ఓటర్లు అయోమయానికి గురవుతున్నారనీ, ఈ సమస్యను నివారించడం కోసం ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్ల పక్కన ఫొటోలను కూడా ముద్రించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు నామినేషన్ సమయంలో స్టాంపు సైజు ఫొటోను కూడా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. దేశంలో తొలిసారిగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను 2009లో ప్రవేశపెట్టామనీ, అయితే అప్పట్లో జమ్మూ కశ్మీర్, అస్సాం, నాగాలాండ్‌ల్లో ఇది అమలు అవ్వలేదని ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మాత్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను తీసుకొచ్చామని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాల వివరాలను అభ్యర్థులంతా ఈసీకి తెలిజేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులు ప్రకటనలు ఇచ్చే ముందు వాటిని ఎన్నికల సంఘానికి చూపించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సునీల్ స్పష్టం చేశారు.
పాన్ చెప్పకుంటే నామినేషన్ తిరస్కరణే
అభ్యర్థులు తమ ఎన్నికల నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించే అఫిడవిట్(ఫారం–26)లో తమ నేరచరిత్ర సహా కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తులు, తమ పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుందని సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. ఇందుకోసం ఫిబ్రవరి 26న ఫారం–26ను సవరించామని, నిర్ధేశించిన ప్రకారం పాన్ కార్డు వివరాలు పొందుపరచని పక్షంలో నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని వివరించారు. కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తుల వివరాలతోపాటు పాన్ కార్డు వివరాలు తప్పకుండా పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు.
జమ్మూ కశ్మీర్‌లో శాసనసభకు ఇప్పుడు కాదు..
భద్రతా కారణాల రీత్యా జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలను జరపడం లేదని సీఈసీ సునీల్ అరోరా చెప్పారు. ఈ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) విమర్శలు వ్యక్తం చేశాయి. జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ–బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం రద్దయిన గతేడాది జూన్ నుంచి ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉండటం తెలిసిందే. భద్రతా దళ సిబ్బంది, అవసరమైన సామగ్రి పరిమితంగా ఉండటంతోపాటు ఆ రాష్ట్రంలో ఇటీవలి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీల్ వివరించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శిస్తూ 1996 తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలను ఈ ప్రభుత్వం సరైన సమయానికి నిర్వహించడం లేదన్నారు. జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ, లోక్‌సభల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అన్ని బలగాలనూ దింపుతామంటూ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ, రాజ్యసభలతోపాటు ఇటీవలి అఖిలపక్ష సమావేశంలో కూడా హామీనిచ్చారనీ, ఇప్పుడేమైందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ దురుద్దేశాల కారణంగానే జమ్మూ కశ్మీర్ శాసనసభకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు.
అబద్ధాలకోరులను ఓడిస్తాం: కాంగ్రెస్
ఎన్నికల ప్రణాళిక ప్రకటనను కాంగ్రెస్ స్వాగతించింది. ఈ ఎన్నికల్లో సత్యమే విజయం సాధిస్తుందనీ, ప్రస్తుత ప్రభుత్వంలోని అబద్ధాలకోరులను తాము ఓడిస్తామని పేర్కొంది. అబద్ధాలపై పోరాడేందుకు తాము తగినంత సిద్ధమయ్యామనీ, విజయం తమదేనని కాంగ్రెస్ ట్విట్టర్‌లో విశ్వాసం వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకటనకు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వీడ్కోలు చెప్పే ప్రక్రియ మొదలైందనీ, ఓటర్లు అందుకు సిద్ధంగా ఉన్నారని వ్యగ్యంగా అన్నారు.
ఏపీ అసెంబ్లీతోపాటు ఏపీ, తెలంగాణల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
– ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 18 సోమవారం
– నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 25 సోమవారం
– నామినేషన్ల పరిశీలన: మార్చి 26 మంగళవారం
– నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28, గురువారం
– పోలింగ్: ఏప్రిల్ 11, గురువారం
– ఓట్ల లెక్కింపు: మే 23, గురువారం
తొలివిడతలోనే 18 రాష్ట్రాల్లో ఎన్నికలు
మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, 29లో 18 రాష్ట్రాలకు తొలి దేశలోనే ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. మొత్తం ఏడు దశల ఫలితాలు మే 23న వెల్లడిస్తారు. ఏ దశలో ఏయే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయంటే..
1)మొదటి విడత: 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలితప్రాంతాల్లోని 91 నియోజకవర్గాలు
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ–కశ్మీర్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్‌బెంగాల్, త్రిపుర
నోటిఫికేషన్: మార్చి 18
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ: మార్చి 25
నామినేషన్ల పరిశీలన: మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: మార్చి 28
పోలింగ్: ఏప్రిల్ 11
2) రెండో విడత: 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 97 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: పుదుచ్చేరి, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, మణిపుర్, ఒడిశా, తమిళనాడు.
నోటిఫికేషన్: మార్చి 19
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ: మార్చి 26
పరిశీలన: మార్చి 27
ఉపసంహరణ తేదీ: మార్చి 29
పోలింగ్: ఏప్రిల్ 18
3) మూడో విడతః 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 115 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, గోవా
నోటిఫికేషన్: మార్చి 28
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 4
పరిశీలన: ఏప్రిల్ 5
ఉపసంహరణ తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్: ఏప్రిల్ 23
4) నాలుగో విడత: 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్, రాజస్థాన్
నోటిఫికేషన్: ఏప్రిల్ 2
నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 9
పరిశీలన: ఏప్రిల్ 10
ఉపసంహరణ తేదీ: ఏప్రిల్ 12
పోలింగ్: ఏప్రిల్ 29
5) ఐదో విడత: 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 10
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 18
పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణ: 22 ఏప్రిల్
పోలింగ్: మే 6
6) ఆరో విడత: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: ఢిల్లీ, బిహార్, హరియాణా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 16
నామినేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 23,
పరిశీలన: ఏప్రిల్ 24
ఉపసంహరణ: ఏప్రిల్ 26
పోలింగ్: మే 12
7) ఏడో విడత: 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 నియోజకవర్గాలు
రాష్ట్రాలు: చండీగఢ్, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ్‌బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
నోటిఫికేషన్: ఏప్రిల్ 22
నామినేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 29
పరిశీలన: ఏప్రిల్ 30
ఉపసంహరణ: మే 2
పోలింగ్: మే19
Comments
Please login to add a commentAdd a comment